నా ప్రియ స్నేహితులారా, దేవుడు ఈ నూతన మాసమంతయు మిమ్మును దీవించును గాక. ఈరోజు మీతో పంచుకోవడానికి నేను ఒక గొప్ప శుభవార్తను కలిగియున్నాను. దేవుడు తన ప్రియమైన పిల్లలను ఆశీర్వదించి నప్పుడు, ఆయన వారికి ఎన్నో ఉత్తమమైన మేలులను అనుగ్రహిస్తాడు. మరియు నా ప్రియులారా, మీరు అసాధారణమైన వారు కాదు. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి, 1 పేతురు 5:4 ప్రకారం, "ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు'' అని వ్రాయబడినది. కనుకనే, ఇటువంటి ఈ మహిమ కిరీటం నేడు మీ కొరకు వేచి ఉన్నది! ఆనందించండి.
సాధారణంగా, ఏడాది పొడవునా ఫుట్‌బాల్ సీజన్ ముగిసే సమయానికి, ప్రతి ఆటగాడి ప్రదర్శనను అంచనా వేస్తారు మరియు వారి చర్యలు లెక్కించబడ తాయి. కానీ, వారు సాధించిన గోల్‌ల సంఖ్య నుండి నాయకుడిగా, జట్టుపై వారి ప్రభావం వరకు ప్రతిదీ పరిగణనలోకి తీసుకుంటారు. ఇతరులను ఉత్తేజపరచి, జట్టు గౌరవాన్ని కాపాడే వారి సామర్థ్యాన్ని కూడా గమనిస్తారు. అప్పుడు వారు, ఉత్తమ ఆటగాడుగా ఎంపిక చేయబడి ప్రత్యేకంగా, '(ది ఫుట్‌బాల్‌ర్ ఆఫ్ ది ఇయర్) ఈ ఏడాదికి ఉత్తమ ఫుట్‌బాల్ ఆటగాడు'అనే బిరుదును ప్రకటిస్తారు. తప్పనిసరియైన ఈ అంచనా మరియు గుర్తింపు ఫుట్‌బాల్ ఆటగాళ్లకు మాత్రమే పరిమితం కాదు. నా ప్రియులారా, మన చర్యలన్నింటికి దేవుడు మనల్ని జవాబుదారీగా ఉంచుతాడు. కాబట్టి, మీరు చేయు ప్రతి మంచి కార్యాలు ఎవరు కూడ చూడలేదని తలంచనవసరం లేదు. దేవుడు సమస్తమును చూస్తున్నాడు. బైబిల్‌లో ప్రకటన 20వ అధ్యాయములో చెప్పబడినట్లుగా, ఆయన మీ మంచి కార్యాలన్నిటిని జీవగ్రంథమందు వ్రాస్తాడు. ఇందులో పేదలకు మరియు అవసరతలో ఉన్న వారికి అన్నివిధాలుగా, మీరు మీ జీవితంలో జరిగించే ప్రతి మంచి కార్యాలను, మీ స్వభావములో మీరు దేవుడిని బయలుపరచే మార్గాల విధానం, మీ కుటుంబం మరియు ఇతరుల కొరకు మీరు చేయుచున్న త్యాగాలు మరియు మీరు దేవుని కొరకు వెచ్చించే సమయము మీద ఆధారపడి ఉంటాయి. అంతమాత్రమే కాదు, మీరు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి మీరు జరిగించే ప్రతి బలమైన కార్యాలు కూడ లెక్కించబడతాయి. కాబట్టి, దేనిని గురించి చింతించకండి.
నా ప్రియులారా, ప్రభువు మిమ్మును పరలోకములోనికి చేర్చుకొనుటకు వచ్చినప్పుడు, ప్రజలందరి యెదుట మిమ్మల్ని ఘనపరచి, 'భళా! నమ్మకమైనమంచి దాసుడా! నీవు కొంచెములో నమ్మకముగా ఉన్నావు కనుకనే, ఇప్పుడు నా మహిమ కిరీటాన్ని ధరించుమని' ఆయన మీకు తన మహిమ కిరీటమును ధరింపజేస్తాడు మరియు మీరు ప్రభువుచే ఆశీర్వదించబడినవారవుతారు. ఆ క్షణం ఎంత ఆనందమయంగా ఉంటుంది నా స్నేహితులారా. కాబట్టి, మీరు ఎల్లప్పుడు మీ జీవితాన్ని దేవుని ప్రీతిపరచునట్లుగా జీవించడానికి ప్రయత్నించాలి. ఆయన మార్గాన్ని అనుసరించడం ద్వారా, మీరు యేసును ఆనందపరచవచ్చును మరియు ఆయన నుండి గుర్తింపును మరియు ఘనతను ఎదురు చూడవచ్చును. కాబట్టి, నా ప్రియులారా, ఇటువంటి గొప్ప మహిమ కిరీటాన్ని పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఆలాగైతే, నేడే యేసుప్రభువును మీ స్వంత రక్షకునిగా అంగీకరించినట్లయితే, నిశ్చయముగా, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
సర్వశక్తిగలిగిన మా పరమ తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. ప్రభువా, నీ వాగ్దానం ప్రకారంగా మేము నీ యొక్క మహిమ కిరీటాన్ని పొందుకొనుటకు మాకు సహాయము చేయుము. దేవా, నీవు మా తల మీద కిరీటం ఉంచినట్లుగా, మేము దానికి తగినట్లుగా జీవించాలని ప్రార్థించుచున్నాము. ప్రభువా, ఈ లోకంలో నీ చిత్తానుసారంగా మేము మేలు చేయునట్లుగాను మరియు ఆనందమును కలిగించునట్లుగా మమ్మును నడిపించుము. దేవా, మా చర్యలు ఇతరులకు ఆశీర్వాదంగా మారాలని మరియు మేము పరిచర్యలో నీకు పరిచర్య చేయుటకు మాకు నీ కృపను అనుగ్రహించుము. ప్రభువా, మా కష్ట సమయాలలో కూడా నీ యెదుట మేము నీతిగా పని చేయడానికి మాకు సహాయము చేయుము. దేవా, మేము ప్రతి విషయాలలో నీ నడిపింపు మీద నమ్మకం ఉంచియున్నాము మరియు నీ మహిమ కిరీటం యొక్క ప్రతిఫలం కొరకు మేము ఎంతో వాంఛతో ఎదురు చూస్తున్నాము. ప్రభువా, నీ మహిమను ఈ భూలోకంలోనూ, పరలోకంలోనూ మేము అనుభవించునట్లు మాకు అటువంటి గొప్ప ధన్యతను అనుగ్రహించుమని యేసుక్రీస్తు ఉన్నత నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.