Loading...
Stella dhinakaran

బాధపరచబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నటికిని నశించదు!

Sis. Stella Dhinakaran
10 Dec
నా ప్రియులారా, నేడు దేవుడు ఈ సందేశము చదువుచున్న మీ అక్కరలను తీరుస్తానని వాగ్దానము చేయుచున్నాడు. మేము దీనదశలో మరియు బీదలమని తలంచుచున్నారా? అయితే, " అక్కరలో నున్న వారిని, బీదలను '' లోకం గౌరవించదు. వారి జీవన శైలి ఇతరుల కంటె భిన్నంగా మరియు హీనంగా ఉంటుంది. లోకంలోని ఈ పరిస్థితిని ఎరిగే ప్రభువైన యేసు క్రీస్తు దీనుడుగాను మరియు మనుష్య కుమారునిగా ఈ భూమికి ప్రత్యక్షమయ్యాడు. అయినను, " ఆయనకు తలవాల్చుకొనుటకైనను స్థలము లేదు '' (మత్తయి 8:20; లూకా 9:58) అని వాక్యము సెలవిచ్చినట్లుగానే, ఆయన మన కోసం తాను దరిద్రుడాయెను. కారణము, " తన దారిద్య్రము వలన మనము ధనవంతులు కావలెనని, మన నిమిత్తము ఆయన దరిద్రుడాయెను '' (2 కొరింథీయులకు 8:9) అన్న వచనము ప్రకారము, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు దరిద్రులమని చెప్పవద్దు, మన దేవుని ఐశ్వర్యమును నేడు మీకిచ్చుటకు సిద్ధముగా ఉన్నాడు. అవును, దేవుడు తన ఐశ్వర్యమును మనకు ఇచ్చుట కొరకే, ఈ లోకంలో ప్రత్యక్షమయ్యాడు. కారణము, " ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. పెంటకుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు '' (కీర్తనలు 113:8;1సమూయేలు 2:8) అని లేఖనములు స్పష్టముగా మనకు తెలియజేయుచున్నది. కనుకనే, ఈ క్రిస్మస్ మాసములో అక్కరులున్న వారు, బాధలున్నవారు మీరందరు ప్రభువు దృష్టిలో ప్రత్యేకమైనవారు. కాబట్టి, దేని నిమిత్తము చింతించకుండా, ధైర్యముగా ఉండండి.

ఒక కుటుంబంలో, అన్నదమ్ములందరు చాలా ఉన్నత విద్యావంతులు. మరియు వారు మంచి ఉద్యోగాలలో స్థిరపడినారు. కానీ, చివరికి వానికి చదువు సరిగ్గా రాలేదు. అతడు కడు బీదవాడు, అన్నదమ్ములందరిలోను ఎంతో దీన స్థితిలో నున్నాడు. తర్వాత, అన్నదమ్ములు తమ చిన్న తమ్మునిపై ఈసడించుకొనేవారు. కానీ, చిన్న తమ్ముడు మాత్రమే ప్రభువైన యేసునందు విశ్వాసముంచినవాడు గనుక , " యెహోవా యందు నమ్మిక యుంచువాడు సురక్షితముగా నుండును '' (సామెతలు 29:25) అను వచనము ప్రకారం, ప్రభువు అతని అంచెలంచెలుగా అభివృద్ధిపరచాడు. ప్రభువు అతని తన అన్నలకంటె ఉన్నత స్థానమునకు హెచ్చించాడు. అదే సమయంలో దేవుడు అతనికి సహాయం చేసినందున అతడు ప్రభువునందు విశ్వాసిగా ఎదిగాడు.
నా ప్రియులారా, " నేను బీదవాడను, అక్కరలో నున్నవాడనని '' చింతించక ప్రభువునందు విశ్వాసముంచుము, ఆయనే మిమ్మల్ని అభివృద్ధిపరుచును. ఎందుకంటే, దేవుని వాక్యము ఇలా చెబుతోంది, " దరిద్రులు నిత్యము మరువబడరు బాధపరచబడువారి నిరీక్షణాస్పదము ఎన్నటికిని నశించదు '' (కీర్తనలు 9:18) అన్న వచనము ప్రకారము నేడు ఈ సందేశము చదువుచున్న మీ దృష్టినంతటిని దేవునిపై ఉండనివ్వండి. అంతమాత్రమే కాదు, మిమ్మల్ని ఇతరులతో పోల్చవద్దు. దేవుడు దేని కాలంలో అది చక్కగా ఉండునట్లు దానిని చేస్తాడు. ఆయనపై మీ దృష్టిని ఉంచినప్పుడు దేవుని దయ మనుష్యులను ఆకర్షిస్తుంది, ఇది మీరు ఊహించలేనంత ఎత్తుగా మిమ్మల్ని హెచ్చిస్తుంది. మీరు ఎన్నటికిని సిగ్గునొందరు. మిమ్మల్ని అవమానించే వ్యక్తుల కంటే, ఈ దేవుని దయ ద్వారా మీరు ఉన్నత స్థానమునకు హెచ్చించబడతారు. కాబట్టి, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు దేవుని మీద నమ్మకముగా ఉండండి! ఆర్థిక పరంగాను మరియు మీ సంబంధాలు మరియు మీరు సహాయం కోరిన అన్నిటిలోను దేవుని యొక్క సహాయము పొందుతారు. దేవుడు మీ శ్రమల నుండి ఇప్పుడే మిమ్మును విడిపించి, మీ దరిద్రతను మార్చి, తన కనికరము చొప్పున మీకున్న నిరీక్షాణస్పదము మీ నుండి తొలగకుండా మిమ్మల్ని ఆశీర్వదించును గాక!
Prayer:
కరుణావాత్సల్యత కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రీ,

ప్రభువా, మానవ హృదయారంతరంగాన్ని ఎరిగినవాడవు. బీదలను, అక్కరలో నున్న వారిని, లోకం విసర్జించిన వారిని చూస్తున్నవాడవు, మేము నీ యందు నమ్మిక యుంచి, నీ మీద దృష్టిని కేంద్రీకరించియున్నాము. నీవే శ్రద్ధ వహించేవాడవు. మమ్మల్ని జ్ఞాపకంలోనికి తెచ్చుకొనుము. మా చేతిని పట్టుకొని సరైన రీతిలో మమ్మల్ని నడిపించుము. నీ చిత్త ప్రకారం నడిపించుమని వేడుకొనుచున్నాము. దేవా, ఈ లోకములో మేము అనుభవించు శ్రమల నుండి విడిపించుటకు నీవు మాత్రమే సమర్థుడవని మేము నమ్ముచున్నాము. దేవా, మా జీవితంలో ఉన్న కష్టాలను తొలగించుము. నేడు ఈ లోకములో మేము పొందు శ్రమల నుండి ఎవ్వరు మమ్మును విడిపించలేరు. కానీ, నీ దయాకనికరము మమ్మును విడిచిపోదని మేము విశ్వసించుచున్నాము. మాకు కలిగిన శ్రమల నుండి విమోచించి మా జీవితాన్ని పరిపూర్ణ శాంతితో నింపుము. మేము ఎదుర్కొనుచున్న బాధలు, దరిద్రతను మార్చి, నిత్యము మేము నీ చేత మరువబడకుండా ఉండునట్లుగా నీవు మమ్మును జ్ఞాపకము చేసుకొనుము. ప్రభువా, నీవు దీనులను ఆదరించే దేవుడవు కనుకనే, ఈనాడు మాకు కలుగు శ్రమల నుండి విడిపించి, ఆదరించి మా జీవితాలకు విశ్రాంతిని దయచేయుము. ఈనాటి నుండి మా దుఃఖమును సంతోషంగా మార్చి, నీ కృపతో మమ్మును బలపరచుమని మా రక్షకుడును విమోచకుడవైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000