Loading...
Stella dhinakaran

దేవుని ప్రేమను మీరు రుచి చూచి తెలుసుకొనుడి!

Sis. Stella Dhinakaran
16 May
నా ప్రియులారా, ఈ సందేశము చదువుచున్న మీరు దేవుని ఎంతగా ప్రేమించుచున్నారో అంతగా దేవుడు మీకు దీవెనలిస్తాడు. ఎందుకంటే, మీరు దేవుని ఎంతగా ప్రేమించుచున్నారో మీ ప్రేమ ఆ దేవునికి తెలుసు. " ఒకడు దేవుని ప్రేమించిన యెడల అతడు దేవునికి ఎరుకైన వాడే '' (1 కొరింథీయులకు 8:3) అని బైబిల్ చెప్పిన విధంగా, మిమ్మల్ని దేవుడు ఎరిగియుండాలంటే మీరు ఆయనను ప్రేమించాలి. ఎందుకనగా, " దేవుడు ప్రేమా స్వరూపి '' (1 యోహాను 4:8) అని బైబిల్ చెప్పిన విధంగా, ఆయన మిమ్మును ఎంతో ఇష్టంతో ప్రేమిస్తున్నాడు. కాబట్టియే ఆయనను మనము ప్రేమించుచున్నాము అని లేఖనము సెలవిచ్చుచున్నది " ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము '' (1 యోహాను 4:19). దేవుడు మనలను ఎంతో ఇష్టంగా ప్రేమించుట అనునది సంతోషకరమైన జీవితం. మనం కూడ మన పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో ఆయనను ప్రేమిస్తే ఆయన అపరిమితంగా ఆనందిస్తాడు. ఆయన మన ప్రేమ లోతును కొలిచి, మనలను నడిపిస్తాడు. ఎప్పుడైతే దేవుని ప్రేమ మనలో నిలిచియుంటుందో అప్పుడు మన జీవితాలు సంతోషంగా మారతాయి. 

నా పదహారేళ్ల వయస్సు ప్రాయం నుండి నేటి వరకు అనగా, ఇన్ని యేండ్లుగా దేవుని దివ్యమైన ప్రేమను పొందిన నేను నా జీవితములో ఆనందాన్ని పొందుతున్నాను. నా చింతలను, భారములను సహించడానికి మధురమైన యేసు ప్రేమ నాకు చాలునని నేను సంతోషంగా పాడగలను. ఔను! ఇది నిజంగా సంతోషకరమైన జీవితం. మీరు ఆయనలో నిజంగా నివసిస్తూ సంతోషకరమైన జీవితాన్ని కొనసాగిస్తున్నారా? " మన ప్రభువైన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగినవాడు ''(1 కొరింథీయులకు 1:9) అని బైబిల్ చెప్పిన విధంగా, ఆయన ప్రేమ ద్వారా మిమ్మును పిలుచుచున్నాడు. 

నా ప్రియ సోదరీ, సోదరులారా, ఒకవేళ అలా కాకుంటే ఇప్పుడే ఆయన వద్ద మీరు మీ జీవితాన్ని అప్పగించుకుని ఆయనలో నివసించే ఈ ఆనందకరమైన జీవితాన్ని పొందుకునే వరకు ఆయనను విడువకండి. " నా యందు నిలిచి యుండుడి, విూ యందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షావల్లిలో నిలిచి యుంటేనేగాని తనంతట తానే యేలాగు ఫలింపదో, ఆలాగే నా యందు నిలిచి యుంటేనే కాని విూరును ఫలింపరు. ద్రాక్షావల్లిని నేను, తీగెలు విూరు. ఎవడు నాయందు నిలిచియుండునో నేను ఎవనియందు నిలిచి యుందునో వాడు బహు గా ఫలించును; నాకు వేరుగా ఉండి విూరేమియు చేయలేరు '' (యోహాను 15: 4,5) అని బైబిల్ చెప్పిన విధంగా, దేవుని ప్రేమ మీలో కుమ్మరించబడు వరకు ద్రాక్షావల్లిలో తీగెలు ఎలా నిలిచియుంటాయో ఆ విధంగా విూరు కూడ దేవుని విడువకుండా హత్తుకొని, ఆయనను ప్రేమించండి. 

ఒక రోజు ఒక తల్లి తన బిడ్డ తననెంత ప్రేమిస్తుందో చూద్దామని అనుకుంది. ఆమె తన బిడ్డను తీసుకుని ఆడుకోవడానికి తోటకు వెళ్లింది. బిడ్డ ఆడుకునేటప్పుడు ఆమె ఒక పెద్ద చెట్టు వెనుక దాక్కొంది. కొంత సేపటి తరువాత ఆ బిడ్డ తన తల్లిని వెదుకుచు అటూ ఇటూ పరుగెత్తి ఆమెను కనుగొనలేక పెద్దగా ఏడ్వడం మొదలు పెట్టింది. తన బిడ్డ ఏడ్పును విని తల్లి తాను దాక్కున్న స్థలం నుండి పరుగున బయటకి వచ్చి పాపను కౌగలించుకుని ముద్దులు పెట్టింది. తన బిడ్డ తనను అపరిమితంగా ప్రేమిస్తున్నదని తెలుసుకొని ఆ తల్లి ఆత్మానందాన్ని పొందింది. 

ఆలాగుననే, బైబిల్లో యోబును చూచినట్లయితే, అతను సర్వసంపదలు కలిగినటువంటి వ్యక్తి. కానీ, యోబుకు దేవునిపై వున్న ప్రేమను పరీక్షించుటకు అపవాది ద్వారా శోధనలు కలుగజేసెను. తనకు కలిగిన సమస్తాన్ని పోగొట్టుకొనునట్లు చేసాడు. యోబు బూడిదలో కూర్చుని పశ్చాత్తాపపడే వరకు శ్రమపడనిచ్చాడు. అయితే, యోబు దేవుని ప్రేమ నుండి వీడిపోలేదు. కావుననే,చివరికి అతనికి ఆరోగ్యాన్ని మళ్లీ ఇచ్చాడు. గతంలో అతనికున్న ఆస్తికంటే, రెండింతలు ఎక్కువ ఆస్తిని ఇచ్చి అతడు తన నాలుగవ తరాన్ని చూసుకునేలా దేవుడు అతనిని ఆశీర్వదించాడు (యోబు 1; 42:10,16)
నా ప్రియులారా, ఈ విధంగానే ప్రభువును కూడ మనం ప్రేమిస్తున్నామా? లేదా? అని తెలుసుకునేందుకు ఆయన మనలను జాగ్రత్తగా పరీక్షిస్తుంటాడు. కాబట్టి మనలను మనం కొంత పరిశీలించుకుని మన లోపాలను ఆయన ముందు ఒప్పుకోవాలి. మిమ్మును ప్రేమించుటకును, మీ గురించి కన్నీరు కార్చుటకును ఎవ్వరు లేరని కలత చెందుచున్నారా? కలవరపడకండి, మన ప్రభువైన యేసుక్రీస్తుకు మీ ప్రేమ తెలుసు, ఆయన కూడ ఇటువంటి ప్రేమ కొరకు దాహముగొన్నాడు. ఇతరులు మనలను విడిచి పెట్టవచ్చును. కానీ, మనం ఆయనను హృదయపూర్వకంగా ప్రేమించినప్పుడు ఆయన మనలను ఎన్నటికిని విడువడు (కీర్తనలు 91:14) అన్న వచనము ప్రకారం, మీరు కూడ యోబు వలె దేవుని ప్రేమించినప్పుడు, ఆయన మిమ్మల్ని యోబు వలెనే రెండంతలుగా ఆశీర్వదిస్తాడు. కారణము, దేవుడు ప్రేమా స్వరూపియై యున్నాడు. ఆయన ప్రేమ యందు మీరు నిలిచియున్నప్పుడు మీ యందు ఆయన నిలిచియుంటాడు. ఈ లోక ప్రేమకన్న, మీ కొరకు తన ప్రాణమును త్యాగము చేసిన యేసుకు మీ జీవితాలను సమర్పించుకోండి, మీ యందు ఆయన నిలిచియుండునట్లు చూడండి. ఆయన మిమ్మును కౌగిలించుకొని ఆయన పట్ల మీకున్న ప్రేమను కొలిచి మిమ్మును ముద్దాడి, మిమ్మును ఆశీర్వదిస్తాడు.
Prayer:
ప్రేమకు పాత్రుడవైన మా ప్రియ పరలోకపు తండ్రీ, 

నీ ప్రేమ ఎవరితోను మరియు దేనితోను పోల్చలేనిది. నేటి నుండి మా హృదయపూర్వకంగా నిన్ను ప్రేమించే శక్తిని మరియు నీ దివ్య ప్రేమను అపరిమితంగా అనుభవించే భాగ్యాన్ని మాకు దయచేయుమని వేడుకుంటున్నాము. ఎన్నడు విఫలంకాని నీ ప్రేమ నిమిత్తం మేము నిన్ను స్తుతిస్తున్నాము. దేవా, నీ దివ్య ప్రేమను మా హృదయములోనికి ప్రవేశించునట్లు మా హృదయాలను నీ వైపునకు తెరచియుంచాము. దేవా, మానవుని ప్రేమ అంతలోనే విరిసి, అంతలోనే వాడును. కానీ, నీ ప్రేమ ఎన్నటికి మారనిది. ద్రాక్షవల్లిలో తీగెలు నిలిచియుంటూ ఫలించులాగుననే, నీ ప్రేమలో మేము కూడ ఎల్లప్పుడు నిలిచియుండునట్లు నీ ప్రేమను మాలో కుమ్మరించుము. మమ్మును ద్వేషించు వారిని మేము ప్రేమించుటకు నీ ప్రేమా హృదయమును మాకిమ్ము. నీ ప్రేమ హస్తాలకు మమ్మును మేము సంపూర్ణముగా సమర్పించుకుంటున్నాము. నీ ప్రేమ ద్వారా మమ్మును నీ పిల్లలనుగా చేర్చుకొనుము. నీ ప్రేమలో మేము ద్రాక్ష తీగెలవలె అంటుకట్టుకొని జీవించునట్లు కృపనిచ్చి మమ్మల్ని బహుగా ఫలించునట్లు చేయుమని యేసు ప్రభువు యొక్క ప్రేమగల అద్భుతమైన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రీ, ఆమేన్. 

For Prayer Help (24x7) - 044 45 999 000