Loading...
Dr. Paul Dhinakaran

వెలకట్టలేని యేసుక్రీస్తు రక్తము ద్వారా మీరు కొనబడ్డారు!

Dr. Paul Dhinakaran
12 Dec
నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు మీ సొత్తు కాదు. మీరు విలువపెట్టి కొనబడినవారని దేవుని వాక్యము మనకు తెలియజేయుచున్నది. మరియు ఈ లోకములో గొప్ప వార్త ఏమిటంటే, " నన్ను శిక్షించకుండా, విమోచించడానికి దేవుని కుమారుడు ధరను చెల్లించాడు! '' అని తలంచినప్పుడు నా హృదయం నాలో ఎంతగానో ఆనందించినది. క్రీస్తులో జీవించడం కేవలం నైతిక విలువలను లేదా పారంపర్య ఆచారాల వంటి విలువలు కాదు. దానికి బదులుగా, ఇది ఆత్మ, జీవము మరియు శరీరంలో సంపూర్ణమైన విడుదలను కలిగి ఉంటుంది.

ఒకసారి అబ్రాహాము లింకనుగారు ఒక వీధిలో నడిచి వెళ్తుండగా, ఒక యౌవనస్థురాలైన అమ్మాయిని విక్రయించుటను మరియు ఆ అమ్మాయి ఎంతగానో కన్నీరు కార్చుటయు చూశారు. ఆ దృశ్యం, లింకన్‌గారి యొక్క హృదయాన్ని కదిలించి వేసింది. వెంటనే ఆయన డబ్బు చెల్లించి ఆమెను వారి యొద్ద నుండి కొన్నాడు. అంతమాత్రమే కాదు, ఆమెను తన గృహమునకు తీసుకొని వెళ్లారు. ఇంటికి చేరిన తర్వాత ఆయన, " కుమార్తె నిన్ను విడిపించుటకే డబ్బు చెల్లించి, నిన్ను కొన్నాను. కనుకనే, ఇక నీవు నీ ఇష్టము వచ్చిన చోటికి వెళ్లవచ్చును '' అని ఆమెతో చెప్పాడు. అందుకు ఆమె ఆశ్చర్యపడి ఆయన పాదముల పైబడి, " అయ్యా! నిజంగా నేను స్వతంత్రురాలినైతే, నా జీవితాంతం నేను మీకు సేవ చేయునట్లుగా మీరు నాకు అనుమతివ్వాలని కోరుచున్నాను '' అని చెప్పినది. దానికి లింకన్‌గారు ఎంతో సంతోషించారు. ఆమె అబ్రాహాము లింకన్‌గారికి విశ్వాసనీయమైన స్నేహితురాలిగా ఉంటూ, ఆయనకు ఎంతో ప్రేమతో సేవలు చేసినది.
నా ప్రియులారా, నేడు మనలను అపవాది బానిసత్వము నుండి విడిపించుట కొరకే యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చాడు. మనము ఎలా విడిపించబడ్డాము? ఆయన మనలను కొంత డబ్బు లేక డాలర్స్ ఇచ్చి కొనలేదు. మనము ఎలా కొనబడ్డామని లేఖనాలు ఈవిధముగా మనకు తెలియజేయుచున్నది, " మీరు మీ సొత్తు కారు, విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి '' (1 కొరింథీయులకు 6:20) అన్న వచనము ప్రకారము ఆయన తన సొంత కుమారుని యొక్క రక్తాన్ని చిందించి, నిన్ను, నన్ను కొనియున్నాడు. అవును, దేవుడు తన ప్రజలను వారి పాపం, అపరాధం మరియు శాపం నుండి విడిపించి కొనుగోలు చేయడానికి తన కుమారుని చెల్లించినప్పుడు, అది వారి శరీరాలకు మరియు వారి ఆత్మలకు విమోచన క్రయధనముగా ఉన్నది. ఈనాడు ఈ సందేశము చదువుచున్న మీ వ్యాధి నుండియు, శాపము నుండి మరియు పాప బంధకముల నుండి ఆయన మిమ్మును విమోచించియున్నాడు. అందుకే బైబిలేమంటుందో చూడండి, " మీరు విలువపెట్టి కొనబడినవారు గనుక మనుష్యులకు దాసులు కాకుడి '' (1 కొరింథీయులకు 7:23) అన్న వచనము ప్రకారము మీరు ఆయనచే కొనబడియున్నారు. గనుక, మీ ఆత్మ, శరీరము, జీవమును ఆయనకు సొంతమైయున్నవి. మీరు స్వతంత్రముగాను మరియు సంతోషముగాను జీవించునట్లుగా చేసియున్నాడు. ఆయన నామానికి ఘనత తీసుకొనివచ్చేందుకు పవిత్రమైన జీవితాన్ని గడపండి మరియు దానిలో సంతోషించండి. ఒకవేళ నేడు ఈ సందేశము చదువుచున్న మీరు పాపము, అపవాది, వ్యాధి, అప్పులు, దుర్‌వ్యసనములను బంధకముల చేత పట్టబడియున్నట్లయితే, మిమ్మల్ని తన రక్తము ద్వారా విలువపెట్టి కొన్న యేసుప్రభువునకు మీ జీవితాలను సమర్పించినట్లయితే, నిశ్చయముగా, మీ బంధకముల నుండి మిమ్మల్ని విడిపించి, స్వతంత్రులనుగా చేసి ఆనందింపజేస్తాడు.
Prayer:

ప్రేమగల మా పరలోకపు తండ్రీ,

అపవాది రాజ్యము నుండి మరియు బానిసత్వము ద్వారా విడిపింపబడుటకు యేసు రక్తము ద్వారా మమ్మల్ని కొన్నందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. ప్రభువా, నీ వెలుగు ద్వారా మా మార్గములను ప్రకాశింపజేయుము. అనేకులను రక్షణ వెలుగులోనికి నడిపించుటకు మాకు సహాయము చేయుము. పాపము మరియు దుర్ వ్యసనముల ద్వారా పట్టబడియున్న మమ్మల్ని మరియు మా ప్రియులగువారిని నేడు యేసు ప్రభువు రక్తము ద్వారా విడిపించి, స్వతంత్రులనుగా మార్చుము. నేడు బంధకములో ఉన్న మమ్మల్ని విమోచన క్రయధనంగా మార్చినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. ప్రభువా, ఈనాటి నుండి నీ యొక్క నామమునకు ఘనతను తీసుకొని వచ్చేవారలనుగా మమ్మల్ని పరిశుద్ధపరచుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000