Loading...
Evangeline Paul Dhinakaran

సహనముతోనున్న వారికి జవాబును ఇచ్చే దేవుడు!

Sis. Evangeline Paul Dhinakaran
16 Apr
నా ప్రియమైనవారలారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీ జీవితములో దేవుడు గొప్ప అద్భుతములను జరిగిస్తాడు. ఈ వెబ్‌సైట్ చూచు మీరు అనేక కార్యాలను గూర్చి ఎంతగానో చింతించుచున్నారా? ఎంతో కాలము నుండి ప్రార్థించుచున్నాము కానీ, మా ప్రార్థనకు జవాబు రాలేదని దిగులు చెందుచున్నారా? భయపడకండి, మీరు ఈలోక మానవుల కొరకు కనిపెట్టుకొనియున్నట్లయితే, వారు మిమ్మును చేయి విడిచిపెడతారు, కానీ, దేవుని కొరకు కనిపెట్టుకొనియున్నప్పుడు మీరు ఎంత మాత్రము అవమానము పొందరు, మీరు నూతన బలము పొందుతారు. " యెహోవా కొరకు కనిపెట్టుకొనువారు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరుగెత్తుదురు సొమ్మసిల్లక నడిచిపోవుదురు '' అన్న వచనము ప్రకారము మీరు ఆయన కొరకు కొనిపెట్టుకొనియున్నప్పుడు ఆయన మీ ఎదురు చూపులకు జవాబు కలుగజేసి, పక్షిరాజువలె మీరు రెక్కలు ధరించి ఎగురునట్లు చేస్తాడు. ఇంకను, " యెహోవాకొరకు కనిపెట్టుకొనువారు దేశమును స్వతంత్రించుకొందురు'' అన్న వచనము ద్వారా మీరు కోరిన ప్రతి వాటిని తగిన సమయమందు స్వతంత్రించుకొంటారు. 

ఆలాగుననే, నా ప్రియులారా, ఇంకను మీరు దేవుని కొరకు కనిపెట్టుకొని యున్నట్లయితే, ఏమి జరుగుతుందో చూడండి, " యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని ఆయన నాకు చెవి యొగ్గి నా మొఱ్ఱ ఆలకించెను '' (కీర్తనలు 40:1) అన్న వచనము ప్రకారము కొన్ని అవసరముల కొరకు మనము ఎదురు చూడవలసిన అవసరము ఉన్నది. ఈ విధంగా కనిపెట్టుకొనియున్నప్పుడు, ప్రభువు మనకు సహనమును అనుగ్రహిస్తాడు. అటువంటి సమయములో ఆయన సన్నిధిని ఆనందించుచు పరిశుద్ధముగా జీవించుటకు ప్రభువు కృపను అనుగ్రహించును. కనిపెట్టుకొనియుండుట చాలా కష్టతరమైన విషయము. అనేకులు ఆశించునది వెంటనే లభించకపోయినప్పుడు, నిరాశపడుదురు. కొందరు " అంతే మన జీవితము '' అని తమను తాము సమాధానపరచుకొనుచున్నారు. కానీ, మనము దేవుని పాద సన్నిధిలో తినకుండా, నిద్రించకుండ ప్రార్థించెదము. అయినను మన ప్రార్థనకు జవాబు రాలేదని నిరాశ చెందుతాము కదా. 
ప్రభువైన యేసును ముఖాముఖిగా చూడవలెను. ఆయన యొద్ద నుండి నేను జవాబును పొందవలెను అని అద్భుతమును పొందుటకు అనేకులు, " యేసు పిలుచుచున్నాడు '' ప్రార్థన గోపురములకు వచ్చుచున్నారు. విశ్వాసముతో వచ్చిన వారు వేడుకొనిన దానిని ప్రభువు అనుగ్రహించుచున్నాడు. " ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి యుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పెను '' (మత్తయి 18:20) అని ప్రభువు సెలవిచ్చిన ప్రకారం ప్రార్థన గోపురములలో నిర్వహించబడు ఆశీర్వాద కూటములలో, ఏక మనస్సుతో చేయుచున్న ప్రార్థనలను ఆలకించుచున్నాడు. అవును, ఆయన మీ ప్రార్థనకు కూడ జవాబును అనుగ్రహించును. ప్రభువైన యేసు నామమున మనము అడిగినప్పుడు, ఆయన మన పట్ల అద్భుతములను జరిగిస్తాడు. కనుక, కలవరపడకండి. దేవుడు దేని కాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును నెరవేర్చును (ప్రసంగి 3:11). 

యేసుక్రీస్తు ఈ లోకములో జీవించినప్పుడు, ఆయన మరల తూరు ప్రాంతములు విడిచి, సీదోను ద్వారా దెకపొలి ప్రాంతముల మీదుగా గలిలయ సముద్రమునొద్దకు వచ్చెను. అప్పుడు వారు చెవుడుగల నత్తివాని ఒకని ఆయన యొద్దకు తోడుకొని వచ్చి, వాని మీద చెయ్యి యుంచుమని ఆయనను వేడుకొనిరి. సమూహములో నుండి ఆయన వానిని ఏకాంతమునకు తోడుకొని పోయి, వాని చెవులలో తన వ్రేళ్లుపెట్టి, ఉమ్మివేసి, వాని నాలుక ముట్టి ఆకాశమువైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ' ఎప్ఫతా ' అని వానితో చెప్పెను; ఆ మాటకు తెరవబడుమని అర్థము. అంతట వాని చెవులు తెరవబడెను, వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాటలాడు చుండెను. అప్పుడాయన ఇది ఎవనితోను చెప్పవద్దని వారి కాజ్ఞాపించెను; అయితే ఆయన చెప్పవద్దని వారి కాజ్ఞాపించిన కొలది వారు మరి ఎక్కువగా దానిని ప్రసిద్ధిచేయుచు ఈయన సమస్తమును బాగుగా చేసియున్నాడు; చెవిటి వారు వినునట్లుగాను మూగవారు మాటలాడునట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడిరి (మార్కు7:31-37).

నా ప్రియులారా, ప్రభువైన యేసు, సమస్తమును బాగుగా చేసియున్నాడని మనము దేవుని వాక్యమునందు చదివెదము (మార్కు 7:37). కావుననే, నేడు ఈ సందేశము చదువుచున్న మీ ప్రార్థనను ఆలకించి, ఆయన మిమ్మును నీరు కట్టిన తోటవలె మార్చును (యెషయా 58:11). అవును, ప్రభువు మిమ్మును క్రొత్తగా ఉపయోగించుకొనును. ఆయన మీ కుటుంబములో సమస్త ఆశీర్వాదములను అనుగ్రహించును. మీరు యేసుని తోటగా నుండి, దేవుని రాజ్యమును కట్టెదరు. 

నా ప్రియమైన సహోదర, సహోదరీలారా, ఈ వెబ్‌సైట్ చూచు మీరు కూడ అనేక సార్లు సమస్యల ద్వారా, అవమానములు, నిందల ద్వారా సొమ్మసిల్లి అలసియుండవచ్చు, వివాహము కాలేదా? ఎంతో కాలము నుండి సంతానము లేదనియు, అప్పులతో సతమతమౌతున్నాము, మేము ఎంతో కాలము నుండి దేవుని కొరకు కనిపెట్టుకొని యున్నాము, మా జీవితములో దేవుడు ఒక అద్భుతము చేస్తాడా? అని ఆయన కొరకు వేచియున్నారా? కలవరపడకండి, అటువంటి సమయములో మీరు దేవుని సన్నిధిలో గడపండి, యెహోవా కొర కు కనిపట్టుకొనియుంటూ విశ్వాసములో దృఢంగా వుండాలి. యెహోవా కొరకు కనిపెట్టుకొనియుండు మీరు నూతన బలము పొందెదరు. ఇంకను మీ సమస్యల ద్వారా అలసి, సొమ్మసిల్లిన మీకు ఆయన బలమునిస్తాడు, శక్తిహీనులైన మీకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. యెహోవా కొరకు కనిపెట్టుకొనుచు ఈ వెబ్‌సైట్ చూచు మీరు విడుచు ప్రతి కన్నీటి బొట్టును తుడుస్తాడు, ఆయన కొరకు కనిపెట్టుకొని యున్నప్పుడు మీరు పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరుగెత్తుదురు సొమ్మసిల్లక నడిచిపోవుచు, బలముగలవారై దేవునిలోను, ఈ భూమి మీద ను మీరు వర్థిల్లుచు ఆశీర్వదింపబడుదురు. 
Prayer:
ప్రేమగల మా పరలోకపు పరమ తండ్రీ, 

మమ్మును సాతాను బంధకముల నుండి విడిపించుము. ఇహలోక సంబంధమైన బలహీనతల వలన సొమ్మసిల్లి ఉన్నతమైన స్థితిలో వుండలేక పోతున్నాము, దయతో మమ్మును క్షమించి, మా అతిక్రమములను మన్నించి నీ కుమారుడైన యేసుక్రీస్తు రక్తముతో కడిగి మమ్మును శుద్ధులనుగా చేయుము. మా కొరకు నీ ప్రాణమును పెట్టి మరణమగునంతగా సొమ్మసిల్లిన మాకు నీవే బలమిచ్చువాడవు. మేము పొందిన అవమానములకు, కన్నీటికి బదులుగా నీవు మాకు నూతన బలము నిమ్ము. ఎటువంటి స్థితిలోను నీయందు మేము విశ్వాసముంచునట్లు చేయుము. దేవా, మా ముఖము మీది ప్రతి బాష్పబిందువును తుడిచివేసి, మా ప్రతి కార్యములోను, ప్రార్థనలలో తప్పక మాకు జవాబిచ్చి, మా బలహీనతల నుండి విడిపించి మాకు బలాభివృద్ధి కలుగజేయుము. సొమ్మసిల్లు వేళలో నీవు మమ్మును పక్షిరాజువలె బలపరచి ఆశీర్వదించుమని సమస్త స్తుతి ఘనత మహిమ నీకే చెల్లిస్తూ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

1800 425 7755 / 044-33 999 000