Loading...

సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు!

Sharon Dhinakaran
07 Dec
నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు ఈ లోకములో ఐక్యత కలిగి జీవించాలని ప్రభువు మీ పట్ల కోరుచున్నాడు. సహోదరులలో ఐక్యత కలిగియుండటం చూడదగినదిగా ఉంటుంది! నేటి సాంస్కృతిక సమాజములో ఇది చాలా అరుదు మరియు దాదాపుగా ఎవరి మధ్యలో ఇది కనిపించుట లేదు. కుటుంబంలో మరియు సంఘములో ఐక్యత లేకుండా వ్యతిరేక భావము కలుగుతుంది. ఐక్యతను కోరుకునే హృదయం తేడాలను పట్టించుకొనదు. దానికి బదులుగా, ప్రేమతో ఒకరినొకరు ఉన్న ఐక్యతలో ఆసక్తి ఉంటుంది మరియు స్నేహ పూర్వకమైన ప్రేమ శాంతిని కాపాడుతుంది. " శరీర మొక్కటే, ఆత్మయు ఒక్కడే; ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై యొక్కటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి. ప్రభువు ఒక్కడే, విశ్వాస మొక్కటే, బాప్తిస్మమొక్కటే, '' (ఎఫెసీయులకు 4:4,5) అన్న వచనము ప్రకారము అందరికి తండ్రియైన దేవుడు ఒక్కడే. ఆయన అందరికిపైగా ఉన్నవాడై అందరిలోను వ్యాపించి, అందరిలో ఉన్నాడని లేఖనము మనకు తెలియజేయుచున్నది. " ప్రేమగలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలె ఉండుటకు, మనమన్ని విషయములలో ఎదుగుదము. ఆయన శిరస్సయి యున్నాడు, ఆయన నుండి సర్వశరీరము చక్కగా అమర్చబడి, తనలోనున్న ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన గలిగిన బలముచేత అతుకబడి, ప్రేమ యందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసికొనుచున్నది '' (ఎఫెసీయులు 4:16) అన్న వచనము ప్రకారము ప్రేమగలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలె ఉండుటకు, మనమన్ని విషయములలో ఎదగవలెను.

కొన్ని సంవత్సరాల క్రితం, లాస్ ఏంజల్స్నందు, వికలాంగుల ఒలింపిక్స్లో, 50 మీటర్ల పరుగు పందెంలో, పందెమును ప్రారంభించే ఆడగాళ్లు తుపాకీ పేల్చి ప్రారంభించారు. వెంటనే, పోటీదారులు పరుగెత్తారు. వారు ముగింపు రేఖ వైపు పరుగెత్తుతుండగా ఒక బాలుడు ట్రాక్ వదిలి రంగంలో నిలబడి ఉన్న తన స్నేహితుల వైపు పరుగెత్తడం ప్రారంభించాడు. ఈ సంఘటనల సమన్వయకర్త అయిన కెన్ అను వ్యక్తి తన విజిల్ ఊది, ఏలాగైన సరే బాలుడిని తిరిగి మార్గములోనికి తీసుకురావడానికి ప్రయత్నించాడు. కానీ, ప్రయత్నము విఫలమై ఏమి ప్రయోజనం లేకపోయినది. అప్పుడు ఇతర పోటీదారులలో ఒక వ్యక్తి గమనించాడు, మందపాటి గాజు కళ్ళజోడును తొడుగుకొన్న డౌన్ సిండ్రోమ్ వ్యాధితో ఒక అమ్మాయి ఉండెను. ఆమె ముగింపు రేఖకు దగ్గరలో ఉన్నప్పుడు కొద్దిసేపు ఆగి, ' ఆపు, ఇదే మార్గం ' అని అబ్బాయిని సరైన గీతలోనికి పిలిచింది. ' ఆ గొంతు విన్న బాలుడు ఆగి ఆమె వైపు చూశాడు. ' తిరిగి రండి, ఇదే మార్గం ' అని ఆమె మళ్ళీ పిలిచింది. బాలుడు అయోమయంలో అక్కడ నిలబడ్డాడు. అతను అయోమయంలో పడ్డాడని తెలుసుకున్న ఆమె గీతను వదిలి అతని దగ్గరకు పరిగెత్తింది. ఆమె అతనితో చేతులు పట్టుకొని మరియు వారిద్దరు కలిసి తిరిగి సరైన రేఖ వద్దకు పరిగెత్తి పందెమును ముగించి విజయమును సాధించారు. వారు సరిహద్దులను దాటిన ఆఖరువారు, కానీ వారి తోటి ఆటగాళ్ల నుండి కౌగిలింతలు మరియు ప్రేక్షకుల నుండి శుభవచనములతో అందరి చేత అభినందించబడ్డాడు.

నా ప్రియులారా, ఐక్యత యొక్క బంధంలో కొనసాగడానికి, ఇతరులు తమ మార్గాన్ని కనుగొనడంలో సహాయపడటానికి జీవితంలో మన స్వంత లక్ష్యాల నుండి సమయాన్ని వెచ్చించడం చాలా ప్రాముఖ్యం. దీనిని గురించి ప్రతిబింబిస్తూ కెన్ 1 థెస్సలొనీకయులకు 5:11 వచనమును గుర్తు చేసుకున్నాడు, " కాబట్టి, మీరిప్పుడు చేయుచున్నట్టుగానే యొకనినొకడు ఆదరించి యొకనికొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి. '' ఓర్పు మరియు ప్రోత్సాహాన్ని ఇచ్చే దేవుడు ఐక్యత గల ఆత్మను మీకు అనుగ్రహిస్తాడు. మీరు క్రీస్తు యేసును అనుసరిస్తున్నప్పుడు మీలో ఐక్యత కలుగుతుంది. ఐక్యతకు మరియు పరస్పర కలయికకు మార్గము చూపడానికి మనం అన్ని విధాల ప్రయత్నాలు చేద్దాం. కాబట్టి, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు ఐక్యత కలిగి జీవించాలంటే, మీ జీవితాలను దేవుని చేతులకు అప్పగించుకొని, ఆయన నీతిని రాజ్యాన్ని వెదకండి, అప్పుడు ఆయన ప్రేమను మీ హృదయములో కుమ్మరించి, ఐక్యత గల ఆత్మను మీకనుగ్రహించి, సంఘములో గానీ, కుటుంబములో కానీ, అందరిని ప్రేమించే మరియు ఐక్యత కలిగియుండే ఆత్మను మీకు అనుగ్రహించి మిమ్మల్ని ఆనందింపజేస్తాడు.

Prayer:
ప్రేమామయుడవైన మా పరలోకపు తండ్రీ,

మా మధ్యలో ఎడబాటును పొందుకున్న మమ్మల్ని క్షమించమని నీ కుమారుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము. కుటుంబం, సంఘము, దేశం మరియు కార్యాలయంలో ఐక్యత గల ఆత్మను మాకు దయచేయుము. మా హృదయంలో ఉన్న సకల విధములైన వ్యతిరేక కార్యాలన్నిటిని లేకుండా ఉండడానికి మాకు సహాయము చేయుము. తద్వారా, దేవుడు పరిపాలించే నివాసంగా మేము కలిసి ఐక్యతతో జీవించునట్లు మాకు కృపను అనుగ్రహించుము. సంఘములో మరియు కుటుంబములో విబేధాలకు కారణమయ్యే విమర్శించే ఆత్మ, ఖండించే ఆత్మ మరియు తీర్పు నిచ్చే ఆత్మకు మేము దూరంగా ఉండటానికి మాకు సహాయము చేయుము. మా సంబంధాలను పునరుద్ధరించడానికి, మాకు సహనం ఇవ్వడానికి మరియు మమ్మల్ని ఒకటిగా మార్చడానికి మా కుటుంబ బాంధవ్యమును భాగు చేయుము. మేము ఒకరి పట్ల ఐక్యత కలిగి జీవించునట్లు మాకు కృపనిమ్ము. ఎల్లప్పుడు అందరి పట్ల ప్రేమ కలిగి జీవించునట్లు నీ యొక్క ప్రేమ మరియు ఐక్యతను మాకు దయచేయుమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000