Loading...
Stella dhinakaran

యెహోవాయే మీకు దుర్గము, రక్షణాధారము!

Sis. Stella Dhinakaran
12 Jun
నా ప్రియులారా, ఈ భయంకరమైన పాప లోకంలో మనంతట మనమే జ్ఞానమును ప్రజ్ఞను నమ్ముకొని జీవించలేము. కనుకనే, నేడు ఈ సందేశము చదువుచున్న మీకు సంపూర్ణ బలమును మరియు దుర్గముగా ఉండాలని మీ పట్ల కోరుచున్నాడు. కారణము మన ప్రభువైన యేసుక్రీస్తు మనకు దుర్గమునై యున్నాడు. అందుకే బైబిలేమంటుందో చూడండి, " యెహోవా నా దుర్గము నా గానము ఆయన నాకు రక్షణాధారమాయెను '' (కీర్తనలు 118:14) అన్న వచనము ప్రకారము అంతమాత్రమే కాదు, ఆయనే మనకు రక్షణాధారముగా ఉన్నాడు. ఈ లోకములో ఉపద్రవములుంటాయని మన ప్రభువైన యేసు మనకు సరిగ్గా సెలవిచ్చియున్నాడు. ఎందుకంటే, ఆయన ఈ లోకమును జయించియున్నాడని వాక్యము మనకు స్పష్టముగా తెలియజేయుచున్నది. కాబట్టి, " నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి యున్నాననెను '' (యోహాను 16:33) అన్న వచనము ప్రకారము శ్రమలన్నిటి నుండి మనలను విమోచించడానికి, ప్రత్యేకించి మన బలహీనతల నుండి మరియు అలసట నుండి మనల్ని విడిపించడానికి మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి దిగి వచ్చాడు. ప్రభువైన యేసు, ప్రభువు పాదాలను గట్టిగా పట్టుకున్నప్పుడు ఆయన మీకు బలం మరియు దుర్గముగా ఉంటాడు. అంతమాత్రమే కాదు, ఆయన ఎల్లప్పుడు మీకు తోడుగా ఉంటాడు. అందుకే బైబిలేమంటుందో చూడండి, " ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నానని వారితో చెప్పెను '' (మత్తయి 28:20) అన్న వచనము ప్రకారము ఆయన నేటికి మాత్రము దేవుడు కాదు, యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉంటానని మీ పట్ల వాగ్దానము చేయుచున్నాడు. నేడు ఈ సందేశము చదువుచున్న మిమ్మల్ని దేవుడు ప్రేమించుచున్నాడు. కాబట్టి, నేడు మీరు ఆ దేవునిపై మీ నమ్మకమును ఉంచినప్పుడు ఆయన త్వరలోనే మీకు రక్షణను అనుగ్రహించుటకు మీ యొద్దకు దిగివస్తాడు.

ఒక యౌవనస్థుడు తన తల్లిదండ్రులు చనిపోగానే, అనాధగా దుఃఖంలో మిగిలిపోయాడు. ఏమి చేయాలో, ఎక్కడికి వెళ్లాలో తెలియక ఆదుర్దాతో ఉన్నాడు. అక్కడ ఒక చోట చర్చి తలుపులు తెరచియుంటే, లోపలికి వెళ్లి, మోకరించి, ప్రభువుకు తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. ఇదంత అక్కడే ఉన్న పాస్టరు గారు నిశితంగా గమనిస్తున్నాడు. అతడు ప్రార్థించుకొని లేచిన తర్వాత తాను దుఃఖంలో ఉన్న విషయాన్ని అతడు పాస్టరుకు వివరించాడు. పాస్టరుగారు ఆ యౌవనస్థుడితో నాకు చర్చిలో పనిచేయడానికి ఒకరు కావాలి. నీకిష్టమైతే, ఇక్కడ నాకు సహాయంగా పనిచేయమని చెప్పాడు. అతడు వెంటనే ఒప్పుకొని ఆ చర్చిలోనే పనిచేయడం మొదలెట్టాడు. అతడు అక్కడ ఇంకా ఆత్మీయ సత్యాలను నేర్చుకొని ప్రభువునే ఆధారం, బలంగా చేసుకొని జీవిస్తున్నాడు. అక్కడకు వచ్చే వారిలో అనేకులను వారి హృదయాలను తెప్పరిల్లజేస్తూ, వారికి తన సాక్ష్యం చెప్పేవాడు. అందువలన భగ్న హృదయులు అనేకమంది ఈ యౌవనస్థుని ద్వారా ఆదరించబడ్డారు.
నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీ శ్రమల నిమిత్తము మీరు గుండె పలిగిన వ్యక్తిగా ఉంటే లేక బాధల్లో జీవిస్తుంటే, ప్రభువును మీకు దుర్గముగా ఉంచుకొని, ఆయన రక్షణను స్వీకరించి, మీ కొరకు సంపాదించిన రక్షణలో జీవించినట్లయితే, నిశ్చయముగా, ఆయన మీకు దుర్గముగాను, బలముగాను ఉంటూ, మీకు నిత్యము తోడుగా ఉండి మిమ్మల్ని రక్షిస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు మన బలహీనతల నుండి మరియు ఆందోళనల నుండి మనలను విడిపించడానికై ఈ లోకానికి కరుదెంచాడు. కనుక ప్ర్రియ పాఠకా! ప్రభువు పాదాలను వదలక గట్టిగా పట్టుకో, అప్పుడు యేసు ప్రభువు మీకు బలమును మరియు రక్షణయునై ఉంటాడు. అవును, దేవుడు జీవితాలను మరియు పరిస్థితులను మార్చగలడు. మీ సమస్యాత్మక స్థితి నుండి మీరు రక్షించబడవలసిన అవసరం ఉందా? భయపడవద్దు! ఎందుకంటే, " నీకు తోడైయున్నాను భయపడకుము నేను నీ దేవుడనై యున్నాను దిగులుపడకుము నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడను నేనే నీతియను నా దక్షిణహస్తముతో నిన్ను ఆదుకొందును '' (యెషయా 41:10) అన్న వచనము ప్రకారము దేవుడు మీ హృదయాన్ని మార్చి మరియు ప్రతిదీ మీకు అనుకూలంగా మారుస్తాడు. అందుకే ఆయన ఇలా అంటున్నాడు, " నూతన హృదయము మీ కిచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగజేసెదను, రాతిగుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చెదను '' (యెహెజ్కేలు 36:26). దేవుడు మిమ్మల్ని క్రొత్త వ్యక్తిగా చేసినప్పుడు, దేవుడు కోరుకున్న విధంగా జీవించినట్లయితే, మీ జీవితంలో ఆశీర్వాదాలను తీసుకొని వస్తుంది. దేవునితో సహవాసం కలిగియుండుటను గురించి మనం తప్పకుండా తెలుసుకోగల ఏకైక మార్గం అదే. బైబిల్ ఇలా చెబుతోంది, " ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును '' (కీర్తనలు 37:23). ఇది నిజం. దేవుడు తనకు లోబడి ఉంటూ మరియు ఆయన స్వరానికి విధేయులైన ప్రజలను మాత్రమే సరియైన మార్గములో నడిపించగలడు. ఆయన మీ ప్రవర్తనను చూచి ఆనందిస్తాడు. మీ జీవితంలోని ప్రతి అవసరతలను తీరుస్తాడు. మీరు చేయవలసిందల్లా మీ హృదయాన్ని యేసుకు సమర్పించుకొని, ఆయనపై పూర్తిగా నమ్మకం ఉంచి, మీ మనస్సును ఆయనపై కేంద్రీకరించినప్పుడు, ఆయన మిమ్మల్ని బాధించే ప్రతి శ్రమలు, బాధలు, వ్యాధులన్నిటిని పరిష్కరిస్తాడు. ఆయన మీకు బలమును దుర్గమునై యుంటూ, మిమ్మల్ని తప్పకుండా రక్షిస్తాడు.
Prayer:
బలమును దుర్గమునై యున్న మా ప్రియ పరలోకపు తండ్రీ,
 
మా బాధలలోను, సమస్యలలోను నీవు మాతో ఉండి మా దుర్గముగా బండగా ఉన్నందుకై ప్రభువా నిన్ను స్తుతించుచున్నాము. చీకటిలో జీవించే వారికి వెలుగు ప్రసాదించుము. వారి మనో నేత్రాలను తెరచి నీ శక్తిని, రక్షణను పొందనట్లుగా కృపను జూపుమని వేడుకొనుచున్నాము. దేవా, నీకు లోబడి మరియు నీ స్వరానికి విధేయులై జీవించుటకు మాకు సహాయము చేయుము. ప్రభువా, మా నడత నీకు అంగీకారముగా ఉండునట్లుగా మరియు నిన్ను ఆనందింపజేయునట్లుగాను మార్చుము. దేవా, నీవు నిత్యము మాకు తోడుగా ఉండి, నీ దక్షిణ హస్తముతో మాకు సహాయము చేయుమని కోరుచున్నాము. యేసయ్యా, నీవు ఈ లోకమును జయించినట్లుగానే, మేము కూడ మా శ్రమలను ఈ లోకములో జయించుటకు మాకు నీ కృపను, బలమును దయచేయుము. ప్రభువా, మా విన్నపాన్ని ఆలకించి, మాకు జవాబు దయచేయుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000