Loading...
Stella dhinakaran

మీ భారము దేవుని మీద మోపి సంతోషించండి! 

Sis. Stella Dhinakaran
08 Dec
నా ప్రియమైనవారలారా, ఈ లోకములో జీవించే మీరు ఒంటరిగా వుంటూ ఆదుకునే వారెవరు లేరని చింతించుచున్నారా? కలవరపడకండి, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. అందుకే బైబిలేమంటుందో చూడండి, " ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక విూ చింత యావత్తు ఆయన విూద వేయుడి '' (1 పేతురు 5:7). కావుననే, మీ చింతయావత్తును ఆయన మీద వేసినప్పుడు, ఆయన మిమ్మును ఆదుకుంటాడు. 
మన భారములను ఆయన మీద మోపు ధన్యతను మనము కలిగియున్నాము. ఇటువంటి సమయంలో ప్రభువే మన భారమును మోయుచూ మన కు ముందు పయనించుచూ, ఆయన సన్నిధిలో నిత్యము మనలను నడిపించును. మీ భారములను తొలగించి నేడు ఈ వెబ్‌సైట్ చూచు మిమ్మును ఆదుకునే దేవుడై యున్నాడు. " సహోదర ప్రేమ విషయములో ఒకనియందొకడు అనురాగముగల వారై, ఘనత విషయములో ఒకని నొకడు గొప్పగా ఎంచుకొనుడి... సంతోషించు వారితో సంతోషించుడి'' (రోమా 12:10,15) అని వాక్యము సెలవిచ్చుచున్నది. 

మనకు ఎవరి ద్వారా సంతోషము కలుగుతుందనగా, దేవుని బిడ్డల ద్వారా సంతోషము కలుగుతుంది. ఆ విధంగా, మనము బైబిల్‌లో చూచినట్లయితే, దేవుని దూత మరియను కలిసిన తరువాత, మరియ త్వరగా జెకర్యా ఇంటిలో ప్రవేశించి, ఎలీసబెతుకు వందనము చేసెను. ఈ విధంగా, గతంలో వారు కలుసుకొని యుండవచ్చును. కానీ, ఆనాడు మరియ యొక్క వందన వచనము వినగానే, ఎలీసబెతు గర్భములో శిశువు గంతులు వేసెను (లూకా 1:41). ఎలీసబెతు హృదయము కూడ సంతోషముతో నింపబడినది. ఆమె పరిశుద్ధాత్మతో నిండుకొనినదై, " నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకేలాగు ప్రాప్తించెను? '' (లూకా 1:43) అని సంతోషముతో చెప్పినది. అవును, దేవుని పిల్లలు ఒకరినొకరు కలుసుకొనే సమయములో ఎంతో సంతోషము కలుగుతుంది. 


దేవునిని తన సొంత రక్షకునిగా అంగీకరించిన ఒక స్త్రీ కన్నీటితో దేవుని సన్నిధిలో ప్రార్థించుచుండెను. ఆ సమయములో ప్రభువు ఆమెకు ఒక స్త్రీ పేరును జ్ఞాపకము చేసెను, ప్రార్థన పూర్తయిన వెంటనే, ఆ స్త్రీని కలుసుకొనవలెననే భారముతో వారి ఇంటికి వెళ్లి, తలుపు తట్టినది. చాలా సమయము తరువాత ఆ స్త్రీ తలుపులు తెరిచినది. ఆ స్త్రీ ముఖము చాలా దీనంగా కనిపించింది. " నేను లోపలికి రావచ్చునా? '' అని అడిగినప్పుడు, ఇష్టము లేకుండానే " రండి, '' అని ఆమెను ఆహ్వానించింది. వారిని కలుసుకోవాలనే భారము ఆమెలో కలిగిన విషయమును గూర్చి ఆ స్త్రీకి తెలియజెప్పినది. చింతించుచున్న ఆ స్త్రీ ముఖములో చిరునవ్వు కనిపించింది. దగ్గరకు వచ్చి, కూర్చున్నది. " అమ్మా! మీరు కొంచెం ఆలస్యముగా వచ్చినట్లయితే, నా శవమును మాత్రమే చూచియుండేవారు.
కుటుంబ భారమును భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని అనుకొని అన్ని ఏర్పాట్లు చేసుకొనుచున్న సమయములో మీరు వచ్చి తలుపు తట్టారు. " నాకు జీవితము ఉన్నదా? '' అని కన్నీరు విడిచినది. " నా ప్రియ సహోదరీ, ప్రభువైన యేసు నీ వంటి వారికి జీవమును అనుగ్రహించుట కొరకే బాలుని వలె ఈ లోకములో జన్మించాడు. నీ బాధలను ఆయన మీద మోపుము, " నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును..... '' (కీర్తనలు 55:22) అని చెప్పినది. 


అదే విధముగా, " నా జీవితములో కూడ ఎన్నో బాధలు, కష్టములు వచ్చినవి, వాటి మధ్యలో ఆయనే నన్ను చేయి పట్టుకొని నడిపించాడు. నేడు అదే దేవుడు మిమ్మును కూడ అదే విధంగా నడిపిస్తాడు. చింతించకండి'' అని చెప్పి దేవుని వాక్యము ద్వారా ఆమెను ఓదార్చి, ఆమె కొరకు కన్నీటితో ప్రార్థన చేసినది. ఒక దైవీక సమాధానము, ఆదరణ ఆ స్త్రీ హృదయములో నింపబడినది. నిరాశతో నున్న ఆమె ముఖము ప్రకాశించినది. ఆమె అప్పుడప్పుడు ఆ స్త్రీ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయుచు ఆమెను ప్రోత్సహించినది. వారి ఇంటిలోను, హృదయములోను సంతోషముతో నింపబడినది. తద్వారా ఆమె జీవితము వికసించింది. 

నా ప్రియ సహోదరీ, సహోదరులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు కూడ ఆ భక్తి కలిగిన స్త్రీ వలె, ప్రేమతోను ఆదరణతోను నింపబడిన మాటలతో ఇతర సహోదరీ, సహోదరులను సంతోషపరచుచున్నారా? " మీరు రావడం ఎంతో మంచిది? '' అని మిమ్మును గూర్చి ఇతరులు చెప్పునట్లుగా, మీ మాటలు కృపతో నిండియున్నవా? దేవుడు, మీ ద్వారా కన్నీటితో నిండియున్న అనేక కుటుంబములకు, నిరుత్సాహముతోనున్న స్త్రీలకు ఆదరణ కలుగజేసి, సంతోషమును అనుగ్రహించును. ఎలీసబెతు హృదయము సంతోషించిన ప్రకారం, అనేకుల హృదయములు కూడ మీ యొక్క ప్రేమ పూర్వకమైన మాటల ద్వారా సంతోషముతో నింపబడునట్లు దేవుడు చేస్తాడు. 

నా ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూలోకములో జన్మించుట ప్రజలందరికి మహా సంతోషము! క్రిస్మస్ దినములలో మాత్రమే ఈ సంతోషమును అనుభవించక, ఎల్లప్పుడు ఈ సంతోషమును మీరు పొందవలెనని ఆయన మీ పట్ల ఆశించుచున్నాడు. అందునిమిత్తమే, దేవాది దేవుడు తన ఏకైక కుమారుడైన యేసును ఈ భూలోకమునకు పంపించెను. ఒకవేళ ఇహలోకపు బాధల వలన నిరుత్సాహముతో నిండియున్నారా? మీ కొరకే క్రీస్తు అను రక్షకుడు రెండువేల సంవత్సరముల క్రితం క్రిస్మస్ శుభదినమున ఈ భూలోకమునకు వచ్చాడు. ఆయన ఈనాటికి మన మధ్యలో ఉన్నాడు. ఆయననే ఆశ్రయించండి. అప్పుడు మీరు ఆయనను దర్శించెదరు. ఆయన మీ కన్నీటిని తుడిచి, మీకు తోడైయుంటాడు! అన్ని విధాలుగా ను ఆయన మిమ్మును సంతోషింపజేస్తాడు. 

నా ప్రియమైనవారలారా, ఈ వెబ్‌సైట్ చూచు మీకు ఎటువంటి బాధలు, భారములు కలిగియున్నను సరే! దిగులుపడకండి, వాటిని చూచి భయపడకండి, మీ భారములన్నిటిని భరించే దేవునిపై మీ భారములను వేసి, పై చెప్పబడిన స్త్రీ వలె పట్టుదలతో ప్రార్థించినట్లయితే, ఆయనతో మీరు కలిసి జీవించండి, ఆయన మీ భారములను సహించి మీకు విశ్రాంతి నిచ్చి మీ మార్గములకు ముందుగా తన సన్నిధిని తోడుగా వుంచి మీ కష్టాల నుండి మిమ్మును ఆదుకొనుచూ జీవితములోనికి ముందుకు నడిపిస్తాడు. మీకు పరిపూర్ణమైన విశ్రాంతినిచ్చి మిమ్ములను ఆశీర్వదించును. 
Prayer:
ప్రేమగల పరలోకపు తండ్రీ, ఆదుకునే దేవా!

యేసు ప్రభువా, మేకులతో గాయపరచబడ్డ నీ పాదాల చెంత భరించలేని చింతలను, మా భారాలను కుమ్మరించుచున్నాము. దయచేసి మా కష్టాలన్నింటిని పూర్తిగా మార్చి వేయుము. మా జీవితంలో సమస్తాన్ని మార్చి మమ్మును నేటి నుండి ఆశీర్వదించగలవని మేము స్థిరంగా నమ్ముచున్నాము. మా అనుదిన జీవితములో మాకు రావలసిన ఆశీర్వాదములను అ డ్డగించు సమస్త అడ్డంకులను సైతాను క్రియలను నాశనపరచి మాకు ముందుగా నడచి మాకు ఆలోచన చెప్పి మమ్ములను నడిపించుమని నిన్ను వేడుకొనుచున్నాము. మా భారములన్నిటిని నీపై మోపుచున్నాము, మమ్ములను కరుణించి మా భారములన్నిటి నుండి విడిపించి మాకు విశ్రాంతిని కలుగజేయుమని సమస్త స్తుతి ఘనత మహిమ వందనాలు నీకే చెల్లును గాక, దేవా, మా భారములన్నిటిని తొలగించి మమ్మును ఆదుకొనుచూ దీవించుమని యేసు ప్రభువు ప్రశస్త నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రీ, ఆమేన్.

1800 425 7755 / 044-33 999 000