Loading...
Stella dhinakaran

మీ బలహీనతలలో మీకు బలముననుగ్రహించే దేవుడు!

Sis. Stella Dhinakaran
07 Jan
నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మిమ్మల్ని బలపరచాలని మీ పట్ల దేవుడు కోరుచున్నాడు. సాధారణంగా,ఈ రోజులలో ఎన్నో కారణాల వల్ల మనం సులభంగా బలహీనులుగా మారవచ్చును. అయ్యో, నేను కోరుకున్నట్లుగా చదవలేకపోతున్నాను! నాతో పాటు పెళ్లైయిన వారందరికి పిల్లలు పుట్టారు. నాకెప్పటికి ఇక పిల్లలు పుట్టరా? ఈ పరీక్షలు నేనెన్నిసార్లు రాయాలి? రాసిన ప్రతిసారి ఓటమి పాలవుతున్నాను. నాకు ఏళ్లు పైబడుతున్నా ఇంకా పెళ్లి కావడం లేదు. జీవితంలో నేను ఆశీర్వదింపబడతానా? అప్పులు పెరిగిపోతున్నాయి, వీటికి అంతంలేదా? ఇటువంటివి ఎన్నో సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టవచ్చు, కలవరపడకండి, వాటిని చూచి భయపడకండి, " సొమ్మసిల్లినవారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే  '' (యెషయా 40:29) అను ఈ వచనానుసారం మీరు బలహీనులైనప్పుడు యేసుక్రీస్తు ప్రభువే మీకు బలమిస్తాడని మరువకండి. మీరు ఆశీర్వదింపబడాలని ప్రభువు కోరుకోంటున్నాడు. మీరు ఈ బలహీనతలన్ని ఆయన పాదాలచెంత పెట్టినప్పుడు వాటినుండి మిమ్మల్ని విడిపించి సంతోష భరితులనుగా చేస్తాడు. బైబిల్‌లో గొడ్రాలైన హన్నా అనే స్త్రీ తనకు సంతానము లేకుండా గొడ్రాలుగా వున్నప్పుడు ఆమె తీవ్రమైన దుఃఖంతో దేవునికి మొఱ్ఱపెట్టింది. తనకు వున్న దుఃఖమును దేవుని సన్నిధిలో కుమ్మరించినది. తాను గొడ్రాలని జీవితంలో ఎంతో సొమ్మసిల్లిపోయినందున దేవునికి కన్నీటితో ప్రార్థించినది. తద్వారా దేవుడు ఆమె విన్నపమును అంగీకరించి ఆమెకు ఒక్క పిల్లవాడిని కాక అధిక సంతానముచే ఆశీర్వదించాడని (1 సమూయేలు 1:15;2:21) ఈ వచనాలలో మనము చూడవచ్చును. మీరు కూడా అలాంటి అనేక రెట్లు ఆశీర్వాదాలు పొందుతారు.

ఒక తండ్రి తన ఒక్కగానొక్క కొడుకు భవిష్యత్తులో ఇంజనీరై మంచి పేరు ప్రఖ్యాతులను సంపాదించాలని కోరుకుని, అందుకోసము అతడు ఎన్నో త్యాగాలను చేశాడు. మొదట్లో కాలేజ్ ప్రిన్సిపాల్ అతనికి ఇంజనీరింగ్ సీట్ ఇస్తానని మాటిచ్చాడు. కానీ, అందుకు కావలిసిన డబ్బును చాలా కష్టపడి, సమకూర్చుకొని వాళ్లు ప్రిన్సిపాల్ దగ్గరకి వెళ్తే, ' అప్పుడు నేను సీటిస్తానని అన్నాను, కాని ఇప్పుడు ఇక్కడ సీట్ లేదంటున్నాను ' అని వాళ్లను తిరస్కరించి పంపివేశాడు. ఆ తండ్రి కొడుకులు పగిలిన హృదయాలతో బయటికి వచ్చారు. కానీ, ఆ కుమారుడు తండ్రి పోత్సాహంతో పూర్తిగా దేవునిపై ఆధారపడ్డాడు. ప్రభువు అతని జీవితంలో గొప్ప మేలు చేశాడు. అతడు డిగ్రీ చదువు పూర్తి చేసిన వెంటనే అతనికి ఉద్యోగం దొరికింది, అతడు పదోన్నతి కొరకు అన్ని పరీక్షలు రాశాడు. వాటిలో ఉత్తీర్ణుడై పదోన్నతిని పొందాడు. ఉద్యోగంలో తరువాతి పదోన్నతిని కూడా పొందడానికి ప్రభువు అతనికి సాయం చేశాడు. ఇంజనీరింగు చదివిన వాడికంటే శ్రేష్టమైన స్థానాన్ని అతనికి ప్రభువు అతి త్వరలో ఇచ్చి అతనిని ఆశీర్వదించాడు. ఈ యువకుడు దేవునిపై ఆధారపడినప్పటి నుండి శక్తిమంతుడై దేవుని ఆశీర్వాదాలను పొందాడు.
నా ప్రియులారా, అవును! అదే దేవుడు మీ బాధలన్నిటిని ఆనందంగా మారుస్తాడు. అంతమాత్రమే కాదు, " మీ దుఃఖమును సంతోషముగా మారుస్తాడు '' (యోహాను 16:20) అన్న వచనము ప్రకారము ఆయన తన కృపను ఇచ్చి మీకు ఓదార్పునిస్తాడు (2 కొరింథీయులు 7:6). బైబిల్ ఈ విధంగా వాగ్దానము చేయుచున్నాడు, " యెహోవా తన ప్రజలకు బలము ననుగ్రహించును యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారి నాశీర్వదించును '' (కీర్తనలు 29:11) అన్న వచనము ప్రకారము ఈ రోజు, మీరు కూడ ఆయన బలం కోసం దాహంతో ఇటువంటి ఉన్నతమైన ఆశీర్వాదమును కోరుకున్నట్లయితే, దేవుడు మీకు తన శాంతిని, శక్తిని మీకు అనుగ్రహిస్తాడు. " తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును; మీ కుమారులును మీ కుమార్తెలును ప్రవచనములు చెప్పుదురు; మీ ముసలివారు కలలుకందురు, మీ యౌవనులు దర్శనములు చూతురు '' (యోవేలు 2:28) అన్న వచనము ప్రకారము మీరు దేవుని శక్తితో నింపబడండి మరియు ఆయన మహిమ కోసం గొప్ప విషయాలను సాధించండి. మీరు కూడ అనేకసార్లు సమస్యల ద్వారా సొమ్మసిల్లి అలసియుండవచ్చు, అటువంటి సమయములో మీరు దేవుని సన్నిధిలో గడపండి, యెహోవా కొర కు కనిపట్టుకొనియుంటూ విశ్వాసములో దృఢంగా వుండాలి. యెహోవా కొరకు కనిపెట్టుకొనియుండు మీరు నూతన బలము పొందెదరు. ఇంకను మీ సమస్యల ద్వారా అలసి, సొమ్మసిల్లిన మీకు ఆయన బలము నిస్తాడు, శక్తిహీనులైన మీకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఆయనకు పై చెప్పబడిన తండ్రి కొడుకుల వలె మొఱ్ఱపెట్టినట్లయితే, నిశ్చయముగా నేడు ఈ సందేశము చదువుచున్న మీరు అలయక పరుగెత్తెదరు, సొమ్మసిల్లక నడిచిపోవుచు బలముగలవారై దేవునిలోను, ఈ భూమి మీద ను మీరు వర్థిల్లుచు ఉన్నతముగా హెచ్చింపబడుదురు.
Prayer:
కృపగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రీ,

బలవంతుడవైన దేవా, మేము మా బలహీనతలను, కష్టాలను నీ పాదాల చెంత వుంచుచున్నాము. నేటి నుండి నీలో మా విశ్వాసాన్ని అధికం చేసి మమ్మును బలపరుచుము. నీవు ఆవిధంగా చేస్తావని మేము నమ్ముతున్నాము. ఈహలోక సంబంధమైన బలహీనతల వలన సొమ్మసిల్లి ఉన్నతమైన స్థితిలో వుండలేకపోతున్నాము, సొమ్మసిల్లిన మాకు నీవే బలమిచ్చువాడవు. నీ యందు విశ్వాసముంచుచున్నాము. మా బలహీనతల నుండి మమ్మును విడిపించి మాకు బలాభివృద్ధి కలుగజేయుము. దుఃఖములో ఉన్న మేము నీ కొరకు ఎదురుచూచి, నీలో ఉన్న నూతన బలమును పొందుకొనునట్లు ఎల్లప్పుడు నీవైపు చూస్తు నీ యొక్క దీవెనల కొరకు కనిపెట్టుకొనియుండునట్లు మాకు అటువంటి హృదయమును మాకు దయచేయుము. సొమ్మసిల్లు వేళలో నీవు మమ్ములను పక్షిరాజువలె బలపరచి ఆశీర్వదించుమని విశ్వాసంతో మేము నిన్ను మహిమ పరుస్తూ సమస్త స్తుతి ఘనత మహిమ నీకే చెల్లించుచు యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000