Loading...

మీ మీద ప్రకాశించుచున్నదేవుని వెలుగు!

Stella Ramola
18 Sep
నా ప్రియులారా, ప్రతిరోజు నేడు ఈ సందేశము చదువుచున్న మీరు దేవుని వెదుకుచున్నందున ఆయన మిమ్మల్ని సూర్యుడిలా ప్రకాశింపజేస్తాడని దేవుడు మీ పట్ల వాగ్దానము చేయుచున్నాడు. ఎందుకనగా, ఈ లోకానికి ఆయనే వెలుగై యున్నాడు. దేవుని వెలుగు మనపై ప్రకాశింపజేయడం ఎలా? మనం బైబిలు చదివి, ఆయనతో సమయాన్ని గడపడం ద్వారా దేవుని వెతుకుచున్నప్పుడు, ప్రభువు యొక్క వెలుగు మనపై ప్రకాశిస్తుంది. అంతమాత్రమే కాదు, మన ముఖం సూర్యుడిలా ప్రకాశిస్తుంది. మనము బైబిల్లో చదివినట్లయితే, " వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను వారి ముఖము లెన్నడును లజ్జింపకపోవును '' (కీర్తనలు 34:5) అన్న వచనము ప్రకారము నేడు ఈ సందేశము చదువుచున్న మీరు ఆయన తట్టు చూచినప్పుడు మీకు వెలుగు కలుగుతుంది. అదియుగాక, మీరు ఏది చేసినా అది అభివృద్ధి చెందుతుంది మరియు మీ ముఖాలు ఎన్నడును సిగ్గుతో కప్పబడవు. ఆలాగుననే, మీ కార్యాలయంలోను, మీ తోటివారి మధ్యలో దేవుడు మిమ్మల్ని ఆయన కొరకు ప్రకాశించునట్లు చేస్తాడు.
 
కారణము, దేవుని వాక్యం వెలుగై యున్నదని మనము బైబిల్‌లో చదివియున్నాము. కీర్తనకారుడు ఇలా అంటున్నాడు, " నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై యున్నది '' (కీర్తనలు 119:105) అన్న వచనము ప్రకారము మనము దేవుని వాక్యాన్ని చదివి, మన హృదయంలో దానిని పదిలపరచుకున్నప్పుడు దేవుని వెలుగు మన ద్వారా ప్రకాశిస్తుంది. యేసుక్రీస్తే దేవుని వాక్యమై యున్నాడు. అందుకే, ఆయనను లోకమునకు వెలుగు అని కూడా పిలువబడుచున్నది. " మరల యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగుగలిగి యుండునని...చెప్పెను '' (యోహాను 8:12) అన్న వచనము ప్రకారము దేవుని యొక్క వెలుగును కలిగియుండాలని, ఆయన దేవుని మార్గాల్లో నడవాలని ప్రజలకు బోధించాడు మరియు అనేకమందిని పాపాన్ని దూరంగా ఉండులాగున మార్చాడు. అదేవిధంగా, మనము కూడా చేయాలని దేవుడు మనలను తన యొద్దకు పిలుచుచున్నాడు. అందుకే దేవుడు మీరు ఏలా ఉన్నారని సెలవిచ్చుచున్నాడు. చూడండి, " మీరు లోకమునకు వెలుగై యున్నారు; కొండ మీదనుండు పట్టణము మరుగైయుండనేరదు. మనుష్యులు దీపము వెలిగించి కుంచము క్రింద పెట్టరు కాని అది యింట నుండు వారికందరికి వెలుగిచ్చుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. మనుష్యులు మీ స్రత్కియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి యెదుట మీ వెలుగు ప్రకాశింపనియ్యుడి '' (మత్తయి 5:14-16). కాబట్టి, ఆలాగుననే జరిగించి, మీ పరలోకపు తండ్రిని మహిమపరచునట్లుగా మీ వెలుగును ప్రకాశింపనియ్యుడి.
నా ప్రియులారా, మనము దేవుని వాక్యాన్ని అనుసరించి, స్రత్కియలు చేయడం ద్వారా దేవుని వెలుగును ఈలోకమునకు ప్రకాశింపజేస్తాము. ఆ వెలుగు ప్రతి ఒక్కరినీ స్పష్టంగా చూసేలా చేస్తుంది. అదేవిధంగా, మనం చేయునది ఇతరులను దేవుని వైపునకు నడిపించాలి. " బుద్ధిమంతులైతే ఆకాశమండలములోని జ్యోతులను పోలినవారై ప్రకాశించెదరు. నీతిమార్గము ననుసరించి నడుచుకొనునట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రమువలె నిరంతరమును ప్రకాశించెదరు '' (దానియేలు 12:3) అన్న వచనము ప్రకారము ప్రజలను క్రీస్తు వైపుకు నడిపించే వారు జ్యోతుల వలె ప్రకాశిస్తారు. కాబట్టి, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు చేయాల్సిందల్లా, దేవుని వాక్యం యొక్క వెలుగులోనికి అనేకులు తీసుకొని వచ్చే జీవిత విధానమును మాత్రమే కాకుండా, యేసుక్రీస్తును గూర్చి అందరితో పంచుకొనుట ద్వారాను మరియు మీ మాటల ద్వారా మరియు మీరు జీవించే విధానంచేత మీ ద్వారా ఆయనను ఇతరులకు బయలుపరచబడగలరు. దేవుడు ఈ రోజు మీకు ఇటువంటి గొప్ప కృపను అనుగ్రహించాలంటే, ఆయన మీద నమ్మకం ఉంచండి, ప్రతి రోజు మీ దృష్టిని దేవునిపై ఉంచడం, ఆయన వాక్యాన్ని చదవడం మరియు ఆ ప్రకారము నడవడం ద్వారా మీ జీవితం ఈలోకానికి ప్రకాశించే వెలుగువలె మారుతుంది. మీరు నిరంతరము నక్షత్రమువలె ప్రకాశిస్తారు.
Prayer:
ఈ లోకానికి వెలుగుగా ఉన్న మా ప్రియ పరమ తండ్రీ,
 
దేవా, నీవు ఈ లోకానికి వెలుగుగా ఉన్నట్లుగానే, మేము కూడ వెలుగుగా జీవించుటకు మాకు అటువంటి గొప్ప ధన్యతను దయచేయుము. ప్రభువైన యేసు, నీ వాక్యాన్ని చదవడం ద్వారా ప్రతిరోజు నిన్ను వెదకుచున్నప్పుడు, నీ వెలుగు మాపై ప్రకాశిస్తుందని నమ్ముచున్నాము. దేవా, ఎల్లప్పుడు మా దృష్టిని నీపై కేంద్రీకరించడానికి మాకు సహాయము చేయుము. మా జీవితం ఈ లోకానికి వెలుగుగా ఉండునట్లు మార్చుము. మా జీవితం ఒక బహుమతిగాను మరియు ప్రతి ఒక్కరికి దీవెనకరముగా ఉండునట్లుగా చేయుము. దేవా, బుద్ధిమంతులుగా జీవించుచు, ఆకాశమండలములోని జ్యోతులను పోలినవారై ప్రకాశించునట్లు చేయుము. అదియుగాక, మేము నీ యొక్క నీతిమార్గము ననుసరించి నడుచుకొనునట్లుగాను, అనేకులను నీ వైపు త్రిప్పునట్లుగాను, నక్షత్రమువలె నిరంతరమును ప్రకాశించునట్లుగా మమ్మల్ని మార్చుమని యేసుక్రీస్తు అతి ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000