Loading...
Dr. Paul Dhinakaran

మీరు దేవుని తట్టు చూచి వెలుగును పొందుకొనండి!

Dr. Paul Dhinakaran
26 Feb
నా ప్రియులారా, ప్రభువు తన మృధువైన సంరక్షణలోనికి నేడు ఈ సందేశము చదువుచున్న మిమ్మల్ని ప్రేమతో ఆయన పిలుచుచున్నాడు. మీ భయాలు లేదా బాధలు ఏవైనప్పటికిని, మీరు ఆయన వైపు చూడండి. అప్పుడు నేడు ఈ సందేశము చదువుచున్న మీ ముఖములెన్నడును సిగ్గుపడకుండ చేస్తానని దేవుడు వాగ్దానము చేయుచున్నాడు. బైబిల్‌లో కీర్తనకారుడు ఇలా అంటున్నాడు, " వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను వారి ముఖము లెన్నడును లజ్జింపకపోవును '' (కీర్తనలు 34:5) అన్న వచనము ప్రకారము ఒకవేళ, మీ అనుదిన చర్యలలో మీరు ఎంతో నీతిగాను మరియు నిజాయితీగాను ఉండవచ్చును. అయితే, మీరు ఇతరుల ద్వారా అభినందనలు పొందలేకపోవచ్చును. ఒకవేళ మీరు యేసును వెంబడిస్తు, ఆయన వాక్యమునకు లోబడుచు, విధేయత కలిగియున్నను, మీరు ఘనత పొందలేదని చింతించుచుండవచ్చును. మీరు అందరి దగ్గర అవమానముతో మీ తలను వంచుకొనియుండవచ్చును. అయితే, దిగులుపడకండి, ఈనాటి నుండి మీరు దేవుని వైపు చూచినప్పుడు మీకు వెలుగు కలుగుతుంది. మీరు ఎన్నటికిని సిగ్గునొందరు. మీరు ఆయన వైపు చూస్తున్నప్పుడు, పొగమంచు గుండా ప్రకాశించే సూర్యుడిలా, మీ కష్టాలన్ని ఆయన సన్నిధిలో అదృశ్యమైపోవును. నేడు మిమ్మల్ని ప్రేమిస్తున్న మరియు మీ కోసం మరణించిన యేసు ప్రభువు యెదుట ఎటువంటి కష్టాలు కూడ నిలువనేరవు. పెరుగుతున్న సమస్యలతో కలవరపడిన ప్రతీక్ జైన్ (బిజినోర్, ఉత్తర ప్రదేశ్) యేసు ప్రభువు వైపు చూడటం ద్వారా అతను ఎలా ప్రకాశవంతంగా మారాడో తన సాక్ష్యాన్ని ఈ క్రింద చూడండి:

2002 వ సంవత్సరములో నేను ఇంజనీరింగ్ చదువుచున్నప్పుడు, మా తండ్రికి పక్షవాతం వచ్చి చాలా అనారోగ్యము పాలయ్యారు. కనుక నా చదువుతో పాటు ఆయన నిర్వహించుచున్న పెట్రోల్ బంక్ సంస్థను కూడ చూసుకొనవలసిన బాధ్యత నా మీద పడినది. అప్పుడే, నా తండ్రి ఒక అతిధి గృహమును నిర్మించుటకు అధిక మొత్తంలో ధనం పెట్టుబడి పెట్టినట్లు తెలిసింది. మరియు ఆ అప్పుల భారము నా మీద పడినది. ఇటువంటి భయంకరమైన పరిస్థితిలో లక్షలలో వడ్డీ చెల్లించవలసి వచ్చినది. దీనికి ఒకటే మార్గము, అతిధి గృహమును అమ్మి, ఆ ధనముతో అప్పులను తీర్చవలెనని అనుకొన్నాను. 5 సంవత్సరములు కష్టపడినను, దానిని అమ్మలేక పోయాను. అనేకులను కలిసి సలహాలు తీసుకొనినను ప్రయోజనము లేదు. మరొక ప్రక్క నా తండ్రి స్వస్థత పొందినను సంపూర్ణ విడుదల పొందక, బలహీనముగా ఉండేవారు. ఇందువలన నా చదువులలో శ్రద్ధ చూపించలేకపోయాను. ఎలాగో కష్టపడి నా చదువు పూర్తి చేశాను. ఆ తరువాత, ఒక ట్రావెల్ ఏజన్సీ ప్రారంభించాను. అందులో వచ్చే లాభముతో వ్యాపారమును అభివృద్ధి చేసుకోవాలని అనుకొన్నాను. కానీ, అపజయమే ఎదురైంది. ఇటువంటి పరిస్థితిలో 2007 వ సంవత్సరములో, ఒకరు నన్ను, " యేసు పిలుచుచున్నాడు '' టి.వి. కార్యక్రమమును చూడమని చెప్పి ప్రోత్సహించారు. మొట్టమొదటిసారిగా నేను ఈ కార్యక్రమమును చూసినప్పుడు, దేవుని వాక్యము శక్తివంతముగా ప్రసంగించుటయు, ప్రజలు అద్భుతములను పొందుకొని సాక్ష్యము చెప్పుట చూసి ఆశ్చర్యపోయాను. ఈ కార్యక్రమములను క్రమముగా చూడసాగాను. అవి నాకు ఎంతో ఆదరణకరముగా ఉన్నవి మరియు నిరీక్షణను కలుగజేసినవి. ప్రభువు ఒక అద్భుతమును చేయుననే నమ్మకము నాలో కలిగినది. డాక్టర్. పాల్ దినకరన్ గారికి ఉత్తరములు వ్రాయుటకు ప్రారంభించాను. నా సమస్యలన్నియు తీరిపోవునని వ్రాసియున్న జవాబు లేఖలను అందుకొన్నాను. ఆశ్చర్యకరముగా 2007 వ సంవత్సరము ఆగస్టు నెలలో ఎంతోకాలంగా మేము అమ్మకం చేయలేకుండ కష్టపడిన ఆ భవనము చాలా మంచి ధరకు అమ్ముడు పోయింది. తద్వారా, మా అప్పుల సమస్యలన్నియు తీరిపోయినవి. మరియు మా జీవితములో దేవుని ఆశీర్వాదములు పెరిగినవి.
 
2008 వ సంవత్సరము నవంబరు నెలలో నాకు వివాహమైనది. 2009 ఆగస్టు నెలలో, " యేసు పిలుచుచున్నాడు '' శక్తి పరిచర్య శిక్షణ సమావేశంలో పాల్గొన్నాను. ప్రభువు నన్ను ఆయన యొక్క పరిశుద్ధాత్మతో నింపాడు. ఆనాటి నుండి నా ప్రార్థన జీవితము మరియు ఆత్మీయ జీవితము మారినది. ఇతరులకు పరిచర్య చేయుటకు ప్రారంభించాను. నా ప్రార్థన ద్వారా ప్రభువు అనేకుల జీవితములలో అద్భుతములు చేశాడు. " యేసు పిలుచుచున్నాడు '' పరిచర్యతో అధిక సహవాసం ఏర్పడినది. డిసెంబరు 2009 వ సంవత్సరములో ఒక " యేసు పిలుచుచున్నాడు '' టి.వి. కార్యక్రమమును స్పాన్సర్ చేశాను. అప్పుడు నా భార్యకు సుఖ ప్రసవం జరగాలని వ్రాసి పంపించిన నా ప్రార్థన విన్నపము నిమిత్తము ఆ కార్యక్రమమును స్పాన్సర్ చేశాను. నా భార్యకు సుఖ ప్రసవం జరగాలని వ్రాసి పంపించిన నా ప్రార్థన విన్నపము నిమిత్తము ఆ కార్యక్రమములో డాక్టర్. పాల్ దినకరన్ గారు ప్రార్థన చేశారు. దేవుడు ఆ ప్రార్థన ఆలకించి, 2010, జనవరి నెలలో నా భార్యకు సుఖ ప్రవసం ద్వారా నాకు ఒక మగ బిడ్డను అనుగ్రహించాడు. ఆ తరువాత, 2016, జనవరి నెలలో మళ్లీ ఒక మగ బిడ్డను అనుగ్రహించి, ప్రభువు మమ్మును ఘనపరచాడు. నేను నడిపించుచున్న పెట్రోల్ బంక్, నాణ్యత యందు జిల్లాలో మొదటి స్థానములో గుర్తింపు పొందింది. నా ట్రావెల్ ఏజెన్సీ వ్యాపారము కూడ బాగా అభివృద్ధిపొందినది. ఈ విధంగా " యేసు పిలుచుచున్నాడు '' పరిచర్య ద్వారా మా జీవితములో నుండి ఆరోగ్యమును, వ్యాపారంలో అభివృద్ధిని, పరిచర్య చేయుటకు కృపను పొందుకొనిన మేము దేవునికే సమస్త మహిమ చెల్లించుచున్నాము.
నా ప్రియులారా, అందుకే కీర్తనాకారుడు ఏమంటున్నాడో చూడండి, " దుప్పి నీటివాగుల కొరకు ఆశపడునట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది '' (కీర్తనలు 42:1) అన్న వచనము ప్రకారము మీ సమస్యలన్నింటిని మీ కోసం శ్రద్ధ వహించే ఆయన ప్రేమపూర్వక చేతుల్లోకి అప్పగించండి. ఆయన ప్రేమ మీ కన్నీళ్లను చూడకుండా ఉండలేదు. గొప్ప ఆదరణకర్తయైన దేవుడు మిమ్మల్ని ఓదార్చుతాడు మరియు మీ కోసం గొప్ప అద్భుతాలు చేస్తాడు. మీరు ఇక ఎన్నటికిని సిగ్గుపడరు. మరియు ఆయన మీరు అవమానము పొందుకున్న అదే స్థలములో రెండంతలుగా దీవించి, ఘనతను ఐశ్వర్యమును మీకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే, మీ నమ్మకాన్ని మానవులపై ఉంచకుండా, దేవునిపై ఉంచినందున ఆయన మిమ్మును రెండంతలుగా దీవిస్తాడు. నేటి నుండి మీరు ఎటువంటి బాధను, వేదనను, కష్టాలను, అప్పులను అనుభవించుచున్నను అవి మీ జీవితములో ఇక ఉండవు. మీరు అవమానము పొందిన అదే స్థలములో దేవుడు రెండంతలుగా మిమ్మును దీవిస్తాడు. మీ ముఖం ఆనందంతో ప్రకాశిస్త్తుంది!
Prayer:
కృపామయుడవైన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ,

నీ పాదములకు స్తుతులు చెల్లించుచున్నాము. దేవా, మా జీవితములో ఇంతవరకు మేము అనుభవించిన నష్టాలన్నిటి నుండి నీవు మమ్మును విడిచించి మా జీవితములో అద్భుతము జరిగించుము. మా ఉద్యోగములోను, మా చుట్టు పరిసర ప్రాంతాలలోను మేము అవమానమును సిగ్గును అనుభవిస్తున్నాము. మా బాధలలో మేము నీకు మొఱపెట్టుచున్నాము. దయతో మా ప్రార్థనను ఆలకించి, మా ప్రార్థనకు జవాబు దయచేయుము. మా ముఖములు ఎన్నడును సిగ్గుపడకుండా ఉండునట్లుగా మేము ఎల్లప్పుడు నీ వైపు చూచుటకు మాకు సహాయము చేయుము. మేము పోగొట్టుకున్న వాటిని రెండంతలుగా మరల మాకు దయచేయుము. మేము అవమానము పొందిన అదే స్థలములలో నీవు మాకు ఘనతను, రెట్టింపు దీవెనలను అనుగ్రహించి, మమ్మును ఆశీర్వదించుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000