Loading...

సమస్త కీడు మరియు అపాయం నుండి భద్రత!

Shilpa Dhinakaran
23 Jan
నా ప్రియ స్నేహితులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీ కొరకు దేవుడు చేసిన వాగ్దానము కీర్తనలు 9:9 వ వచనము బైబిల్ నుండి ఎన్నుకొనబడియున్నది. ఆ వచనమేమనగా, " నలిగినవారికి తాను మహా దుర్గమగును ఆపత్కాలములలో వారికి మహా దుర్గమగును. '' అవును, మీరు కష్టాలలో ఉన్నప్పుడు ఆయన మీకు ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. మీ కుటుంబ సభ్యులు, జీవిత భాగస్వామి లేదా పిల్లలు, మీరు ఈలోకములో ఉన్న వ్యక్తులపై మీ నమ్మకాన్ని పెట్టుకొని ఉండవచ్చును. కానీ, ప్రభువు," నన్ను నమ్మండి, నేను మీకు ఆశ్రయ దుర్గముగా ఉంటాను అని సెలవిచ్చుచున్నాడు. '' అందుకే బైబిల్‌లో కీర్తన 27:5 ఇలా చెబుతుంది, " ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును తన గుడారపు మాటున నన్ను దాచును ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును '' అన్న వచనము ప్రకారము ఆయన మిమ్మల్ని తన పర్ణశాలలో దాచును మరియు ఆయన మీకు ఆశ్రయ దుర్గముగా ఉండి, మిమ్మును ఉన్నత స్థానమునకు ఎక్కిస్తాడు. ఈ రోజు, మీరు పదేపదే బాధలకు మరియు హింసలకు గురయ్యే పరిస్థితిని ఎదుర్కొనవచ్చును. మీ జీవిత భాగస్వామి ద్వారా లేదా మీ కార్యాలయ పరిస్థితులు లేదా మీ శరీరాన్ని నిరంతరం బాధించే అనారోగ్యం, దీర్ఘకాలిక వ్యాధి లేదా మీరు ఎంతో కాలము నుండి పోరాడుతున్న శోధనలైనా సరే, మీరు భయపడకండి. నేడు ఏమైనా సరే, దేవుడు మీకు ఆశ్రయంగా ఉంటాడు.

నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీ కష్ట సమయాల్లో దేవుడు మీ పక్షమున ఒక మహా దుర్గముగా ఉంటాడు. ఒక బలమైన దుర్గమైనది, అది కాపలాదారుని కంటే, శక్తివంతమైన మహా దుర్గముగా ఉంటున్నది. దాని మీద శత్రువులు దాడి చేయవచ్చును మరియు బాధలు మిమ్మల్ని నలుగగొట్టుటకు ప్రయత్నించవచ్చును. కానీ, దేవుడు నలిగిన మీకు మహా దుర్గముగా ఉంటాడు. ఎటువంటి శత్రువు దాడికి మీరు భయపడరు. కారణము, దేవుడు మిమ్మల్ని తన గుడారంలో దాచుకుంటాడు. అంటే మిమ్మల్ని తన యొద్దకు ఎంతో సమీపముగా దాచబోవుచున్నాడని అర్ధము. ఏది మిమ్మల్ని తాకదు. యేసుతో కూడ శిష్యులు దోనెలో వెళ్లిన కథ మనకు తెలుసు. యేసు ఆ దోనెలో ఉన్నప్పటికీ, సముద్రంలో పెద్ద తుఫాను వచ్చింది. దానిని చూచి శిష్యులందరూ భయపడ్డారు. కానీ, యేసుప్రభువు తన చేతిని పైకెత్తి గాలిని గద్దించాడు.
అదేవిధంగా, నా ప్రియులారా, ప్రభువు ఈ రోజు మీ జీవిత నావలోనికి రావాలని కోరుచున్నాడు. మరియు నేడు ఈ సందేశము చదువుచున్న మీ జీవితంలో చెలరేగే తుఫాను వంటి సమస్యలన్నిటిని గద్దించబోవుచున్నాడు. అవి మీ మీదికి పొర్లకుండా ఆపుతాడు. అంతమాత్రమే కాదు, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు ఆయనలో ఆశ్రయం పొందబోవుచున్నారు. ప్రియ స్నేహితులారా, ఈ అద్భుతమైన వాగ్దానానికి మీరు దేవునికి కృతజ్ఞతలు తెలియజేయుచున్నారని నిర్థారించుకోండి. మీరు దేవుని మీ ఆశ్రయంగా చేసుకున్నప్పుడు, మీకు విరోధంగా లేచి నిలువబడగలిగేది ఏదీ ఉండదు. ఈ లోకంలో మనకు కష్టాలు మరియు శ్రమలు ఉంటాయని యేసు చెప్పాడు. కానీ, ఆయన ఈ లోకాన్ని జయించాడు. నా ప్రియమైన వారలారా, ఈ రోజు ఈ సందేశము చదువుచున్న మీరు ఎదుర్కొంటున్న ప్రతి ఇబ్బందిని జయించడానికి ఆయనే మీకు సహాయము చేస్తాడు. ఇబ్బందికరమైన సమయ్లా మిమ్మల్ని చుట్టుముట్టినప్పుడల్లా, మీరు ధైర్యంగా ఉండండి మరియు ఆయనే దేవుడని తెలుసుకోండి. యేసుపై నమ్మకం ఉంచిన ఎవరు కూడ ఎప్పుడు నిరాశ చెందలేదు. కాబట్టి, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు మీ హృదయపూర్వకంగా దేవుని మీద నమ్మకముంచండి. ఈ వాగ్దానాన్ని నేడు మీరు కూడా హత్తుకొని మీ బాధలలోను, వ్యాధులలోను, శ్రమలలో నుండి విడుదల పొందుకొనండి. దేవుడు మిమ్మల్ని నిత్యము దీవించును గాక.
Prayer:
ప్రేమకు పాత్రుడవైన మా పరలోకమందున్న తండ్రీ,

నీవే మాకు ఆశ్రయం, మమ్మును ఒత్తిడి చేయు ప్రజలను మేము క్షమించాము ప్రభువా. దేవా, మా కీడు నుండి మరియు అపాయము నుండి మమ్మల్ని కాపాడి రక్షించుము. నీ గుడారములో చాటులో మమ్మును దాచుము. ప్రభువా, మా జీవితంలో చెలరేగే తుఫానులన్నింటిని నిమ్మళంగా మార్చుము. మమ్మును మరియు మా కష్టాలను నీ చేతికి సమర్పించుచున్నాము. దేవా, మాకు నీ శాంతిని అనుగ్రహించుము. తద్వారా, నిన్ను ఘనపరచుటకు మాకిచ్చిన శక్తిని బట్టి నీకు వందనములు చెల్లించుచున్నాము. దేవా, నీవు నలిగిన మాకును మరియు ఆపత్కాలములో ఉన్న మాకును నీవు మహా దుర్గముగా ఉంటావని నీవిచ్చిన వాగ్దానమును బట్టి నీకు వందనములు చెల్లించుచున్నాము. ప్రభువా, మా బాధలను చూచి, మాకు విడుదలను దయచేయుము. దేవా, మా పితరులతో కూడ నీవు ఉన్నట్లుగానే, నేడు మాతో ఉండి మా శోధనల నుండి, వ్యాధుల నుండి మాకు విడుదలను దయచేయుము. దేవా, నీవు మాకు ఆశ్రయముగా ఉండి, మా జీవితములో మేము ఎదుర్కొనే ప్రతి సమస్యను, శత్రువులను జయించుటకు నీ మహా దుర్గమును మాకు దయచేయుము. దేవా, నీ ప్రేమతో మమ్మల్ని కప్పుము. నీ అద్భుతమైన శాంతి మరియు సమాధానముతో మమ్మల్ని నింపుము. మాకు సంభవింపబోయే, సంభవించుచున్న సమస్త హాని, కీడు నుండి మరియు అపాయము నుండి మమ్మల్ని రక్షించి, విడిపించుమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000