Loading...
Stella dhinakaran

మీరు పరలోక సంబంధులు!

Sis. Stella Dhinakaran
04 May
నా విలువైన దేవుని బిడ్డలారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీతో పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉన్నది. ఈ రోజు మనం 1 యోహాను 5:18 వ వచనములో చదివిన వాగ్దానాన్ని ధ్యానించబోవుచున్నాం. అదేమనగా, " మనము దేవుని సంబంధులమనియు, లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము '' అని దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. నేడు ఈ సందేశము చదువుచున్న మీరు దేవుని బిడ్డలుగా మారాలి; అంతే! మీరు 91 వ కీర్తన చదివితే, 1 మరియు 16 వ వచనాలు ఇలాగున తెలియజేయుచున్నవి: " మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు మరియు దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను నా రక్షణ అతనికి చూపించెదను '' అన్న వచనముల ప్రకారము మీరు దేవుని బిడ్డలుగా మారినప్పుడు, మీరు దీర్ఘాయువు చేత తృప్తిపరచబడెదరు.

దేవుని బిడ్డగా మారడానికి మీరు ఏమి చేయాలి? బైబిల్‌లో ఎలీమెలెకు, అతని భార్యపేరు నయోమి; మరియు మోయాబులో నివసించడానికి వెళ్ళిన అతని యిద్దరు కుమారులను గురించి మనము చదివియున్నాము. వారు మోయాబు స్త్రీలను పెండ్లి చేసికొనిరి. వారిలో ఒకదాని పేరు ఓర్పా రెండవదాని పేరు రూతు. రూతు ఆ ఇంటికి వచ్చినప్పుడు, ఆమె అత్తగారు సర్వశక్తిమంతుడైన దేవుడైన యెహోవాను ప్రార్థించడం చూసింది. జీవము గల దేవుని ఆరాధించే వైఖరిని చూసి, రూతు ఆకర్షితురాలయ్యెను. అందువలన, ఆమె ' నీవు వెళ్లు చోటికే నేను వచ్చెదను, నీవు నివసించుచోటనే నేను నివసించెదను, నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు ' అని ఆమె అత్తగారితో చెప్పెను. ఆవిధంగానే, ఆమె సర్వశక్తిమంతుడైన దేవుని ఆశ్రయం క్రిందకు వచ్చింది. దేవుడు రూతును ఆశీర్వదించాడు మరియు ఆమె పేరు యేసుక్రీస్తు వంశావళిలో ఉండేలా చేశాడు. ఎంత గొప్ప ఆశీర్వాదము కదా.
నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు సర్వశక్తిమంతుని నీడలోనికి వచ్చినప్పుడు ఏమి జరుగుతుందో మీకు తెలుసా? ఆయన వచ్చి మీలో నివసిస్తాడు. అందుకే బైబిల్‌లో చూచినట్లయితే, " యెహోవా సీయోనును ఏర్పరచుకొనియున్నాడు. తనకు నివాస స్థలముగా దానిని కోరుకొనియున్నాడు, ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా నుండును ఇక్కడనే నేను నివసించెదను '' (కీర్తనల గ్రంథము 132:13-14) అన్న వచనముల ప్రకారము ఆయన మీకు నిత్యము ఆశ్రయముగా ఉండి, మీతో నివసిస్తాడు. అవును, దేవుడు ఈ సందేశము చదువుచున్న మీతో కూడ ఎల్లప్పుడు ఉంటాడు. అందుకే బైబిలేమంటుందో చూడండి, " ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నానని వారితో చెప్పెను '' (మత్తయి సువార్త 28:20) అన్న వచనము ప్రకారము యుగ సమాప్తి వరకు ఆయన మీతో కూడ ఉంటాడు. కాబట్టి, ధైర్యముగా ఉండండి. నేడు ఈ సందేశము చదువుచున్న మీరు కూడ ప్రభువును అడిగినట్లయితే, ఆయన ఇప్పుడు కూడా ఈ అనుభవాన్ని మీకు అనుగ్రహిస్తాడు. మీరు ఆయన బిడ్డలు కావాలని ప్రభువునకు తెలియజేయండి మరియు ఆయన ఆశ్రయం క్రింద మిమ్మల్ని కప్పమని కోరుకున్నట్లయితే, నిశ్చయముగా, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు దేవుని సంబంధులుగా ఉంటూ, ఆయనకు బిడ్డలుగా మార్చి, దీర్ఘాయువు చేత మిమ్మల్ని తృప్తిపరచి, ఆయన రక్షణను మీకు చూపిస్తాడు.
Prayer:
ప్రేమాకనికరము కలిగిన మా పరలోకమందున్న తండ్రీ,

నిన్ను స్తుతించుటకు మాకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వందనములు చెల్లించుచున్నాము.ఈ రోజు నీవు మాకు ఇచ్చిన ఈ చక్కటి వాగ్దాన వచనానికై నీకు వందములు. ప్రభువా, నీవు మాలోనికి వచ్చి నివసించుము. దేవా, నీవు మాతో కూడ ఎల్లప్పుడు ఉండుము. ఇంకను మేము ఎల్లప్పుడు నీ బిడ్డలుగా ఉండాలనుకుంటున్నాము. ప్రభువా, మేము నీ శరణుజొచ్చు, నీ రెక్కల క్రింద మమ్మల్ని కప్పుము. దేవా, మేము కూడ నయోమి మరియు రూతువలె నీ సన్నిధికి నిత్యము ప్రార్థించుటకును, తద్వారా, మా సంతతిని కూడ నీవు ఆశీర్వదించుమని వేడుకొనుచున్నాము. ప్రభువా, నీ ఆశ్రయము క్రిందకు వచ్చి మమ్మల్ని నీ కృపతో కప్పి, దీర్ఘాయువు చేత మమ్మల్ని తృప్తిపరచుమని సమస్త స్తుతి ఘనత మహిమ నీకే చెల్లించుచు యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000