Loading...
Paul Dhinakaran

ఘనతకు ముందు వినయముండును!

Dr. Paul Dhinakaran
23 Jan

నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు వినయ మనస్సు గలవారై జీవించాలని మన ప్రభువు మీ పట్ల కోరుచున్నాడు. కాబట్టి, అందుకే బైబిలేమంటుందో చూడండి, ‘‘ యెహోవా తన ప్రజలందు ప్రీతిగలవాడు. ఆయన దీనులను రక్షణతో అలంకరించును ’’ (కీర్తనలు 149:4) అన్న వచనము ప్రకారము ఘనతకు ముందు వినయముండును. కొంతమంది మనుష్యుల యెదుట కాకుండా దేవుని ముందు తమను తాము అర్పించుకుంటారు. అయితే, అందుకు బైబిలేమంటుందో చూడండి, ‘‘ కక్షచేతనైనను వృథాతిశయము చేతనైనను ఏమియు చేయక, వినయమైన మనస్సుగలవారై యొకనినొకడు తనకంటె యోగ్యుడని యెంచుచు, మీలో ప్రతివాడును తన సొంతకార్యములను మాత్రమే గాక యితరుల కార్యములను కూడ చూడవలెను ’’ (ఫిలిప్పీయులకు 2:3,4) అన్న వచనముల ప్రకారము వినయం యొక్క లోతైన పునాది ఒక వ్యక్తి జీవితం యేసుక్రీస్తుపై నిర్మించబడిందనే ఆధారము మాత్రమే.  అలాంటి పునాది ఒక వ్యక్తిని కదిలించటానికి లేదా వారి జీవితంలో దేవుని ఉద్దేశ్యాన్ని చేరుకోకుండా ఉండటానికి అనుమతించదు. జాన్ న్యూటన్ ఇలా అంటున్నాడు, ‘‘ ప్రేమ మరియు వినయం క్రీస్తు పాఠశాలలో అత్యున్నత విజయాలు మరియు ఆయన నిజంగానే మా యజమాని అనుటలో ప్రకాశవంతమైన సాక్ష్యాలు అని నేను నమ్ముతున్నాను ’’ ఒప్పుకున్నాడు.
 
చాలా సంవత్సరముల క్రితం, జర్మనీలో బాగా అర్హత పొందిన ఒక వృద్ధుడు ఎలిమెంటరీ స్కూలు ప్రిన్సిపాల్. అతడు వారి స్కూలులో 5వ తరగతి ముగించిన విద్యార్థులకు పట్టాలు ఇచ్చుటకు ఒక సభను ఏర్పాటు చేసేవాడు. ఆ సమయమందు ఆయన వారిని వరుస క్రమంలో రమ్మని చెప్పి, ఆయన ప్రతి విద్యార్థి ముందు ఎంతో మర్యాదగా తలవంచి, నమస్కరించి మరియు వారికి పట్టాలు అందించెడివాడు. ఇది చూసిన ప్రజలు, ‘‘ అయ్యా, మీరు ఈ చిన్న పిల్లల ముందు ఎందుకు వంగి గౌరవించుచున్నారు? ’’ అని అడిగారు. అందుకు ఆయన, ఈ పిల్లలందరు భవిష్యత్తులో ఈ దేశనాయకులుగాను, శాస్త్ర వేత్తలుగాను, వైద్యులుగాను మరియు ఇంజనీర్లుగాను ఎదుగుటకు నేను వారికి అభ్యాసము చేసితిని. ఈ రోజు వారు చిన్నపిల్లలే గాని, వారు వారి భవిష్యత్తులో ఖచ్చితముగా ఏదో ఒక ఉన్నత స్థానాన్ని అధిరోహిస్తారని నేను నమ్ముచున్నాను. అందుకని వారిలో ఉన్న గొప్పతనమును నేను ఇప్పుడే గౌరవిస్తున్నాను ’’ అని వారికి సమాధానమిచ్చెను.

నా ప్రియ స్నేహితులారా, ఈ స్కూలు ప్రిన్సిపాల్ వలె ప్రభువు నేడు ఈ సందేశము చదువుచున్న మీలో నున్న గొప్పదనమును చూచుచున్నాడు. ఈ ప్రిన్సిపాల్ వలె మీరు కూడ ప్రజలలో ఉన్న గొప్పదనమును గుర్తించాలి. ప్రజలందరి యెదుట వినయము కలిగి ఉండండి. వారు కూడ దేవుని సృష్టియై యున్నారు. ఇతరులను ప్రశంసించుట ద్వారా నానాటికి ఉత్తములగుదురు. ప్రతి ఒక్కరికి ఆయన తలాంతులను అనుగ్రహించి యున్నాడు. కనుక ఈనాడు ఈ సందేశము చదువుచున్న మిమ్మును మీరు తగ్గించుకొనుడి. మీ స్థానం లేదా స్థితి మిమ్మల్ని ఇతరులను తక్కువగా చూడనివ్వవద్దు. మీరు సమస్తాన్ని కలిగి ఉన్నప్పుడు మాత్రమే, మరి ఎక్కువ వినయంగా ఉండాలి. మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిలో ఉన్న గొప్పతనాన్ని గుర్తించాలి. కాబట్టి, నేడు ఈ సందేశము చదువుచున్న మిమ్మల్ని మీరు తగ్గించుకొని, ఆయన యొద్దకు వచ్చినట్లయితే, మీ హృదయంలో ఉన్న ఈ  దైవీకమైన స్వభావం మిమ్మును ఉన్నతమైన స్థానమునకు హెచ్చించును.
Prayer:
ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రీ,
 
వినయము కలిగి జీవించుటకు ఈ దినము మమ్మల్ని మేము నీ హస్తాలకు సమర్పించుకొనుచున్నాము. వయస్సులోను, అధికారములోను మాకంటె చిన్నవారిలో సయితం దాగియున్న గొప్పదనమును గుర్తించి, ప్రశంసించుటకు మాలో దీనత్వమును అనుగ్రహించుము. ప్రభువా, మా జీవితము యేసుక్రీస్తు అను లోతైన పునాది మీద నిర్మించబడుటకు మాకు సహాయము చేయుము. ప్రభువా, కలిమిలోను మరియు లేమిలోను మేము ఎల్లప్పుడు వినయముగాను మరియు దీనత్వము కలిగి జీవించుటకు మాకు కృపను దయచేయుము. వినయమైన మనస్సుగలవారమై ఒకనికంటె ఒకరము యోగ్యులముగా యెంచుకొనక, నిత్యము మేము వినయము కలిగియుండుటకు మాకు అటువంటి కృపను దయచేయుము. ఒకవేళ వినయము లేకుండా ఇంతకాలము ఘన హీనతలో ఉన్నట్లయితే, ఈనాడే మా హృదయములను నీ దివ్య హస్తాలకు అప్పగించుకొనుచున్నాము. మమ్మల్ని మరియు మా జీవితాలను మార్చుమని యేసుక్రీస్తు నామములో అతి వినయములోప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్. 

For Prayer Help (24x7) - 044 45 999 000