Loading...

మీ భారాలను తొలగించి, మిమ్మల్ని ఆదుకొనే దేవుడు!

Sharon Dhinakaran
15 Feb
నా ప్రియులారా, నేడు ఈ లోకములో జీవించే మీరు ఒంటరిగా వుంటూ ఆదుకునే వారెవరులేరని చింతించుచున్నారా? కలవరపడకండి, మన ప్రభువైన యేసుక్రీస్తు మనలను ఆదుకునే దేవుడై యున్నాడు. కొన్నిసార్లు మనం మన జ్ఞానం మీద ఆధారపడతాము లేదా సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు ఇతరుల సలహాలను అనుసరిస్తాము. మరియు వారి సహాయమును కోరుతాము. మనలను ఆశ్చర్యపరచడానికి, అవి అనవసరమైన ఒత్తిడి, ఓటమి, భయం మరియు నిరాశకు దారితీస్తాయి. ఆలాంటి సమయములో మీ సమస్యకు పరిష్కారమును పొందుటను గురించి మీరు ఎంతో జాగ్రత్త చూపుతున్నప్పుడు, మీ జీవితములో మీరు దేవుని స్థానాన్ని తొలగించి, భయం అను సముద్రంలో మునిగిపోతారు. మీ కార్యాలన్నింటిని మీరే నిర్వహించడానికి ప్రయత్నించినప్పుడు మీ మోకాలు సడలిపోవుటకు ప్రారంభిస్తాయి. కాబట్టి, భారమును, ఒత్తిడిని తొలగించడానికి మరియు భయమును విడిచిపెట్టడానికి, ఆయన మీకు ముందుగా వెళ్లి, మీ మార్గాలను సరాళంగా చేస్తాడన్న నమ్మకముతో మిమ్మల్ని మీరు సంపూర్ణంగా దేవుని హస్తాలకు సమర్పించుకొనండి. ఆయన మీకు తన కృపను కుమ్మరిస్తాడు. మరియు మీకు అసాధ్యం అని మీరు తలంచిన దానిని ఆయన సాధ్యపరుస్తాడు. మీ చింతలన్నిటికి దేవుని సమాధానం ఇక్కడ ఇవ్వబడినది. అదేమనగా, " నీ భారము యెహోవా మీద మోపుము; ఆయనే నిన్ను ఆదుకొనును; నీతిమంతులను ఎన్నడును కదలనీయడు '' (కీర్తనలు 55:22) అన్న వచనము ప్రకారము ఈ సందేశము చదువుచున్న మీ జ్ఞాన వివేకాలపై మరియు మీ నీతిపై ఆధారపడకండి. అవి మీకు విజయాన్ని ఎన్నటికి సమకూర్చలేవు. అయితే, సర్వశక్తిగల దేవుడు మాత్రమే మీకు విజయవంతమైన జీవితాన్ని అనుగ్రహించగలడు.

ఒక మనస్తత్వవేత్త మానవుల యొక్క ఒత్తిడిని గురించి వివరిస్తూ, దానిని భరించే ప్రజలకు ఒత్తిడిని ఎలా నిర్వహించాలని వారికి ఈ విధంగా తెలియజేసెను.: ఆమె ఒక గ్లాసు నీటిని పైకి ఎత్తిపట్టుకొని, ఈ గ్లాసు నీరు ఎంత బరువుగా ఉంటుంది? అని నవ్వుతూ అడిగెను. 8 నుండి 20 ఘనసాంద్రత వరకు బరువు ఉంటుందని జవాబు చెప్పారు. అందుకు, ఆమె ఇలాగున జవాబిచ్చినది,ఈ గాజు యొక్క మొత్తము బరువు ఎంత ఉంటున్నదన్న సమస్య కాదు. దానికి బదులుగా, నేను ఈ గాజు పట్టుకున్న సమయమే ప్రాముఖ్యమైనది. నేను ఒక నిమిషం పాటు పట్టుకుంటే, అది సమస్య కాదు. నేను ఒక గంట పాటు పట్టుకుంటే, నా చెయ్యి నొప్పి కలుగుతుంది. నేను దానిని ఒక రోజంతా పట్టుకుంటే, నా చెయ్యి బరువెక్కి అది మొద్దుబారిపోతుంది మరియు అది కదలలేక స్తంభించిపోతుంది. దీనిని జాగ్రత్తగా పరిశీలించి చూచినప్పుడు, గాజు యొక్క బరువు మారదని మనము గమనించవచ్చును. కానీ, నేను దానిని ఎక్కువ సేపు పట్టుకుంటే అది బరువుగా మారుతుంది. ఇంకను ఆమె మనము భరిస్తున్న భారాలను గురించి ఇలా చెప్పుటకు ప్రారంభించినది: జీవితంలో ఒత్తిళ్లు మరియు చింతలు ఈ గ్లాసు నీటిలాంటివి. మీరు కొంతకాలం వాటిని గురించి ఆలోచించినప్పుడు ఏమీ జరగదు. మీరు వాటిని గురించి కొంచెం ఎక్కువగా ఆలోచించినప్పుడు మీరు బాధపడుటకు ప్రారంభిస్తారు. మీరు రోజంతా వాటిని గురించి ఆలోచిస్తే, ఏమి చేయాలో తోచక, మీరు కదలలేక స్తంభించిపోతారు. అంతమాత్రమే కాదు, చివరికి ఏమియు చేయలేక మీరు దుఃఖ సాగరములో మునిగిపోతారు.
నా ప్రియులారా, మీ చింతల ద్వారా వేదన చెందకుండా దాని నుండి మీరు కాపాబడటం ఎంతో ప్రాముఖ్యం. మీ మనస్సులో ఉన్న భారాన్ని విడిచిపెట్టండి. వెంటనే, మీ భారాలన్నింటిని ప్రభువుపై మోపండి. భారాన్ని మోసే మిమ్మల్ని చూచి, ఆయన ఇలాగు అంటున్నాడు, " ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తికొని నా యొద్ద నేర్చుకొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును'' (మత్తయి 11: 28-29) అన్న వచనముల ప్రకారము రాబోయే పరీక్షల గురించి మీరు ఆందోళన చెందుతున్నారా? ఆర్థిక సమస్య మిమ్మల్ని చింతలకు గురిచేస్తుందా? మీరు అనారోగ్య సమస్యలతో స్థిరంగా నిలువబడలేకపోతున్నారా? గాజు గ్లాసును క్రింద పెట్టిన దానిని గుర్తుంచుకోండి! ఆకాశాన్ని, భూమిని సృష్టించిన ప్రభువును హత్తుకొనండి. ఆయనకు సమస్తము సాధ్యమే. ఆయన ఎడారిలో మీకు ఒక మార్గమును తెరుస్తాడు. ఎందుకంటే ఈ తరుణంలోనే దేవుడు మిమ్మల్ని తన హృదయంలో దాచుకొనియుండుట ద్వారా మీరు భయం లేకుండా జీవించగలుగుతారు. ఆయన నిజంగా మిమ్మల్ని మరచిపోలేడు. ఎన్నటికిని ఆయన మిమ్మల్ని మరచిపోడు కూడ. కాబట్టి, నిరుత్సాహము చెందకండి. దేవుడు మిమ్మల్ని ఆదుకుంటాడు. క్లిష్టమైన పరిస్థితులలో కూడ దేవుడు మిమ్మును ఆదరించునని మీరు జ్ఞాపకముంచుకొనవలెను. ఈ సందేశము చదువుచున్న మీకు ఎటువంటి బాధలు, భారములు కలిగియున్నను సరే! దిగులుపడకండి, వాటిని చూచి భయపడకండి, మీ భారములన్నిటిని భరించే దేవునిపై మీ భారములను వేసి, పట్టుదలతో నిజంగా మొఱ్ఱపెట్టినట్లయితే, ఆయన మీ భారములను తొలగించి, మీకు విశ్రాంతి నిచ్చి, మీ మార్గములకు ముందుగా తన సన్నిధిని తోడుగా వుంచి మీ కష్టాల నుండి మిమ్మును ఆదుకొనుచూ జీవితములోనికి ముందుకు కొనసాగునట్లు మిమ్మల్ని నడిపిస్తాడు. మీకు పరిపూర్ణమైన విశ్రాంతినిచ్చి సుళువుగాను తేలికగాను మారునట్లు చేసి, మిమ్మల్ని ఆనందింపజేస్తాడు.
Prayer:
ప్రేమగల పరలోకమందున్న మా తండ్రీ, ఆదుకునే దేవా!

యేసు ప్రభువా, మేకుల చేత గాయపరచబడ్డ నీ పాదాల చెంత మేము భరించలేని మా చింతలను, భారాలను సమర్పించుకొనుచున్నాము. దయచేసి మా కష్టాలన్నింటిని సంపూర్ణంగా మార్చుము. మా జీవితంలో సమస్తాన్ని మార్చి, మమ్మల్ని నేటి నుండి ఆశీర్వదించగలవని మేము స్థిరంగా నమ్ముతున్నాము. మా అనుదిన జీవితములో మాకు రావలసిన ఆశీర్వాదములను అడ్డుకుంటున్న సకల ఆటంకములను మరియు అపవాది క్రియలను నాశనపరచి మాకు ముందుగా నడచి, మాకు ఆలోచన చెప్పి మమ్మల్ని నడిపించుమని ప్రార్థించుచున్నాము. మా భారములన్నిటిని నీపై మోపుచున్నాము, మమ్మల్ని ఆదరించి, మా భారములన్నిటి నుండి విడిపించి మాకు విశ్రాంతిని కలుగజేయుము. మాకు ముందుగా నీవు వెళ్లుచు మమ్మల్ని నీ మార్గములో నడిపించుమని సమస్త స్తుతి ఘనత మహిమ నీకే చెల్లించుచున్నాము. దేవా, మా భారములన్నిటిని తొలగించి మమ్మును ఆదుకొనుమని యేసు ప్రభువు ప్రశస్త నామంలో ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000