Loading...
DGS Dhinakaran

అతిశ్రేష్ఠమైన గోధుమలచేత నిన్ను పోషించే దేవుడు!

Bro. D.G.S Dhinakaran
14 Mar
అతిశ్రేష్ఠమైన గోధుమల ననుగ్రహించి నేను వారిని పోషించుదును. కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును. కీర్తనలు 81:16
నా ప్రియమైనవారలారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీ జీవితాలలో దేవుడు " అతిశ్రేష్ఠమైన గోధుమల ననుగ్రహించి నేను వారిని పోషించుదును. కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును '' (కీర్తనలు 81:16) అన్న వచనము ప్రకారము మీ జీవితాలను కొండతేనెతో తృప్తిపరుస్తానంటున్నాడు. కాబట్టి, మీరు ఆనందించండి. అంతమాత్రమే కాదు, కీర్తనలు 147:14లో అటువంటి వాగ్దాన వచనమును మనము చదువగలము. " నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయువాడు ఆయనే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే '' అన్న వచనము ప్రకారము మన దేవుడు మన సరిహద్దులలో సమాధానమును కలుగజేయువాడు. ఇది ఎంత చక్కటి వాగ్దానమో చూడండి. అలాగున నేడు ఈ వెబ్‌సైట్ చూచు మీ సరిహద్దులలో మీకు గొప్ప సమాధానమును కలుగజేసి, అనేక కొరతలలో ఉన్న మీ జీవితాలలో మిమ్మును కొండతేనెతో తృప్తిపరచి మిమ్మును సమృద్ధిగా ఆశీర్వదించుటకు ఆయన మీ పట్ల వాంఛ కలిగియున్నాడు. 

బైబిల్‌లో చూచినట్లయితే, యోబు బహు ఐశ్వర్యవంతుడైయుండెను. ఆ దినములలో జనులందరిలో అతడే గొప్పవాడుగా నుండెను అని చె ప్పబడి యున్నది. " ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవర్తనుడును, న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. అతనికి ఏడుగురు కుమారులును ముగ్గురు కుమార్తెలును కలిగిరి. అతనికి ఏడువేల గొఱ్ఱెలును మూడువేల ఒంటెలును ఐదువందల జతల యెడ్లును ఐదువందల ఆడు గాడిదలును కలిగి, బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా నుండెను'' (యోబు 1:1-3). అతనికి సహాయము చేయుటకు ఎంతో మంది పనివారు ఉండేవారు. " సుఖ దినమునందు సుఖముగా నుండుము '' (ప్రసంగి 7:14) అని దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది. అవును, యోబు సుఖమును అనుభవించియున్నాడు. మరొక ప్రక్కన, " నీకు సర్వసమృద్ధి కలిగియుండియు నీవు సంతోషముతోను హృదయానందముతోను నీ దేవుడైన యెహోవాకు నీవు దాసుడవు కాలేదు '' (ద్వితీయోపదేశకాండము 28:47) అని కూడ దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది. మనము కుటుంబముగా కలిసి దేవుని సేవించవలెనని ఆయన ఆశించుచున్నాడు. యోబు అది కూడ చేశాడు. అతను దేవుని యెదుట సంతోషముతోను హృదయానందముతోను నడుచుకొనెను. " అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు, భూమి మీద అతని వంటివాడెవడును లేడు '' (యోబు 1:8) అని దేవుడే అతనిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడు.
నా ప్రియులారా, ఈనాడు కొందరు తమను మాత్రమే చూసుకొందురు, కుటుంబమును మరచిపోయేదరు. కానీ, యోబు తన పిల్లలు మంచి మార్గములో జీవించుచున్నారా? అని శ్రద్ధగా చూసుకొనుచు, వారిని పరిశుద్ధపరచుటకు దేవునికి బలి అర్పించుచుండెను. తనకున్న పరిపూర్ణత మధ్యలోను హృదయానందముతో కుటుంబముగా కలిసి దేవుని సేవించుచు, " సర్వశక్తుడు ఇంకను నాకు తోడైయుండెను '' అని చెప్పియున్నాడు (యోబు 29:5). అదే అతను పరిపూర్ణ ఐశ్వర్యములను పొందుటకు రహస్యము. 

అంతమాత్రమే కాదు, ఇశ్రాయేలీయుల కొరకు యుద్ధము చేయుటకు దేవుడు యెహోషువను పిలిచినప్పుడు, " యెహోషువ, నేను నీకు తోడై యుందును '' అని చెప్పెను (యెహోషువ 1:5). గిద్యోనుతో, " నేను నీకు తోడైయుందును '' అని సెలవిచ్చెను (న్యాయాధిపతులు 6:16). ఆయన యిర్మీయాను ప్రవక్తగా ఉండుటకు పిలిచినప్పుడు, " యిర్మీయా భయపడకుము, నేను నీకు తోడైయున్నాను '' అని సెలవిచ్చెను (యిర్మీయా 1:8,19). దేవుడు, Äౌవనస్థుడైన యోసేపుకు కూడ తోడైయుండెను. అతడు చేసినదంతయు యెహోవా సఫలము చేసెను (ఆదికాండము 39:3). అవును, నా ప్రియులారా, దేవుడు ఉన్న ప్రతి స్థలములలోను అభివృద్ధి, పరిపూర్ణత ఉండును. 

ఇంకను బైబిల్‌లో చూచినట్లయితే, ఓబేదెదోము దేవుని యందు ఎంతో భయభక్తులతో నడుచుకొనినవాడు. ఆ దినమున యెహోవా మందసము నా యొద్ద ఏలాగుండుననుకొని, దావీదు యెహోవాకు భయపడి యెహోవా మందసమును దావీదు పురములోనికి తన యొద్దకు తెప్పింపనొల్లక గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటి వరకు తీసికొని అచ్చట ఉంచెను. యెహోవా మందసము మూడు నెలలు గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారినందరిని ఆశీర్వదించెను (2 సమూయేలు 6:9-11). అదేవిధంగా, దేవుడు యోబును కూడ ఆశీర్వదించెను. అతనికి దుఃఖము అనునదే లేకుండెను. యోబు దినములలో ఒక వ్యక్తి ఐశ్వర్యవంతుడై యున్నట్లయితే, అతని ఇంటిలో తేనె, నెయ్యి అధికముగా ఉండవలెను. యోబు ఇంటిలో అవి నదివలె ప్రవహించునంత అధికముగా ఉండెను. " నేను పెట్టిన అడుగెల్ల నేతిలో పడెను బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను '' (యోబు 29:6). ఇటువంటి పరిపూర్ణమైన అభివృద్ధిని యోబు అనుభవించాడు. 

అదేవిధముగా, లక్షలాది మంది ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుండి పాలస్తీనాకు వచ్చినప్పుడు, దేవుడు వారిని పోషించెను. " భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వాని నెక్కించెను పొలముల పంట వానికి తినిపించెను కొండ బండ నుండి తేనెను చెకుముకి రాతి బండ నుండి నూనెను అతనికి జుఱి ్ఱంచెను'' (ద్వితీయోదేశకాండము 32:13) మరియు అతి శ్రేష్ఠమైన గోధుమల ననుగ్రహించి ప్రభువు మిమ్మును పోషించును మరియు కొండ తేనెతో ఆయన మిమ్మును తృప్తిపరచును (కీర్తనలు 81:16). అవును, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును (సామెతలు 10:22).

కావుననే, నా ప్రియులారా, ఈ వెబ్‌సైట్ చూచు మీ జీవితములో ఎన్నో కొరతలుండ వచ్చును కానీ, యోబు వలె మీకున్నదంతా పోగొట్టుకొని ఎంతో వేదనతో వుండి యుండవచ్చును, మీరు కుటుంబముగా కలిసి దేవుని సేవించుచు, యోబు వలె మీరు దేవునిని వెదకినట్లయితే, ఆయన మీకు అతిశ్రేష్ఠమైన గోధుమల ననుగ్రహించి మిమ్మును పోషించి, కొండ తేనెతో మిమ్మును తృప్తిపరుస్తాడు. అప్పుడు మన ప్రభువు నేడు మీ కొరతలన్నిటిని తీర్చి, యోబుకిచ్చిన గొప్ప సమాధానమును మీ కుటుంబ జీవితాలలోను, మీ వ్యక్తిగత జీవితములో సంపూర్ణంగా నింపి మీ కుటుంబ జీవితమును బహుగా వృద్ధిపొందింపజేసి మిమ్మును మంచి గోధుమలతో తృప్తిపరచుదును. ఈ వెబ్‌సైట్ చూచు మిమ్మును తృప్తిపరచి మీ కుటుంబ జీవితము మరియు వ్యక్తిగత జీవిత సరిహద్దులలో గొప్ప సమాధానమును అనుగ్రహించి యోబు వలె మిమ్మును విస్తారముగా దీవించి, ఐశ్వర్యవంతులనుగా మార్చి, మీ పట్ల దేవుడే సాక్ష్యము చెప్పునట్లు చేసి, మిమ్మును బహుగా వర్ధిల్లజేస్తాడు. 
Prayer:
రాజాధిరాజువైన దేవా, సమాధాన ప్రభువా!
నీ పాదములకు స్తుతులు చెల్లించుచున్నాము, దేవా, నీ గొప్ప ప్రేమను బట్టి మేము నీ యొద్దకు వచ్చియున్నాము. నీ కృప ద్వారా మా జీవితములో గొప్ప సమాధానమును అనుగ్రహించుము. మా కొరతలన్నిటిని తీర్చి మంచి గోధుమలతో మమ్మును తృప్తిపరచి నదివలె ప్రవహించు నీ దైవీకమైన సమాధానమును మాకనుగ్రహించి మమ్మును ఆశీర్వదించుము. దేవా, మేము కుటుంబముగా నిన్ను సేవించుటకును, యోబువలె వెదకుటకును మాకు సహాయము చేయుము. మా కుటుంబ జీవితాలను, వ్యక్తిగత జీవితాలను సమస్త మేలులతోను, కొండ తేనెతోను, మంచి గోధుమలతోను నింపి, మమ్మును తృప్తిపరచి దీవించుము. నీ దైవీకమైన సమాధానము ఎల్లప్పుడు మా కుటుంబాలలోను, మా సరిహద్ధులలోను నిలిచియుండునట్లు చేసి, యోబు వలె ఆశీర్వదించి, నీ ఆశీర్వదమే మాకు ఐశ్వర్యమిచ్చునట్లు చేయుమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000