Loading...
Evangeline Paul Dhinakaran

విసుకక చేయు మీ ప్రార్థనలకు జవాబు ఇచ్చే దేవుడు!

Sis. Evangeline Paul Dhinakaran
09 Apr
నా ప్రియమైనవారలారా, ఈ వెబ్ సైట్ చూచు మీ ప్రార్థనలకు జవాబు రావాలంటే మీరు, మీ ఇంటివారితో కలసి ఏక మనస్సుతో విసుకక ప్రార్థించాలి. అప్పుడు దేవుడు నిశ్చయముగా మీ ప్రార్థనలకు జవాబిస్తాడు. మన దేవుడు మీతో వున్నప్పుడు మీ ప్రార్థనలన్నిటికి తగిన జవాబు మీకనుగ్రహింపబడుతుంది. ఎంతోకాలము నుండి మీరు ప్రార్థించుచుండవచ్చును, ఎన్నో సంవత్సరములు కొన్నికార్యాల నిమిత్తము వేచియుంటూ జవాబు రాలేదని చింతించవచ్చును, అయితే, నేడు దేవుడు మీ పట్ల వాగ్దానము చేయుచున్నాడు, మీ ప్రార్థనలకు తప్పక జవాబిస్తానని మీకు సెలవిచ్చుచున్నాడు. అందుకే బైబిలేమంటుందో చూడండి, " విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను '' (లూకా 18:1) అన్న వచనము ప్రకారము, కొన్ని సమయములలో, మనము ప్రార్థన చేయుచున్నప్పుడు, మనకు జవాబు లభించకపోవును. అప్పుడు, " మనకు అదృష్టము లేదు. అందుకే ప్రార్థన ఆలకించబడలేదు '' అని అనుకొనెదము. 

కానీ, నా ప్రియ స్నేహితులారా, మనము దేవునిని ప్రేమించినట్లయితే, సమస్తాన్ని ఆయన మనకు మేలు నిమిత్తమే జరిగిస్తాడు. " దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పముచొప్పున పిలువబడిన వారికి, మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము'' (రోమా 8:28)అన్న వచనము ప్రకారము నేడు దేవుని ప్రేమించువారమైన మనము, " నేను అడిగినది దేవుడు అనుగ్రహించలేదు, అయినను నేను అడిగిన దానికంటెను అత్యధికమైదియు మరియు ఉత్తమమైన దానిని ఆయన నా కొరకు సిద్ధపరచియుంచును '' అని మేలు కలుగునంత వరకు విసుకక ప్రార్థించుచుండవలెను. అప్పుడు నిశ్చయముగా మీ ప్రార్థనకు జవాబు దొరుకుతుంది. కాబట్టి, దిగులుపడకండి. 
తిరువళ్లూరు జిల్లాలోని తిరునిన్రవూర్ అను ప్రాంతమునకు చెందిన యమున గోవిందరాజ్ దంపతులు " యేసు పిలుచుచున్నాడు '' టెలిఫోన్ ప్రార్థన గోపురములో పంచుకొనిన సాక్ష్యము మీ ముందుంచుచున్నాను: వివాహమై అనేక సంవత్సరములైనను మాకు సంతానము కలుగలేదు. అందువలన మేము ఎంతో నిందను అవమానమును ఎదుర్కొన్నాము. ఆర్థికముగా కష్టపడుచున్నప్పటికిని, అనేక ఆసుపత్రులలో వివిధ చికిత్సలు పొందుకొన్నాము. అయినను ప్రయోజనము లేదు. వివాహమై 20 సంవత్సరములు గడిచిపోయినందున చాలా వేదన అనుభవించాము. ఒక దినము, ' యేసు పిలుచుచున్నాడు ' టి.వి. కార్యక్రమమును చూస్తున్నప్పుడు, అందులో సహోదరులు పాల్ దినకరన్‌గారు సంతానము లేని వారి కొరకు ప్రత్యేకముగా ప్రార్థన చేయుచున్నారు. అప్పుడు మేము ఇద్దరము కలిసి, సహోదరునితో ఏకీభవించి ప్రార్థన చేశాము. చెన్నైలోని వానగరం అను ప్రాంతములో నిర్వహించబడిన ఒక కూటములో సహోదరులు పాల్ దినకరన్‌గారు దేవుని సందేశమును అందించుచున్నారని తెలుసుకొని, ఆ కూటములో పాల్గొన్నాము. కూటము చివరిలో సహోదరుని వ్యక్తిగతంగా కలుసుకొని ప్రార్థన చేయించుకొన్నాము. అనేక దినములుగా మేము చేసిన ప్రార్థనను మరియు సహోదరుడు చేసిన ప్రార్థనను ప్రభువు ఆలకించాడు. వివాహమై 20 సంవత్సరములు గడిచిన తరువాత గర్భం ధరించుటకును, ఒక మగ బిడ్డ, ఒక ఆడ బిడ్డ అని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చుటకు ప్రభువు మాకు అట్టి గొప్ప కృపను అనుగ్రహించాడు. దేవునికే మహిమ కలుగును గాక. 

నా ప్రియ సహోదరీ, సహోదరులారా, ఒకవేళ మీరు కూడ అనేక దినములుగా ఇటువంటి ఏదైన ఒక అవసరము కొరకు ప్రార్థించుచుండవచ్చును. అయితే, నిరుత్సాహపడకండి. " విసుకక, యెడతెగక ప్రార్థన చేయుడి '' (1 థెస్సలొనీకయులకు 5:17) అన్న వచనము ప్రకారము దేవుడు మీ కన్నీటి ప్రార్థనను అంగీకరిస్తాడు. అంతమాత్రమే కాదు, ఆయన మీకు ఎల్లప్పుడు తోడుగా ఉంటానని వాగ్దానము చేయుచున్నాడు. " ... నేను నీతో చెప్పియున్నాను నీకు తోడైయున్నాను భయపడకుము నేను నీ దేవుడనై యున్నాను దిగులుపడకుము నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడను నేనే నీతియను నా దక్షిణహస్తముతో నిన్ను ఆదుకొందును'' (యెషయా 41:10) అన్న వచనము ప్రకారము సంతానము లేకుండా కష్టపడుచు మీరు విడుచు కన్నీటిని ఆయన చూస్తున్నాడు. నేడు ఈ సందేశము చదువుచున్న మీ కన్నీటి ప్రార్థనకు దేవుడు ఆశీర్వాదకరమైన జవాబును అనుగ్రహించి మిమ్మును సంతోషింపజేస్తాడు. 
Prayer:
ప్రార్థనలను ఆలకించే మా ప్రియ పరలోకపు తండ్రీ, 

దేవా, మేము ఎంతో కాలము నుండి ప్రార్థించుచూ మా ప్రార్థనలకు జవాబు పొందలేకపోవుచున్నాము. తండ్రి, దయతో నేడు మా ప్రార్థనలను అంగీకరించి మాకు జవాబు దయచేయుము. దేవా దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక మా ప్రార్థనల వైపు తిరిగి మా ప్రార్థనలను అంగీకరించుము. మేము జవాబు పొందని ప్రార్థనల ద్వారా మా ధైర్యము చెడిపోకుండా, మమ్మును నీ శక్తితో నింపుము. ప్రార్థ్ధనలు ఆలకించే దేవుడవని మేము నమ్మి నీ యొద్దకు వచ్చుచున్నాము, దయతో మా ప్రార్థనల వైపు నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము మేము చేయు ప్రార్థన అంగీకరించి, మాకు తగిన న్యాయము తీర్చి మమ్మును దీవించుము. విసుకక ప్రార్థించే ప్రార్థనలకు మాకు తప్పకుండా జవాబు దయచేస్తావని మేము విశ్వసించుచున్నాము. సమస్త కార్యములలో మాకు మేలు జరిగిస్తావని విశ్వసించుచు, మేము నిన్ను విడువకుండా, హత్తుకొని జీవించునట్లు కృపను దయచేయుమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000