Loading...
Evangeline Paul Dhinakaran

ఏ కష్టము మిమ్మల్ని ఓడించలేదు!

Sis. Evangeline Paul Dhinakaran
15 May
నా ప్రియమైన స్నేహితులారా, అపొస్తలుల కార్యములు 16:31 నుండి దేవుడు మీకు వాగ్దానము ఇచ్చుచున్నాడు. ఆ వచనము, "...ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ యింటివారును రక్షణ పొందుదురు. '' ఈ రోజు, దేవుడు కుటుంబాన్నంతటిని ఆశీర్వదించాలని తలంచుచున్నాడు. మీరు ప్రభువును విశ్వసించినట్లయితే, మీరు మరియు మీ ఇంటి వారందరు రక్షింపబడుదురని ఈ భాగంలో పేతురు చెరసాలలో ఉన్నప్పుడు తెలియజేశాడు. చెరసాల నాయకుని కుటుంబంలో ఇది జరిగింది. దీనిని, అపొస్తలుల కార్యములు 16:34లో " అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనముపెట్టి, దేవుని యందు విశ్వాసముంచినవాడై తన ఇంటి వారందరితో కూడ ఆనందించెను'' అని మనము చూచెదము.

అవును, నా ప్రియులారా, మనం ప్రభువును విశ్వసించినప్పుడు, మనం లోకమును జయించెదము. బైబిల్ నుండి 1 యోహాను 5:4 ఇలా చెబుతుంది, " దేవుని మూలముగా పుట్టిన వారందరును లోకమును జయించుదురు; లోకమును జయించిన విజయము మన విశ్వాసమే.'' ఆ తర్వాత 1 యోహాను 5:17,18 వ వచనంలో బైబిలు ఇలా చెబుతుంది, " దేవుని మూలముగా పుట్టియున్న వాడెవడును పాపము చేయడని యెరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసికొనును గనుక దుష్టుడు వాని ముట్టడు. మనము దేవుని సంబంధులమనియు, లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము.'' అవును, మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము.
నా ప్రియులారా, మనం పాపాన్ని జయించగలం. మనం ఈ లోకములో ఉన్న కీడును జయించగలము మరియు ప్రభువు మనలను సురక్షితంగా ఉంచుతాడు. లోకమంతా దుష్టుని యందున్నది. అవును, ఈ లోకమంతయు కీడుతో నిండి ఉన్నది. అందుకే యోహాను 16:33లో యేసు ఇలా చెప్పాడు, " నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి యున్నాననెను.'' ఈ లోకాన్ని జయించిన ప్రభువు మిమ్మల్ని కూడా జయించేలా చేస్తాడు. ప్రభువు మీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి, మనం ఈ లోకాన్ని ఎలా జయించగలమో మీకు తెలుసా? బైబిల్ నుండి ప్రకటన 12:11లో " వారు గొర్రెపిల్ల రక్తమును బట్టియు, తామిచ్చిన సాక్ష్యమును బట్టియు వానిని జయించి యున్నారు గాని, మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు'' అని స్పష్టముగా చెప్పబడినది. ప్రభువు మీ హృదయంలోనికి వచ్చినట్లయితే, లోకములోని ఏదీయు మిమ్మల్ని తాకదు. ఏ బాధలు, కష్టాలు, హింసలు, కరువు, ఒంటరితనము, దిగంబరత్వము, అంధకారము, ఏ ప్రమాదం లేదా ఖడ్గము మిమ్మల్ని తాకవు. అవును, దేవుని ప్రేమ నుండి మనల్ని ఎవరు వేరు చేయగలరు? అని బైబిలు చెబుతుంది. వీటన్నిటిలో మీరు అత్యధిక విజయము పొందుచున్నారు. ప్రభువు మిమ్మల్ని సురక్షితంగా మరియు భద్రముగా కాపాడుతాడు. ప్రభువు మీ కుటుంబాన్ని సురక్షితంగా కాపాడును గాక.
Prayer:
సర్వోన్నతుడవైన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ,

ఈ చక్కటి వాగ్దానానికై నీకు వందనాలు. దేవా, నీ రక్షణ హస్తం మా మీద, మా కుటుంబం మీదికి దిగివచ్చునట్లు చేయుము. ప్రభువా, మేము నీ యొద్దకు వచ్చునట్లు చేయుము. ప్రభువా, వీటన్నిటిలో మేము అత్యధిక విజయము పొందుకొనునట్లు చేయుము. దేవా, దుష్టుని యందున్న ఈ లోకములో జీవించుచున్న మమ్మును ఎటువంటి కీడు తాకకుండా చేయుము. ప్రభువా, మా ప్రియులైన వారిని రక్షించుము. దేవా, మేము నీకు సేవ చేయడానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, మేము నీ యందు విశ్వాసముంచునట్లుగా మమ్ములను మార్చుము. మేమును మరియు మా యింటివారందరు రక్షణ పొందునట్లు చేయుము. లోకములో మాకు శ్రమ కలిగినను, ఈ లోకాన్ని జయించే విశ్వాసమును మాకు దయచేయుము. దేవా! బాధలు, కష్టాలు, హింసలు, కరువు, ఒంటరితనము, దిగంబరత్వము, అంధకారము, ఏ ప్రమాదం లేదా ఖడ్గము మమ్మల్ని తాకకుండ కృపను దయచేయుమని యేసు క్రీస్తు అమూల్యమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000