Loading...

ఒకరినొకరు ప్రేమించుకొనేవారు దేవుని మూలముగా పుట్టినవారు!

Shilpa Dhinakaran
08 Feb
నా ప్రియులారా, మన దేవుడు ప్రేమా స్వరూపియై యున్నాడు. ఆయన మనందరి పట్ల తన ప్రేమను వెల్లడిపరచుటకు ఆయన మానవ రూపము దాల్చి ఈ లోకానికి దిగివచ్చాడు. కాబట్టి, ఆయన మనలను ప్రేమించుచున్నాడు, కనుకనే మనము ఒకరినొకరము ప్రేమించుకొనుచు, ఒకరికొరకు ఒకరు ప్రార్థించాలని ఆయన త న ప్రేమను మనకు మాదిరిగా చూపించాడు. నేడు ఈ సందేశము చదువుచున్న మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలని బైబిలు చెబుతుంది. మనలో దేవుని యొక్క ప్రేమగల స్వభావం ఉంటేనే, మనం ఆయన పిల్లలు అని ధైర్యంగా చెప్పగలం. కాబట్టి, బైబిల్‌లో స్పష్టముగా తెలియజేయబడుచున్నది, ' దేవుడు ప్రేమాస్వరూపి; ప్రేమలేనివాడు దేవుని ఎరుగడు '' (1 యోహాను 4:8) అన్న వచనము ప్రకారము దేవుడు ప్రేమా స్వరూపియై యున్నాడు. అందును బట్టియే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి మనం కూడ ఒకరినొకరు ప్రేమించుకోవాలి. అందుకే బైబిలేమంటుందో చూడండి, " మీరు ఒకరి నొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను; నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను '' (యోహాను 13:34) అన్న వచనము ప్రకారము ఇది మన వివాహాలలో కూడ పాటించవలసిన అతి ప్రాముఖ్యమైన ఆజ్ఞయై యున్నది. ఇంకను ఎఫెసీయులకు 5:33వ వచనము ప్రకారం, " మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తననువలె తన భార్యను ప్రేమింపవలెను, భార్యయైతే తన భర్తయందు భయము కలిగి యుండునట్లు చూచుకొనవలెను. '' భార్యభర్తలముగా ఒకరినొకరు ప్రేమించుకొనుటకును మరియు ఘనపరచుకొనుటకు మనము దేవునిచేత పిలువబడి యున్నాము. ఇద్దరు అసంపూర్ణమైన వ్యక్తుల మధ్య ఒకరినొకరు విడిచిపెట్టుకోవడానికి గానీ లేక నిరాకరించలేని వ్యక్తుల మధ్య పరిపూర్ణమైన వివాహం జరుగుతుంది. ' వివాహం స్వర్గంలో నిశ్చయింపబడుననియు ' అని ఒక సామెత కలదు. అవును, మీ వివాహంలో హెచ్చు, తగ్గులు, అపార్థాలు మరియు విభేదాలు, ఇంకను కొరతలు ఉండవచ్చును. కానీ, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు దేవుని ప్రేమను కలిగియుంటూ, మీ జీవిత భాగస్వామిని విడిచిపెట్టవద్దు. మన వివాహాలను మరింత అద్భుతంగా చేయడానికి మనము చేయగలిగే కొన్ని విషయాలు:

1. అన్ని సమయాలలోను దేవునిపై ఆధారపడండి. మీ జీవితంలో దేవునికి మొదటి స్థానం ఇవ్వండి, మరీ ముఖ్యంగా మీ వివాహంలో.

2. మీ జీవిత భాగస్వామి కోసం ప్రార్థించండి.

3. ఒకరినొకరు క్షమించుకోండి. సంబంధంలో ఎవరు సరైనది లేదా తప్పు అనే విషయం పట్టింపు వుండకూడదు. అన్నింటికంటే ప్రేమ, ఆనందం మరియు శాంతితో నిండిన కుటుంబాన్ని కలిగి ఉండాలి.

4. ఓపిక పట్టండి మరియు ఒకరినొకరు ప్రోత్సహించుకొనండి.

5. ఒకరి పట్ల ఒకరు నమ్మకంగాను మరియు విశ్వాసనీయంగా ఉండండి.
నా ప్రియులారా, మొదటి వివాహమును దేవుడు ఏదెను తోటలో చేశాడు మరియు యేసుప్రభువు ఈ లోకములో జీవించినప్పుడు ఆయన చేసిన మొదటి అద్భుతం కానా ఊరి వివాహంలో జరిగింది. ప్రభువు వివాహము అన్ని విషయాలలో ఎంతగానో ఘనమైనదిగా భావిస్తున్నాడు. కాబట్టి, మన వివాహాల కోసం మరియు మన జీవిత భాగస్వాముల కోసం ప్రార్థించడం మన బాధ్యతయై యున్నది. దేవుడు ఎన్నుకున్న మన జీవిత భాగస్వాముల కొరకును మరియు ముఖ్యంగా మనలో ప్రతి ఒక్కరికి మనం ఎల్లప్పుడూ కృతజ్ఞతలు తెలియజేయాలి. దేవుని ప్రేమ మనలో లేకుంటే మన బ్రదుకులో శాంతి లేనట్టే. కుటుంబంలో భార్య భర్తలిరువురు ఒకరినొకరు అర్ధం చేసుకొని అన్యోన్యంగా మెలగాలి. అప్పుడే ఆ వివాహ జీవితము ఎంతో ఆనందముగా ఉంటుంది.కాబట్టి, నేడు ఈ సందేశము చదువుచున్న మీలో ఎంతో మంది మీ కుటుంబ సభ్యులను మరియు ఇతరులను ప్రేమించుచున్నారు? మన పరమ తండ్రి ప్రేమ మీలో వుండునట్లు చూడండి. ఇట్టి పరలోకపు తండ్రియైన దేవుని ప్రేమను కలిగి వుంటే ఈ లోకమే ఎంత ఆనందదాయకం. వారికి మాత్రమే కాదు వారి చుట్టు నుండు ప్రియులందరిలోను మరియు ఆ కుటుంబికులందరిలోను ఎక్కడ ఈ గొప్ప ప్రేమ నిలిచియుంటుందో అక్కడ మరి ఎటువంటి సమస్యలకు తావుండదు. ఈ విషయములో మీరు వెనుకబడి వున్నట్లయితే భారముతో ప్రభువును అడగండి, ' ప్రభువా, నీ యొక్క పరలోక ప్రేమతో మా హృదయమును నింపమని ' ప్రార్థించినప్పుడు, తప్పక ఆయన మీకు ఒకరినొకరిని ప్రేమంచే దేవుని దివ్య ప్రేమను అనుగ్రహిస్తాడు. ఆయన మీ జీవితమును ఆనందదాయకం చేస్తాడు. ఆయన యొద్ద గుప్తములై యున్న సమస్త మేలులతో మిమ్మల్ని నింపి, మీ కుటుంబ జీవితమును పరవశింపజేస్తాడు.
Prayer:
ప్రేమా స్వరూపివైన మా పరలోకపు తండ్రీ,

ప్రభువా, నీ ప్రేమకు ఈ లోకములో సాటియైన ప్రేమ లేదు. దేవా, మేము నిన్ను ప్రేమించుచున్నాము. నీవు మా జీవితములో మంచి కార్యములు చేయుటకు ఆజ్ఞాపించుము. ఇంతవరకు నీవు మమ్మును నడిపించుచున్న విధమును బట్టి నీకు వందనములు. మా జీవితకాలమంతయు నీ ప్రేమలో మేము జీవించుటకు కావలసిన కృపను మాకు దయచేయుము. దేవా, మేము ఇతరులను ప్రేమించే గొప్ప మనస్సును దయచేయుము. మా జీవితమును నీ చేతులలో సమర్పించుకొనుచున్నాము. నీవు మా పాపములను కడిగి మమ్మును పునరుద్ధరింపజేయుము. నీ ప్రేమ బంధముల చేత మా కుటుంబాన్ని నీలోనికి ఆకర్షించుకొనుము. నీ ప్రేమను మాలో నింపుము, తద్వారా మేము ఇతరులను ప్రేమించు హృదయమును మాకు అనుగ్రహించుము. భార్యభర్తలముగా మా తప్పులను క్షమించుకొని, ఒకరినొకరు అన్యోన్యంగా జీవించే గొప్ప కృపను దయచేయుము. దేవా, ఎల్లప్పుడు నీ దైవీకమైన ప్రేమతో మేము నింపబడునట్లు కృపను అనుగ్రహించుమని సమస్త స్తుతి, ఘనత, మహిమ నీకే చెల్లించుచు యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000