Loading...
Stella dhinakaran

ప్రేమ క్షేమాభివృద్ధిని మీకు కలుగజేసే దేవుడు!

Sis. Stella Dhinakaran
19 May
నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీకు తన యొక్క ప్రేమా ద్వారా క్షేమాభివృద్ధిని కలుగజేయవలెనని ప్రభువు మీ పట్ల కోరుచున్నాడు. క్రీస్తు యేసులో గల లోతైన భక్తిగల సమర్పణగల జీవితం దేవుని పట్టుదలతో ప్రేమించునట్లు చేస్తుంది. అపొస్తలుడైన పౌలు తన పరిచర్యలో వివిధ కష్టాలను, నిందలను ఎదుర్కొన్నాడు. కానీ, హింసా కొయ్యపై బాధాకరమైన మరణానికి తనను తాను అప్పగించుకోవడం, తద్వారా విశ్వసించే మానవ జాతినంతటినీ రక్షించేందుకు తన పరిపూర్ణ మానవ శరీరాన్ని క్రయధనంగా ఇవ్వడం ద్వారా క్రీస్తు ప్రదర్శించిన ప్రేమ, క్రీస్తు ఆసక్తుల నిమిత్తం మరియు సహోదరుల నిమిత్తం సేవ చేయడంలో కొనసాగేందుకు పౌలును పురికొల్పింది, ప్రేరేపించింది మరియు ఒత్తిడి చేసింది. " పౌలు ఏథెన్సులో వారి కొరకు కనిపెట్టుకొని యుండగా, ఆ పట్టణము విగ్రహములతో నిండి యుండుట చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయెనని '' (అపొస్తలుల కార్యములు 17:16) లో మనము చదివియున్నాము. ప్రభువును గుర్తెరగని వారిని గురించి మన ఆత్మను నిజంగా మనలను పురికొల్పుతుందా? లేదా? అని మనలను మనము పరీక్షించుకొనవలెను. అన్యజనులను చూస్తూ ప్రభువు స్వయంగా కనికరపడ్డాడు. యేసు ప్రభువు లోకములో జీవించినప్పుడు, " జనసమూహాన్ని చూసినప్పుడు, ఆయన వారిపై కనికరం చూపించాడు. ఎందుకంటే, ఆయన సమూహములను చూచి, వారు కాపరిలేని గొర్రెల వలె విసికి చెదరియున్నందున వారి మీద కనికరపడెను '' (మత్తయి సువార్త 9:36). యేసు ఎల్లప్పుడు తన పిల్లలను గొర్రెలు వలె ఎంతో జాగ్రత్త పరామర్శించేవాడు. గొర్రెలు సాధారణంగా మందముగా ఉంటాయి. అవి ఏమి చేయునో వాటికి తెలియదు. శత్రువుల దాడులకు అవి గురియవుతాయి. అందుకే గొర్రెల కాపరి, గొర్రెలకు ముందుగా వెళ్లతాడు. తద్వారా ఆ గొర్రెలు కాపరియైన ఆయనను గుడ్డిగా వెంబడిస్తాయి. మనలో అనేకమంది కూడా గొర్రెలులాంటివారముగా ఉన్నాము. మనము కల్పనాకథలను సులభంగా నమ్ముతాము. కారణము, " నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి; మీ విరోధియైన అపవాది గర్జించు సింహమువలె ఎవరిని మింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు '' (1 పేతురు 5:8) అన్న వచనము ప్రకారము తన గొర్రెలను తన పిల్లలను అపవాది నుండి కాపాడటానికి సిలువపై తన రక్తాన్ని చిందించినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలియజేయవలెను.

ప్రభువైన యేసుక్రీస్తు గురించి పూర్తిగా తెలియని వ్యక్తులను కఠినమైన మరియు బాధాకరమైన పదాలను ఉపయోగించి సరిదిద్దడానికి సహోదరులు డి.జి.యస్. దినకరన్‌గారు ఎప్పుడు కూడ ప్రయత్నించలేదు. అందుకు బదులుగా, ఆయన వారితో ఎంతో వినయంగా మాట్లాడేవారు. క్రీస్తు ప్రేమతో నింపబడిన ఆయన, తన అసంపూర్ణమైన జీవితం ఎలా మారిపోయి ప్రభువు చేత ఆశీర్వదించబడినదో వారికి తెలియజేసేవారు. ప్రభువు కూడ అదే ప్రేమను మీపట్ల చూపిస్తాడని ఆయన వారికి వాగ్దానము చేసేవారు. ఈ సత్యాలను ఆయన ఎంతో ఆసక్తితో సరళమైన మార్గాల్లో అటువంటి వారికి వివరించేవారు. క్రీస్తును గురించి తెలియని అత్యధిక విధ్యా అర్హతగలవారు మరియు ప్రసిద్ధిగాంచిన వ్యక్తులు మరియు ఉన్నతాధికారులు అతని మాటలను ఎంతో శ్రద్ధగా వినేవారు. తద్వారా, వారందరు నిజం తెలుసుకొని, యేసుక్రీస్తును తమ స్వంత రక్షకునిగా అంగీకరించేవారు. దేవునికే మహిమ కలుగును గాక.
అందువలన, నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు కూడ యేసుక్రీస్తు ప్రేమను కలిగియుండండి. ఈ లోకములో ప్రతి విషయములోను మొదటిగా, ఇలాగున జీవించాలంటే, ప్రభువు ప్రేమతో పొంగిపొర్లుతున్న ఒక దైవిక జీవితాన్ని మనం కలిగి ఉండుట మాత్రమే కాకుండా, ఆయనను గురించిన జ్ఞానం మనము కలిగి ఉండాలి. ఆపై, మనల్ని పరిశీలించి, క్రీస్తు యేసును గురించి మనకు ఎలాంటి జ్ఞానం ఉన్నదో, ఎంత ఆసక్తి ఉంటుందో చూడండి. ఇందుకు కారణము, ఆయన పట్ల మనకు ఉన్న ప్రేమయే. ఆయన పట్ల మనకున్న లోతైన భక్తి మరియు సంస్కరణలో జ్ఞానాభివృద్ధిలో మనం ఎంతో ఆసక్తితో ఎదుగుదమో? లేక ఈ దైవికమైన ప్రేమ యొక్క గొప్పతనాన్ని గుర్తించడానికి ఇతరులకు సహాయం చేయగలమా? అనే తలంపును మనము కలిగియుండాలి. పాత నిబంధనలో కూడ, దేవుడు ఇలా అంటున్నాడు, " యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై యాలాగు సెలవిచ్చెను. నీనెవె పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయెను గనుక నీవు లేచి నీనెవె మహా పట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే నూట ఇరువది వేలకంటె ఎక్కువై, కుడియెడమలు ఎరుగని జనమును బహు పశువులును గల నీనెవె మహాపురము విషయములో నేను విచారపడవద్దా? అని యోనాతో సెలవిచ్చెను '' (యోనా 4:11). సత్యం తెలియకుండా తమ సంస్కృతిని అనుసరించే అమాయక, అజ్ఞాన ప్రజలతో ఈలోకము కూడా నింపబడియున్నది. వారందరి పట్ల దేవుడు జాగ్రత్తగాను మరియు కనికరమును కలిగి ఉన్నాడు. మన జీవితాల ద్వారా క్రీస్తును వారి యొద్దకు తీసుకెళ్లడం మన బాధ్యతయై యున్నది. ఈ లోకంలో ఉప్పుగాను మరియు వెలుగుగాను ఉండటానికి క్రీస్తు ఆజ్ఞకు మనం లోబడి ఉండాలి. అందుకే బైబిలేమంటుందో చూడండి, " మనమందరము జ్ఞానముగలవారమని యెరుగుదుము. జ్ఞానము ఉప్పొంగజేయును గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయును '' (1 కొరింథీయులకు 8:1) అన్న వచనము ప్రకారము కాబట్టి, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు దేవుని ప్రేమను పొందుకొనవలెననగా, మిమ్మల్ని మీరు పౌలు వలె సంపూర్ణంగా ఆయనకు సమర్పించుకొన్నట్లయితే, నిశ్చయముగా, ఆయన తన యొక్క దైవీకమైన జ్ఞానమును ఉప్పొంగజేసి, మీకు క్షేమాభివృద్ధిని కలుగజేసి మిమ్మల్ని అనేకులకు ఆశీర్వాదకరముగా మారుస్తాడు.
Prayer:
ప్రేమా కనికరము కలిగిన మా పరలోకపు తండ్రీ,

నిన్ను స్తుతించుటకు మాకు ఇచ్చిన గొప్ప సమయమును బట్టి నీకు వందనములు చెల్లించుచున్నాము. ప్రభువా, నీ యొక్క నిజమైన ప్రేమను ఆసక్తితో పొందుకొనడానికి మా జీవితాన్ని నీకు సమర్పించుకొనుచున్నాము. దేవా, ఈ లోకములో జీవించుటకు నీ యొక్క దైవీకమైన జ్ఞానము మాకు దయచేయుము. దేవా, నిన్ను గుర్తెరగని అనేకులకు నీయొక్క సత్యాన్ని వారికి తెలియజేసి, నీలోనికి వారిని నడిపించుటకు మాకు సహాయము చేయుము. నీ యొక్క లోతైన రహస్యాలు మాకు నేర్పించుము. దైవీకమైన భక్తి వైరాగ్యములతో ప్రజలు నీ ప్రేమను అర్థం చేసుకోవడానికి మాకు కృపను చూపుము. అనేకమందిని నీ పరలోక రాజ్యానికి తీసుకొని వచ్చుటకు ఆత్మల భారమును కలిగియుండుటకు మాకు సహాయము చేయుము. అనేకులను రక్షించాలన్న హృదయభారమును మాకు దయచేయుము. దేవా, నిన్ను గుర్తెరుగని ప్రజలను నీ యొద్దకు తీసుకొని వచ్చుటకు వారికి నిన్ను గూర్చి సత్యమును చెప్పుటకు మాకు మార్గమును తెరువుము. ప్రభువా, నీ ప్రేమా క్షేమాభివృద్ధిని కలుగజేయుమని మా ప్రభువును ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000