Loading...
Paul Dhinakaran

నిత్యమైన ఆశీర్వాదములు!

Dr. Paul Dhinakaran
30 May
నా ప్రియ స్నేహితులారా, దేవుడు నిత్యమైన వాత్సల్యముతో నేడు ఈ సందేశము చదువుచున్న మిమ్మల్ని ప్రేమించుచున్నాడు. కాబట్టి, ఈ రోజుకు దేవుని వాగ్దానంగా యెషయా గ్రంథము 54:8 వ వచనము ఎన్నుకొనబడినది. అదేమనగా, " మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడనైతిని నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.'' మరొక అనువాదంలో ఇది ఇలాగున వ్రాయబడియున్నది. అదేమనగా, " నిత్యమైన కృపతో నేను మీపై కనికరము చూపుదును. నేను మీకు దయను కనుపరచెదను. '' దేవుడు మన పట్ల కృపగల దేవుడు. మనం పశ్చాత్తాపపడినప్పుడు, ఆయన వచ్చి మనలను కౌగలించుకొని, మనలను మరల తన రొమ్మున ఆనించుకొని మోసుకువెళతాడు. మనం క్షమాపణ కోరినప్పుడు ఆయన తన రక్తంతో మనలను కడిగి శుభ్రపరుస్తాడు. అప్పుడు మనలను ఆయన స్వరూపంలోనికి మారుస్తాడు.

అప్పుడు నా ప్రియులారా, మనపై ఏ దోషారోపణను ఏ వ్యక్తి కనుగొనలేడు. ఆయన వాత్సల్యము కొరకై దేవునికి కృతజ్ఞతలు. యెహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత యెడతెగక నిలుచునది గనుక మనము నిర్మూలము కాకున్నవారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టు చున్నది. ప్రతి ఉదయం ఆయన కృప మనలను మార్చడానికి మరియు మనలను తన రొమ్మున ఆనించుకొనుటకు నూతనముగా పుట్టుచున్నది. అందుకే, " నన్ను జాగ్రత్తగా వెదకువారు నన్ను కనుగొందురు '' అని ఆయన సెలవిచ్చుచున్నాడు. నేడు ఈ సందేశము చదువుచున్న మీ పట్ల నూతనమైన వాత్సల్యమును చూపించడానికి మరియు మిమ్మల్ని తన స్వరూపంగా మార్చడానికి దేవుడు ప్రతి ఉదయం మీ కొరకు సిద్ధంగా వేచి ఉన్నాడు. కాబట్టి, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు, ' దేవుడు నాపై కోపంగా ఉన్నాడు ' అని ఎప్పుడు చెప్పకండి. కాబట్టి, మీకా 7: 18 లో బైబిలు ఇలా చెబుతోంది, " తన స్వాస్థ్యములో శేషించినవారి దోషమును పరిహరించి, వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుట యందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు '' అన్న వచనము ప్రకారము ఆయన కనికరము చూపుట యందు సంతోషించే దేవుడై యున్నాడు. కాబట్టి, చింతించకండి.
ఇంకను బైబిల్‌లో కీర్తనల గ్రంథము 30:5 లో మనం చూసిన, " ఆయన కోపము నిమిషమాత్రముండును ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడ్పు వచ్చి, రాత్రి యుండినను ఉదయమున సంతోషము కలుగును '' అన్న వచనము ప్రకారము ఆయన కోపం నిమిషమాత్రమే ఉంటుంది. కానీ, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలిచి ఉంటుంది. మరొక అనువాదంలో, ఆయన అనుగ్రహం మనల్ని ఎక్కువ కాలం జీవించేలా చేస్తుంది అని చెప్పబడియున్నది. అది దేవుని అనుగ్రహం. కారణము యేసు ప్రభువు నేడు ఈ సందేశము చదువుచున్న మిమ్మల్ని ప్రేమించుచున్నాడు. నిరంతరము ఆయన మీ పట్ల కోపముంచడు. ఆయన దయ ఈ రోజు కూడా మీకు నూతనముగా ఉన్నది. ఆయన మిమ్మల్ని ప్రేమించుచున్నాడు. కాబట్టి, మీరు ఆయన వైపు తిరగండి. ఆయన మీకు జీవితాంతము ఆశీర్వాదం అనుగ్రహిస్తాడు. మీరు చావకుండ సజీవులుగా ఉంటూ దేవుని క్రియలను శాశ్వతంగా వివరించడానికి జీవిస్తారు. కారణము, " అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తయిన ప్రజలునై యున్నారు '' (1 పేతురు 2:9) అన్న వచనము ప్రకారము నేడు ఈ సందేశము చదువుచున్న మీరు ప్రత్యేకమైనవారు కాబట్టి, మీ దేవుడు ఎంత ప్రత్యేకమైనవాడని ఈ లోకానికి మీరు ప్రకటించాలి. మీరు జీవితంలో మీ ఉద్దేశ్యాన్ని ఈలాగుననే నెరవేరుస్తారు. కాబట్టి, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు కూడ ఇటువంటి ఉన్నతమైన ఆశీర్వాదములను పొందుకొనండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.
Prayer:
మా మీద నిత్యమైన వాత్సల్యముతో కృపను చూపే మా ప్రియ తండ్రీ,

నీ కృపా సింహాసనము యొద్దకు వచ్చియున్నాము. మేము నిన్ను స్తుతించుచున్నాము. క్షణమాత్రము మమ్మును విడిచినను, నీ గొప్ప వాత్సల్యముతో నీ యొద్దకు చేర్చుకొనుచున్నందుకై నీకు వందనములు చెల్లించుచున్నాము. దేవా, మా జీవితములో కలిగే ప్రతి శ్రమలలోను మాకు ఓర్పును సహనమును దయచేయుము. ప్రభువా, నీ గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము మేము శోధనలను ఎదుర్కొనుచున్నప్పుడు, మాకు కావలసిన ధైర్యమును మరియు కృపను, శక్తిని అనుగ్రహించి మమ్మును బలపరుచుము. దేవా, మా మీద నీ కోపము నిమిషమాత్రముండునట్లుగాను మరియు నీ దయ ఆయుష్కాలమంతయు నిలుచునట్లు చేయుము. దేవా, నీ రక్తము ద్వారా మమ్మల్ని కడిగి సువర్ణమువలె నీ రూపములోనికి మమ్మల్ని మార్చుము. దేవా, మా శ్రమలలో కూడ మేము నీ మీద నమ్మకాన్ని విడిచిపెట్టకుండా, ధైర్యంగా ముందుకు కొనసాగునట్లు మాకు సహాయము చేయుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000