Loading...
Stella dhinakaran

నీతిమంతుల కొరకు వెలుగు విత్తబడియున్నది!

Sis. Stella Dhinakaran
17 Apr
నా ప్రియమైనవారలారా, ఈ లోకములో మనము జీవించుచున్నప్పుడు పాపము మనలను వెంటాడుతుంది. అటువంటి సమయములో ఈలోక మలినము మనలను అంటకుండ వుండాలంటే మనము ఆయన పిల్లలుగాను, నీతిమంతులుగాను మారాలని ఆయన ఉద్దేశమైయున్నది. ఆయన పిల్లలుగా మారాలంటే మన పాపములను ఆయన యెదుట ఒప్పుకోవాలి. ఎప్పుడైతే మన పాపములను ఒప్పుకొంటామో దేవుడు నీతిమంతుడు గనుక మనలను నీతిమంతులనుగా మార్చుతాడు. కారణము, " ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును '' (1 యోహాను 1:9) అని బైబిల్ చెప్పిన విధంగా దేవుడు మన సమస్త పాపములను క్షమించి మనలను పరిశుద్ధపరచి పవిత్రులనుగా చేస్తాడు. అంతమాత్రమే కాదు, " నీతిమంతుల కొరకు వెలుగును యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి యున్నవి. '' (కీర్తనలు 97:11) అని వాక్యము సెలవిచ్చినట్లుగా, నేడు ఈ సందేశము చదువుచున్న మీలో ఎలాంటి పాపములున్నను సరే, వాటన్నిటిని దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టండి, నీతిమంతులుగా మారండి. 

బైబిల్‌లో భక్తుడైన అబ్రాహామును దేవుడు నీతిగా ఎంచాడు. కాబట్టి, అతను విశ్వాసులకు తండ్రిగా మార్చబడెను. ఎందుకంటే, " అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను '' (రోమా 4:3; యాకోబు 2:23) అన్న వచనముల ప్రకారము దేవుడు అబ్రాహామును ఆయన నీతి మార్గములలో, ఆయన చిత్తానుసారముగా నడుచుటకు పిలిచాడని పరిశుద్ధ గ్రంథములో మనము చదువుతాము. అతను వెలుగు మార్గములో నడుస్తూ అనేకమందికి మాదిరికరమైన జీవితము జీవించునట్లు దేవుడు అతనిని భూమి యొక్క సమస్త వంశస్థులకు ఆశీర్వాదకారకుడుగా చేసెను. ఆలాగే మనము కూడ పరిశుద్ధమైన నీతి మార్గములలో నడుచుటకు పిలిచిన దేవుని చిత్తాన్ని తెలుసుకొని లోబడియుందాము. అప్పుడు అత్యధికమైన ఆయన సమాధానము మరియు సంతోషము మనలో వెలుగునట్లు ప్రభువు మన యెడల కృప చూపుచున్నాడు. 
ఒక కుటుంబ యజమాని మిలటరీ పనిచేసి, భయంకరమైన దురాత్మ సంబంధమైన క్రియలకు, పొగ త్రాగుడుకు బానిస అయినాడు. అతడు నామకార్థపు ్రకైస్తవుడుగా ఉండి దేవుని యొక్క రక్షణను గూర్చిన గొప్పతనమును తెలిసికోలేని స్థితిలో ఉన్నాడు. ఒక దినము అతని ప్రాంతములో దేవుని సేవకుని ద్వారా దేవుడు అనుగ్రహించు రక్షణ యొక్క గొప్పతనమును గూర్చి విన్నాడు. దేవుని పిలుపు మేరకు తన జీవితమును ప్రభువైన యేసుక్రీస్తుకు అప్పగించుకొని నూతన వ్యక్తిగా మారి నీతి మార్గములలో నడుచుచుండెను. కానీ, అతని భక్తి జీవితమును చూచి అతని బంధువులు, స్నేహితులు హేళన చేసేడి వారు. అయితే, దేవుడు అతనిలోని ఆసక్తిని, వెలుగు మార్గములో నడవాలన్న కోరికను చూచి, సమస్తమైన దుష్టత్వము నుండి అతనిని సంపూర్ణంగా విడుదల చేసి, అతనికి మంచి సాక్షి జీవితమును అనుగ్రహించి ఆశ్చర్యకరమైన దేవుని వెలుగుతో నింపబడునట్లు ప్రభువు అతనికి సహాయము చేసాడు. అంతేకాకుండా అతని సంతతికి కూడ ఆయన ఆశీర్వాదాలను అనుగ్రహించాడు. 

కావుననే, నా ప్రియ సహోదరీ, సహోదరులారా, ఎంతటి ఘోరపాపినైన క్షమించే దేవునిని మనము కలిగియున్నాము. కాబట్టి, నేడే ఈ వెబ్‌సైట్ చూచు మీరు మీ పాపములను మనుష్యులతో చెప్పుకోవద్దు, మీ పాపములను దేవుని సన్నిధికి అప్పగించి వాటిని ఒప్పుకొని విడిచిపెట్టండి, నిశ్చయముగా దేవుడు మీ పాపములను క్షమించి, మిమ్మును తన రక్తము ద్వారా పవిత్రులనుగా చేసి, నీతిమంతులుగా తీర్చిదిద్దుతాడు. " మనము పాపము లేనివారమని చెప్పుకొనిన యెడల, మనలను మనమే మోసపుచ్చుకొందుము; మరియు మనలో సత్యముండదు '' (1 యోహాను 1:8) అని బైబిల్ చెప్పిన విధంగా, మనము మన పాపములను ఒప్పుకొని విడిచిపెట్టాలి. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము మీ పాపములను కడిగి మిమ్మును పవిత్రులనుగా చేయును. మీకు యిట్టి అనుభవము కల్గెనా? ఈ దినమే ప్రభువును అడిగి పొందండి. ఆయన రక్తముతో మీ పాపములను కడిగి మీ అతిక్రమములను మన్నించి మిమ్ములను రక్షించును. కష్టములు, శోధనలు మీకు కలిగినను మీ ఆత్మను పాతాళమునకు వెళ్లకుండ ఆయన రక్షించి మిమ్మును దీవిస్తాడు. అంతమాత్రమే కాదు, ఇదేవిధముగా, నేడు ఈ సందేశము చదువుచున్న మీ వంశస్థులందరూ దేవుని ఆశీర్వాదాలను పొందగలుగునట్లు మీరు ఆసక్తితో మీ జీవితమును దేవునికి అప్పగించుకొన్నట్లయితే, ఆయన మీకు రక్షణను అనుగ్రహించి, తరతరముల వరకును సంతోషభరితులగునట్లు చేసి, మిమ్మును వర్థిల్లజేస్తాడు. 
Prayer:
కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రీ, 

మేము నీ రక్షణ మార్గమును అనుసరించుటకు, మంచి కార్యములు చేయుటకు మరియు తరతరములకు నీకు మంచి సాక్షిగా నుండుటకు మమ్మును చెయ్యి పట్టుకొని నడిపించుము. దేవా! మా అతిక్రమములను క్షమించుము. మా పాపములను నీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టుటకు మాకు సహాయము చేయుము. మా హృదయములో వున్న సమస్త కల్మషమును కడిగి మమ్ములను పవిత్రులనుగా చేయుము. మమ్మును విడిపించుటకు కల్వరి సిలువలో కార్చిన నీ అమూల్య రక్తముతో మమ్ములను కడిగి శుద్ధులనుగా జేయుము. నీవు నీతిమంతుడవు గనుక మేమును నీతిమంతులుగా వుండుటకు మా హృదయములను కాపాడుకొనుటకు నీ కాపుదలను మాకు దయచేయుము. పాపాంధకారము నుండి మేము వెలుగులో నడుచుటకు సహాయము చేయుము. అంధకార సంబంధమైన అధికారమునుండి విడిపించుము. మా పాపములను మన్నించి మమ్మును పవిత్రులను చేసి రక్షించి నడిపించుమని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రీ, ఆమేన్.

1800 425 7755 / 044-33 999 000