Loading...
Dr. Paul Dhinakaran

దేవుని ప్రణాళిక ప్రకారము నడిపించును!

Dr. Paul Dhinakaran
17 Sep
నా ప్రియ స్నేహితుడా, నేడు కూడ దేవుడు మీ కొరకు ఒక ఉద్దేశమును కలిగియున్నాడు. మీ చుట్టు అంధకారము ఉన్నదని భయపడకండి. ఈ లోక అంధకారము మధ్యలో యేసు ఎల్లప్పుడు తన వెలుగును ప్రకాశింపజేయును. ‘‘క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని, గురి యొద్దకే పరుగెత్తుచున్నాను’’ (ఫిలిప్పీయులకు 3:14) అని పౌలు చెప్పుచున్నాడు. ఈ లోకములో మీరు పరుగెత్తుటకు దేవుడు ఒక మార్గమును చేసియున్నాడు. యిర్మీయా 29:11లో, ‘‘నేను మిమ్మునుగూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములేగాని హానికరమైనవి కావు; ఇదే యెహోవా వాక్కు’’ అని దేవుడు సెలవిచ్చుచున్నాడు. జగత్తు పునాది వేయబడక మునుపే, దేవుడు మీ జీవితమును గూర్చి ప్రణాళిక చేసియున్నాడు. అనుదినము మీరు ఆయన యొద్దకు రావలెనని ఎదురు చూస్తున్నాడు. తద్వారా ఆయన మీ కొరకు ఉద్దేశించియున్న ప్రణాళిక ప్రకారం మిమ్మును నడిపించాలని ఆశించుచున్నాడు.

దేవుడు మీ కొరకు సిద్ధపరచిన మార్గములో మిమ్మును నడిపించుటకు ఒక దేవదూతను కూడ ఆయన మీ కొరకు నియమించెను. ‘‘ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను’’ (నిర్గమకాండము 23:20) అని దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. మనము దేవుని ప్రణాళిక చొప్పున యథార్థముగా నడుచుకొనినట్లయితే, ఆయన ఉద్దేశించిన మార్గములో ఒక బహుమానము మన కొరకు సిద్ధముగా ఉన్నది. కానీ ఆ మార్గము అంత సులభమైనది కాదు. మనము అరణ్యములోను, ఎడారిలోను నడవాల్సి వచ్చును, ఆటంకములను దాటాల్సిన పరిస్థితి రావచ్చును. కానీ అన్ని విషయములలో మనము ఆ పరిస్థితిని ఎదుర్కొనుటకు దేవుడు ఒక ఉద్దేశమును కలిగియున్నాడు. మనకు మార్గమును చూపించుటకు దేవుడు పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. ‘‘అటువలె ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని, ఉచ్చరింప శక్యముకాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు’’ (రోమా 8:26)  అని మనము దేవుని వాక్యంలో చదివెదము. మనము అనుదినము పరిశుద్ధాత్మతో నింపబడి ప్రార్థించినట్లయితే, ఆయన మన కొరకు దేవుని మార్గమును కనుగొనుటకును మరియు దానిలో నడుచుటకును ఉచ్ఛరింపశక్యము కాని మూలుగులతో ప్రార్థించును. మనము నూతన భాషలలో మాటలాడునట్లు చేయును మరియు ఆ దినము కొరకైన దేవుని ప్రణాళికను మనము అర్ధము చేసుకొనుటకును, దేవుని చిత్తము ప్రకారము నడుచుకొనుటకును మరియు మన కొరకు ఉంచబడిన బహుమానమును సాధించుటకును పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయును.
‘‘తన యిల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానుడు’’ (సామెతలు 27:8) అని దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది. అనగా మనము దేవుని చిత్తములో లేనట్లయితే మనము నష్టపోయెదమని అర్థం. మనము బహుమానము పొందునట్లుగా మన యెదుట ఉంచబడిన పందెములో దేవుని చిత్తము ప్రకారం పరుగెత్తవలెను (1 కొరింథీయులకు 9:24). దేవుని చిత్త ప్రకారం పందెములో పరుగెత్తుటకు, మనము పరుల జోలికి పోకుండా, మన చేతులతో మన పనులు జరుపుకొనుట ద్వారా సమాధానముతో జీవించవలెననే లక్ష్యమును ఏర్పరచుకొనవలెను (1 థెస్సలొనీకయులకు 4:11). కనుక అనుదినము దేవుడు మిమ్మును నడిపించిన ప్రకారం చేయండి. తద్వారా మీరు అన్ని విషయాలలో విజయము సాధించెదరు.
Prayer:
తండ్రీ,

ఈ కృపను నాకు అనుగ్రహించుము. నాతో ఉండుము. నీ ఆత్మ ద్వారా నన్ను నడిపించుము. నీ ప్రణాళికకు విధేయత చూపుటకు నాకు సహాయము చేయుము. నీ చిత్తము మాత్రమే నా జీవితములో జరుగును గాక. నేను పరుల జోలికి పోకుండా, నా బలమంతటితో పని చేయుచు, సమాధానకరమైన జీవితమును జీవించుటకు నాకు సహాయము చేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రీ, ఆమేన్‌.

For Prayer Help (24x7) - 044 45 999 000