Loading...
Dr. Paul Dhinakaran

కనిపెట్టుకొనియుండుడి

Dr. Paul Dhinakaran
10 Sep
పరిశుద్ధ గ్రంథములో మనము రూతును గూర్చి చదివెదము. ఆమె తన భర్తను కోల్పోయినప్పుడు, తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లకుండా, తన అత్తతోనే ఉన్నది. ఆమె, ‘‘నీ దేవుడే నా దేవుడు’’ అని చెప్పి, నయోమి ఆరాధించే జీవముగల దేవుని వెదకినది. రూతు తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లి, నూతన జీవితమును ప్రారంభించుటకు అవకాశము ఉన్నను, ఆమె తన అత్తతోనే ఉండుటకు నిర్ణయించుకొని, దేవుడు తనలో క్రియ చేయుటకు సహనముతో కనిపెట్టుకొనియున్నది. అప్పుడు ఏమి జరిగింది? బోయజు దీవెనలు రూతు మీదికి వచ్చినవి. ‘‘యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును; ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి; ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చునని’’ అతను ఆమెను ఆశీర్వదించెను. ఆ తరువాత బోయజు ఆమెను వివాహము చేసుకొనెను మరియు ఆమె యొక్క విరిగిపోయిన కుటుంబ జీవితము మళ్లీ కట్టబడినది. మరియు ఆమె పేరు మన ప్రభువైన యేసుక్రీస్తు వంశావళిలో వ్రాయబడుట ఎంత గొప్ప ఆశీర్వాదం! ఎంత ఆశీర్వాదకరమైన జీవితం!

ఇది ఆధునిక తరము అని మనందరికి తెలుసు. ప్రజలకు వెంటనే కార్యము జరిగిపోవాలి, వెంటనే కాఫీ, వెంటనే ఆహారం మొదలైనవి కావాల్సిన రోజులు ఇవి. నేటి ప్రపంచములో, సమస్తము వేగముగా జరిగిపోవాలి. కనుక మనము దేవుడు కూడ వేగంగా క్రియ చేయాలని ఆశిస్తుంటాము. కానీ నా ప్రియ స్నేహితుడా, మన దేవుడు సహనముగల దేవుడు. ఆయన సరైన సమయానికి, సరైన కార్యమును చేయును. రూతు ఏవిధంగా సహనముతో ఆశీర్వాదమును పొందుకొనెనో మనము చూసియున్నాము. దేవుని కొరకు సహనముతో కనిపెట్టుకొని యుండమని నేడు నేను మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. ఆయన మీ జీవితములో కూడ అద్భుతము చేయును. మీరు ఊహించిన దానికంటె గొప్ప కార్యమును ఆయన మీకు చేయును. ఆయన మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగువాటన్నిటికంటెను, ఊహించువాటన్నిటి కంటెను అత్యధికముగా చేయ శక్తిగల దేవుడు. దేనికాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించియున్నాడు (ప్రసంగి 3:11). దేవుడు సమస్తమునకు ఒక సమయమును నియమించెను. సరైన సమయములో ఆయన మనలను ఆశీర్వదించినట్లయితే, అది మనకు అవసరమైన సరైన కార్యమగును.
క్రొత్త నిబంధన గ్రంథములో కూడ కానాలో యేసు ఏమి చేశాడో మనము చూసియున్నాము. ఆయన వివాహములో ఉన్నప్పుడు అక్కడ ద్రాక్షరసము అయిపోవును. కనుక యేసు తల్లియైన మరియ, సహాయము చేయమని అడినప్పుడు, ఆయన, ‘‘నా సమయము ఇంకా రాలేదు’’ అని చెప్పెను. కానీ ఆయన సరైన సమయములో నీటిని ద్రాక్షరసముగా మార్చెను మరియు ఆ ద్రాక్ష రసమును త్రాగిన ప్రజలు, పెండ్లి కుమారుడు చివరి వరకు మంచి ద్రాక్షరసమును ఉంచుకొనెనని ఆశ్చర్యపోయారు. కొరతగా కనిపించిన కార్యము సాక్ష్యముగా మారింది. ఈవిధంగా దేవుడు సరైన సమయానికి, సరైన కార్యమును జరిగించును. మరణించి, సమాధి చేయబడి నాలుగు రోజులైన తరువాత, ప్రభువు లాజరును బ్రతికించి ఏవిధంగా అద్భుతము జరిగించెనో మనము చూసెదము. ఆలస్యమైనదని అందరు అనుకొనినను, దేవుని నామము మహిమ పొందుటకు అదే సరైన సమయము అని యేసు నిరూపించెను. కొన్ని సమయములలో దేవుడు ఆశీర్వాదములను ఆలస్యము చేయును కనుక మనము వాటిని పొందుకొనినప్పుడు, ప్రతి ఒక్కరు అది దేవుని వద్ద నుండి వచ్చినదని తెలుసుకొనెదరు. మీ అద్భుతము ఎంతో సమీపముగా ఉన్నది. దేవుని స్థిరముగా పట్టుకొనండి.
Prayer:
ప్రభువైన యేసయ్యా,

నీవు కార్యమును సరైన సమయములో జరిగించే సహనముగల దేవుడవు. ప్రభువా, ఈ సహనము నాలో కూడ నిలిచియుండునట్లుగా సహాయము చేయుము. నీ ఆశీర్వాదమును పొందుకొనుటకు సహనముతో కనిపెట్టుకొనియున్న రూతు మరియు ఇతరుల వలె, నేను కూడ నీ కొరకు కనిపెట్టుకొనియుండుటకు కృప చూపించుము. సరైన సమయములో నీవు నన్ను ఉన్నతముగా ఆశీర్వదించెదవని నేను విశ్వసించుచు, యేసు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రీ, ఆమేన్‌.

For Prayer Help (24x7) - 044 45 999 000