Loading...
Paul Dhinakaran

దేవునిచేత ఘనపరచబడెదరు!

Dr. Paul Dhinakaran
29 Jul
నా ప్రియ అమూల్యమైన స్నేహితులారా, నేటి వాగ్దానంగా, బైబిల్ నుండి యెషయా 43:4 వ వచనము ఎన్నుకొనబడినది. ఆ వచనమేమనగా, " నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి...'' అని చెప్పబడియున్నది. దేవుడు ఇలా అంటున్నాడు: ' నా బిడ్డలారా, మీరు నా దృష్టిలో ప్రియమైనవారు, కాబట్టి, మీకు ఘనత కలుగుతుంది. ' అందుకే బైబిల్‌లో చూచినట్లయితే, " నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందునుబట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలిసియున్నది'' అని చెప్పబడియున్నది. అవును, కీర్తన 139:14 లో చెప్పినట్లుగా మిమ్మల్ని భయంతో, ఆశ్చర్యకరంగా చేసియున్న దేవుడు ఇలాంటున్నాడు. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడినవారు కొందరే అని చెప్పబడినట్లుగానే, మీరు దేవుని చేత ఎన్నుకోబడ్డారు మరియు మీరు ఆయనకు ప్రియమైనవారు. మీరు దేవునికి ఎంతో ప్రియులైనవారైనప్పుడు, ఆయన మిమ్మల్ని ఘనపరుస్తాడు.

రాజును చంపడానికి కుట్ర పన్నిన ఇద్దరు వ్యక్తులను గూర్చి బయటపెట్టుట ద్వారా మొర్దెకై రాజైన అహష్వేరోషు ప్రాణాలను కాపాడాడు. మొర్దెకైకి ప్రశస్త వస్త్రములను ధరింపజేసి రాజు గుఱ్ఱము మీద అతనిని ఎక్కించి రాజ వీధిలో అతనిని నడిపించాలనియు, రాజు ఘనపరచనపేక్షించువానికి ఈ ప్రకారము చేయాలని రాజు ఒక శాసనం ఇచ్చాడు, రాజు తనకు ప్రియులైన వ్యక్తులను ఈవిధంగా ఘనపరుస్తాడు అని తెలియజేయబడినది. మీరు దేవునికి ప్రియులైనవారు కాబట్టి, దేవుడు మిమ్మల్ని కూడ ఘనపరుస్తాడు. కనుకనే, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు మీ జీవితాన్ని యేసునకు సమర్పించుకొన్నట్లయితే, దేవునికి ఉన్న అదే ఘనత, ఆయన బిడ్డలైన మీకు ఇవ్వబడుతుంది. అపవాది యొక్క శక్తులు మీ యెదుట తలవంచును. యేసు నామంలో మీరు ఏది అడిగిన అది మీకు అనుగ్రహింపబడుతుంది. కీర్తన 37:34 లో " యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము ఆయన మార్గము ననుసరించుము భూమిని స్వతంత్రించుకొనునట్లు ఆయన నిన్ను హెచ్చించును భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు'' అని తెలియజేయబడియున్నది.
ఎస్తేరు రాణి దేవుని సన్నిధిలో ఉపవాసంతో మూడు పగళ్లు, రాత్రులు వేచి ఉండెను. అప్పుడు ఆమె తన ప్రాణం మరియు దేశంలోని యూదులందరి ప్రాణాలను కాపాడుట కోసం విజ్ఞాపనము చేయడానికి రాజు వద్దకు వెళ్ళినది. వారు చంపబడాలని ఆజ్ఞ జారీ చేసిన రాజు, వారిపై కనికరము చూపి, ఆమె పట్ల దయను కనుపరచాడు. బదులుగా, ఈ ఉత్తర్వు వ్రాసిన వ్యక్తి చంపబడ్డాడు. కాబట్టి, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండండి, ఆయన మిమ్మల్ని దేశంలోనే ఘనపరుస్తాడు. కీర్తన 91:15లో " అతడు నాకు మొఱ్ఱపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చెదను శ్రమలో నేనతనికి తోడై యుండెదను అతని విడిపించి అతని గొప్ప చేసెదను '' శ్రమ కాలములో ప్రభువు నామాన్ని ప్రార్థించే ప్రతి ఒక్కరూ దేవునికి ఎంతో ప్రియులైనవారు. మనుష్యుల మీద లేదా మీ స్వశక్తి మీద ఆధారపడడానికి ప్రయత్నించకండి. కానీ, దానికి బదులుగా ప్రభువు నామమున ప్రార్థించినప్పుడు మీరు దేవునికి ప్రియులైనవారుగా మార్చబడతారు. ఆయన మిమ్మల్ని విడిపించడం ద్వారా దేవుడు మిమ్మల్ని గొప్ప చేస్తాడు. కీర్తన 112: 9 లో బైబిల్ చెప్తుంది, " వాడు దాతృత్వము కలిగి బీదలకిచ్చును వాని నీతి నిత్యము నిలుచును వాని కొమ్ము ఘనత నొంది హెచ్చింపబడును. '' దేవునికి ప్రియులైనవారుగా మారడానికి మరియు ఈ లోకములో దేవుని ఘనతను పొందడానికి దేవుడు మీకు ఈ కృపను అనుగ్రహిస్తాడు!
Prayer:
కృపా సంపన్నుడవైన మా ప్రియ పరమ తండ్రీ,

నేటి వాగ్దాన వచనానికై నీకు వందనాలు. నీ దృష్టిలో ప్రియులైనవారుగా మారడానికి మరియు నీ యొక్క ఘనతను పొందడానికి మాకు కృపను దయచేయుము. శ్రమ దినములలో మేము నీకు మొరపెట్టునట్లుగా మాకు సహాయము చేయుము. మేము బీదలకు ఉదారంగా ఇచ్చుటకు అటువంటి హృదయాన్ని అనుగ్రహించుము. దేవా, మా జీవితంలో నీవు ఈ వాగ్దానాన్ని నెరవేర్చినందుకు వందనములు. ఈనాడు ఎంతో అమూల్యమైన నీ వాక్యమును మేము విశ్వసించునట్లు మా హృదయములను ఆయత్తపరచుము. మారు మనస్సులేని మా జీవితాలను నీ శక్తివంతమైన వాక్యము చేతను మరియు నీ నామము చేతను మార్చుము. దేవా, మేము నీ దృష్టికి ప్రియులముగాను మరియు ఘనులముగాను ఉండునట్లు మా అతిక్రమములను నీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టుచున్నాము.ఈనాడు అందరి చేత విడువబడిన మా జీవితాలను చూచి, నేడు అందరు ఆశ్చర్యపడునట్లుగా, నీ యొక్క బలమైన వాక్‌శక్తితో మమ్మును నింపుము. నేడు మేము కూడ నీ వాక్యముచేత మరల బలమును పొందుకొని, జీవితములో మరల పుంజుకొని, అగ్రస్థానమునకు చేరునట్లు అటువంటి కృపను మాకు దయచేయుమని యేసుక్రీస్తు అతి శ్రేష్ఠమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000