Loading...
DGS Dhinakaran

మీ ప్రక్కన నిలిచి, మిమ్మును బలపరచే దేవుడు!

Bro. D.G.S Dhinakaran
10 Aug
నేడు ఈ సందేశము చదువుచున్న నా ప్రియులారా, మీ ప్రక్కన దేవుడు మీకు తోడుగా నిలిచి, మిమ్మును బలపరచాలని మీ పట్ల వాంఛ కలిగియున్నాడు. అందుకే బైబిలేమంటుందో చూడండి, " ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచెను '' (2 తిమోతికి 4:17) అన్న వచనము ప్రకారము మీరు బలహీనతలో ఉన్నప్పుడు, దేవుడు తన యొక్క బలముతో మిమ్మును బలపరుస్తాడు. వేగంగా పరుగెడుతున్నఈ లోకములో అనేకసార్లు మనము మన ప్రార్థన జీవితము నుండి తొలగిపోతాము. కారణము, మనము సమస్యలను ఎదుర్కొనే సమయములలో మన నమ్మకాన్ని యేసు మీద ఉంచకుండా, మన దృష్టిని పూర్తిగా సమస్యల వైపు మరల్చెదము. మన గొప్ప దేవుని కంటెను మన సమస్యలను ఎక్కువగా చూచెదము. ఏది ఏమైన సరే, మీరు ఎల్లప్పుడు ప్రార్థించుచు, దేవుని వాగ్దానములను హత్తుకొని జీవించండి. ఆయన వాగ్దానము చేసినట్లయితే, తప్పకుండా నెరవేరుస్తాడు. ఆయన వాగ్దానము మిమ్మును బలపరుస్తుంది. అందుకు బైబిలేమంటుందో చూడండి, " యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించు వాడు నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు నేను ఆశ్రయించియున్న నా దుర్గము '' ( కీర్తనలు 18:2) అన్న వచనము ప్రకారము రక్షించే దేవుడు మీ ప్రక్కన ఉన్నాడు కనుకనే మీరు దేని నిమిత్తమును భయపడకండి మీరు దేవుని వైపు మాత్రము చూస్తూ, ధైర్యంగా ఉండండి. 

1990 వ సంవత్సరములో నా గుండెకు శస్త్రచికిత్స జరిగింది. కొంతకాలము తరువాత వైద్యులు నా గుండెను పరిశోధించాలని చెప్పి, అవసరమైన కొన్ని పరికరములతో మా యింటికి వచ్చి, నన్ను పరీక్షించుటకు ప్రారంభించారు. అయితే, వారు వచ్చిన పనిని వారు చేయుచుండగా, నేనేమో నా పనిని చేస్తున్నాను. అదేమనగా, స్వస్థపరచే యేసు వైపు చూస్తు ఆయనకు ప్రార్థన చేస్తున్నాను. ఆ సమయములో ఒక దైవీకమైన స్పర్శ నా గుండెను తాకినట్లుగా అనిపించినది. అవును మన ప్రభువు ఎల్లప్పుడు తన బిడ్డల పట్ల జాగ్రత్త కలిగియుంటాడు. 
అవును, నా ప్రియులారా నేడు ఈ సందేశము చదువుచున్న మీరు కూడ మీ నమ్మకాన్ని మిమ్మును స్వస్థపరచే, విడిపించే ప్రభువునందు మాత్రమే ఉంచండి. అప్పుడు ఆయన మీ సమస్యల నుండి మిమ్మును విడిపించి, అపవాది శక్తులు మిమ్మును చేరకుండునట్లు మీ నుండి దూరపరచి, రక్షిస్తాడు. వాస్తవానికి, మీ దుఃఖము మధ్యలోను, వ్యాధులు మరియు మీ క్లిష్ట పరిస్థితులలో కూడ దేవుడు వాగ్దానము చేసినట్లుగా, ఆయన మీతో కూడ ఉన్నాడు. " అతడు నాకు మొఱ్ఱపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చెదను శ్రమలో నేనతనికి తోడై యుండెదను అతని విడిపించి అతని గొప్ప చేసెదను '' (కీర్తనలు 91:15) అన్న వచనము ప్రకారము మీరు ఆయనకు మొఱ్ఱపెట్టినట్లయితే, నిశ్చయముగా, మీకు ఉత్తరమిస్తాడు. శ్రమలో మీకు తోడైయుండి, మిమ్మును విడిపిస్తాడు. కాబట్టి, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు ఎన్నో సమస్యలను ఎదుర్కొనుచు మాకు సహాయము చేయువారెవరును లేరని చింతించకండి, మీ సమస్యల మధ్యలో మీ పట్ల దేవుడు చేసిన వాగ్దానములను గట్టిగా పట్టుకొని, వాటియందు విశ్వాసముంచి, దేవుని వైపు మాత్రమే చూడండి, మీ పూర్ణ హృదయముతో ఆయనను వెదకండి. బైబిల్లో దేవుని బిడ్డలు ఎలా దేవుని వాగ్దానములను హత్తుకొని, అవి నెరవేరు వరకు ఏలాగున కనిపెట్టుకొనియున్నారో, ఆలాగున మీరు కూడ చేసినట్లయితే, నిశ్చయముగా, మీ శ్రమలలోను, వ్యాధులలోను ఆయన మీకు తోడై యుండి, మిమ్మును విడిపించి, గొప్ప చేసి, మీకు ఉన్నతమైన బలమును అనుగ్రహించి, కాపాడి సంరక్షిస్తాడు. 
Prayer:
మహోన్నతుడవైన మా గొప్ప పరలోకపు పరమ తండ్రీ, 

నీ నామమునకు స్తుతులు చెల్లించుచున్నాము. దేవా, మా సమస్యలలోను మరియు శ్రమలలోను నీవు మాకు తోడుగా ఉండి బలపరుస్తానని చేసిన ఆ వాగ్దానమును మేము విశ్వసించుచున్నాము. మా జీవితములో ఆ వాగ్దానమును నెరవేర్చుము. శ్రమల మధ్యలో మేము నీకు మొఱ్ఱపెట్టుచున్నాము. దేవా, మా మొఱ్ఱను ఆలకించి, మాకు తగిన ఉత్తరమిచ్చి, మా శ్రమలలో నీవు మాకు తోడై యుండి, మమ్మును విడిపించి, నీ నామమును గొప్ప చేయుటకు మాకు సహాయము చేయుమని యేసుక్రీస్తు అతి శ్రేష్ఠమైన నామమున మిక్కిలి వినయముతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రీ, ఆమేన్. 

1800 425 7755 / 044-33 999 000