Loading...
Paul Dhinakaran

ప్రతి వ్యక్తికి, వృత్తికి ఎళ్లవేళల అవసరమైన గ్రంథం బైబిల్!

Dr. Paul Dhinakaran
14 Jan
నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు నడువవలసిన మార్గమును ప్రభువు మీకు బోధిస్తాడు. అంతమాత్రమే కాదు, ఎల్లప్పుడు మీ మీద తన దృష్టిని నిలుపుతానని వాగ్దానము చేయుచున్నాడు. ఈనాడు ఈ సందేశము చదువుచున్న మీరు క్లిష్టమైన పరిస్థితులలో ఉన్నప్పుడు, దేవుడు మీకు ఒక చక్కటి వాగ్దానమును అనుగ్రహించుచున్నాడు. అందుకే బైబిలేమంటుందో చూడండి, " నీకు ఉపదేశము చేసెదను నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను నీ మీద దృష్టియుంచి నీకు ఆలోచన చెప్పెదను '' (కీర్తనలు 32:8) అన్న వచనము ప్రకారము నేడు దేవుని దృష్టి మీ మీద ఉన్నదని నిశ్చయముగా చెప్పుచున్నాను. మీ అవసరం మరియు కన్నీళ్లు ఆయనచే ఎప్పటికి మరువబడవు మరియు మీరు ఇప్పటి నుండి దేవుని మార్గాలను స్పష్టంగా చూస్తారు మరియు వింటారు.

ఒకసారి, నేను జనరల్ పాటన్ గూర్చిన చరిత్రను చదువుచు ఉన్నాను. ఆయన జర్మన్ సైన్యముతో ధైర్యముగా యుద్ధము చేసి, విజయము తరువాత విజయమును సాధించిన ప్రఖ్యాత ఆర్మీ జనరల్ యుద్ధ విమానాలు మందు గుండ్లను కురిపించుచున్నప్పుడు, ఆయన ధైర్యముగా వాటి మధ్య నడిచేవారు. కేవలం జనరల్ పాటన్ ధైర్యము కారణముగానే శత్రువుల ఆధీనములో ఉన్న ప్రాంతములను కూడ స్వాధీనము చేసుకొనబడినవి. విలేకరులు ఆయనను కలిసి, " అయ్యా, శత్రువులు అధికముగా, మందు గుండ్లను విసురుచున్న స్థలములను ఏ విధంగా స్వాధీనం చేసుకొన్నారు? మీరు అనుదినము ఒక పుస్తకమును చదువుచున్నారని మేము విన్నాము. ఆ పుసక్తము ఏమిటో మేము తెలుసుకొనవచ్చునా? '' అని ఆయనను అడిగారు. అందుకు ఆయన, " అది పరిశుద్ధ గ్రంథము. యుద్ధము భయంకరముగా జరుగుచున్నను నేను అనుదినము దీనిని చదువుతాను. వాక్యము ద్వారా యుద్ధములో దేవుడు నన్ను నడిపించును. మరియు ఆ వాక్యముచేత నా ఆత్మ అనుదినము నూతనపరచబడుచున్నది. ఈ లోకములో నాకు నిర్ణయించబడిన కాలం వరకు ఏ మనుష్యులు లేక అపవాది సయితం, నన్ను నాశనము చేయలేడు '' అని జవాబిచ్చాడు.
నా ప్రియులారా, ఒక సైన్యపు అధికారి నోట నుండి ఈ మాటలు వినుట ఎంత అద్భుతము. మీరు దేవుని వాక్యమును చదివినప్పుడు, అది మీ ఆత్మను నూతనపరచి, మిమ్మును ప్రోత్సహించును. అది మీరు ప్రతి మంచి కార్యము చేయుటకు మీకు బోధించి, మిమ్మును సిద్ధపరచును. అనుదినము ఆయన వాక్యమును ధ్యానించండి. ప్రతి వ్యక్తికి మరియు ప్రతి వృత్తికి ఎళ్లవేళల అవసరమైన గ్రంథమే బైబిల్. కాబట్టి, బైబిల్ అంతయు ఒక పయనికునికి ఒక మ్యాప్ వంటిది తప్ప, మరొకటి కాదు. ఏదైనా విషయంలో దానిలోని లేఖనములను మీ హృదయాన్ని నింపడానికి మీరు అనుమతిస్తే మీరు మీ గమ్యమును కోల్పోరు. సరైన గమ్యమును చేరుకుంటారు. ఇప్పుడు కూడా, వృత్తిలోను, కుటుంబములోను మరియు పాఠశాలలోను మీరు ఎదుర్కొంటున్న పరీక్షలు, సమస్యలను మరియు సంశయములను దేవుడు చూస్తున్నాడు. ఆయన తన జ్ఞానంతో మీకు ఉపదేశిస్తాడు. ఆయన మీకు మంచి మనస్సును ఇస్తాడు. అంతమాత్రమే కాదు, ప్రతికార్యములోను మీరు సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఆయన మీకు సహాయం చేస్తాడు. కారణము, ఆయన దృష్టి మీపైనే ఎల్లప్పుడు ఉన్నదని గుర్తుంచుకోండి. మీరు దానిని పొందుకొనుటకు తెరిచి ఉంచినంత వరకు మీరు చేసే ఏదీ ఆయన దైవీకమైన నడిపింపు నుండి మిమ్మల్ని వేరు చేయదు. " ఆకాశపక్షులను చూడుడి; అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు; అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు; మీరు వాటికంటె బహు శ్రేష్టులు కారా? '' (మత్తయి 6:26) అన్న ఈ వచనము ద్వారా ప్రతి నూతన దినము దేవుడు ఈ సందేశము చదువుచున్న మిమ్మల్ని బలపరచి, ఆయన వాక్యము ద్వారా ధైర్యపరచి, ఆయన మీకు ఉదేశము చేయుచు, మీరు నడవవలసిన మార్గమును మీకు బోధించి, మిమ్మల్ని సరైన మార్గములో నడిపించి, ఉన్నత స్థానమునకు హెచ్చిస్తాడు.
Prayer:
మా పట్ల అద్భుతకార్యాలు జరిగించే మా ప్రియ పరలోకపు తండ్రీ,

ఈ లోకములో నీ వాక్యము వలె మమ్మల్ని ఆదరించి, ప్రోత్సహించుటకు వేరే వాక్యము లేదు. దివారాత్రములు, మేము నీ వాక్యమును చదివి దానిని ధ్యానించుటకు మమ్మల్ని మేము నీ చేతులకు సమర్పించుకొనుచున్నాము. నీ వాక్యములోని అద్భుతములను చూచుటకు మా కన్నులను తెరువుము. ప్రభువా, నీ పాదాలను ఆశ్రయించి, నీ త్రోవలో నడుచుటకు మాకు అటువంటి కృపను చూపుము. ఈనాడు సరైన మార్గము తెలియని మా మీద నీ దృష్టిని ఉంచి, నీవు మేము నడువవలసిన మార్గములో నడుచునట్లు మాకు బోధించుము. మా జీవితములో ఏమి చేయాలో మాకు నీ ఉపదేశములను మరియు ప్రణాళికలను బోధించుము. ప్రభువా, మేము ఎదురుచూచు కార్యముల పట్ల నీవు గొప్ప అద్భుతాన్ని జరిగించుము. అనేకులకు ఆశీర్వాదకరముగా మమ్మును మార్చుము. మేము వెళ్లు మార్గము సరియైనదా? కాదా? అని గ్రహించే ఆత్మను మాకు దయచేయుమని యేసుక్రీస్తు అద్భుత నామములో ప్రార్థిస్తున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000