Loading...
DGS Dhinakaran

దేవుని వాక్యమును ప్రేమించి నెమ్మదిని పొందుకొనండి!

Bro. D.G.S Dhinakaran
27 Feb
నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీ కుటుంబాలలోను మరియు వ్యక్తిగత జీవితాలలోను మిమ్మల్ని దేవుడు తన దైవీకమైన శాంతి సమాధానములతో నింపాలని కోరుచున్నాడు. కాబట్టి, సమాధానము లేని మీరు సమాధానకర్తయైన దేవుని యొద్దకు రండి, ఆయన యందు విశ్వాసముంచినప్పుడు ఆయన లోకమివ్వలేని తన యొక్క శాంతిని మీకు అనుగ్రహిస్తాడు. ఆలాంటి శాంతిని ఎలాగున పొందుకొనగలరు? నేడు ఈ సందేశము చదువుచున్న మీరు దేవుని యొక్క ధర్మశాస్త్రమును ప్రేమించినట్లయితే, మీకు నెమ్మది కలుగునని దేవుని వాక్యము మనకు సెలవిచ్చుచున్నది. దేవుని ధర్మశాస్త్రమును ప్రేమించడం, బైబిల్ చదవడం లేదా ధ్యానించడం కంటే అత్యధికముగా యేసు ప్రభువును ప్రేమించాలి. అలాంటి ప్రేమను పొందుకొనవలెననగా, " ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణశాంతిగలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి యున్నాడు '' (యెషయా 26:3) అన్న వచనము ప్రకారము మీ మనస్సును దేవుని మీద ఆనుకొనునట్లుగా చేసినట్లయితే, నిశ్చయముగా, దేవుడు మిమ్మల్ని పూర్ణ శాంతి గలవారినిగా మారుస్తాడు.
 
ఒకసారి నేను యేసును తెలియని యువరాణిని కలిశాను. ఆమె కోసం ప్రార్థించమని నాతో కూడ ఉన్నవారు నన్ను కోరారు. నేను ఆమె కొరకు ప్రార్థించుటకు ఆమెను కలిసినప్పుడు, నేను మీ కోసం ప్రార్థించవలసిన ప్రార్థన విన్నపములు ఏమిటి? అని ఆమెను అడిగాను. అందుకు ఆమె ఏమి జవాబిచ్చిందో తెలుసా? ' ఆమె, అయ్యగారు, నాకు ఈ లోకములో సమస్తము ఉన్నవి; మంచి భర్త మరియు కొడుకు కూడ ఉన్నారు, ఇంకను నాకు ఎటువంటి కొరతలు లేవు; కానీ నా హృదయంలో నాకు శాంతి సమాధానము లేదు. నేను సంపూర్ణ శాంతిని పొందుకోవాలని ప్రార్థించండి ' అని చెప్పెను.

నా ప్రియులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకమును విడిచి పెట్టి వెళ్లుచున్నప్పుడు, ప్రజలకు అత్యవసరమైనది ' శాంతి సమాధానము ' అని తెలుసుకున్న ఆయన, " శాంతి మీ కనుగ్రహించి వెళ్లుచున్నాను; నా శాంతినే మీ కనుగ్రహించుచున్నాను; లోకమిచ్చునట్టుగా నేను మీ కనుగ్రహించుటలేదు; మీ హృదయమును కలవరపడనీయ్యకుడి '' (యోహాను 14:27) అని సెలవిచ్చుచున్నాడు. ఈ వాగ్దాన వచనము ప్రకారము ఈ లోకమిచ్చే శాంతి తాత్కాలికమైనది. ఇది ఒక క్షణం ఉండి అదృశ్యమైపోతుంది. కానీ, యేసు ప్రభువు ఇచ్చే శాంతి ఈ లోకమిచ్చేది కాదు, అది నిజమైనది మరియు శాశ్వతమైనది. పవిత్రతలో పరిపూర్ణమైన తన యొక్క శాంతిని ఆయన మనకు అనుగ్రహిస్తాడు. అందుకే, యేసు ప్రభువు, తన యొక్క మాటలలో చూచినట్లయితే, ' ఈ లోకము ఇచ్చినట్లు నేను మీకు ఇవ్వను ' అని స్పష్టముగా తెలియజేయుచున్నాడు. ఈ లోకములో జీవించుచున్న ప్రజలు శాంతి కోసం అటు-ఇటు పరుగెత్తుచున్నారు. కానీ, నమ్మదగిన దేవుడు తన వాక్యము ద్వారా ఇలా చెబుతున్నాడు, " ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును '' (యెషయా 9:6) అన్న వచనము ప్రకారము ఆయన సమాధానమునకు కర్తయై యున్నాడని మనకు స్పష్టముగా తెలియజేయుచున్నది. మంచి సమయాల్లో నెమ్మదిని సమకూర్చడం చాలా సులభం. కానీ, తుఫాను వంటి కష్టాలను ఎదుర్కొంటున్నప్పుడు ఈ అద్భుతమైన శాంతిని ఎలా పొందుకొనగలము?
నా ప్రియులారా, అందుకు బైబిలు ఇలా చెబుతోంది చూడండి, " నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు వారు తూలి తొట్రిల్లుటకు కారణమేమియులేదు '' (కీర్తనలు 119:165) అన్న వచనము ప్రకారము నేడు ఈ సందేశము చదువుచున్న మీ మధ్యలో యేసుప్రభువు ఉన్నంత వరకు మీరు పొరపాట్లు చేయరు. దేవునిపై ఈ నమ్మకం మరియు ఆధారపడటం క్రీస్తుయేసులో ఉన్న సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మీలో కలుగుతుంది. అందుకే బైబిలేమంటుందో చూడండి, " దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతా పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి యుండును '' (ఫిలిప్పీయులు 4:6,7) అన్న వచనముల ప్రకారము మన యొక్క క్లిష్టమైన పరిస్థితులలోను మరియు అశాంతి, నెమ్మది లేని సమయములలోను తన యందు నమ్మిక యుంచమని యేసు ప్రభువు మనలను తన యొద్దకు ఆహ్వానించుచున్నాడు. ఈనాడు ఈ సందేశము చదువుచున్న మీలో ఉన్న అనారోగ్యం, నిరాశ మరియు సంబంధ సమస్యల నుండి మిమ్మల్ని దూరంగా ఉంచడానికి, దేవుని వాక్యాన్ని ప్రేమించండి మరియు శాంతితో నింపబడండి. కాబట్టి, ఈనాడు మీ కుటుంబములో శాంతి సమాధానము లోటు కలిగియున్నట్లయితే, నేడే సమాధానకర్తయైన దేవునికి మీ జీవితాలను సమర్పించుకొన్నట్లయితే, నిశ్చయముగా ఆయన మీ గృహములోనికి మరియు జీవితములోనికి వచ్చి, లోకము ఇవ్వలేని శాంతి మరియు సమాధానముతో నింపి మిమ్మల్ని పరవశింపజేస్తాడు.
Prayer:
సర్వకృపలకు ఆధారభూతుడవైన గొప్ప పరలోకపు తండ్రీ,

నేటికిని నీ వాక్యం మాతో ఎలా మాట్లాడుతుందో మేము గ్రహించాము. కావుననే, నీ వాక్యాన్ని చదవడానికి వినడానికి శ్రద్ధ వహించేందుకు మాకు సహాయం చేయుమని వేడుకుంటున్నాము. మా హృదయంలోని చీకటిని నీ వాక్యం చేత తొలగించి, మాలో వెలుగు ప్రకాశించుటకు సహాయము చేయుమని బతిమాలుకొంటున్నాము. దేవా, నీ వాక్యము ద్వారా మాకు సంతోషకరమైన మరియు ఆరోగ్యకరమైన జీవితాన్ని మాకు అనుగ్రహించుము. దేవా, నీ వాక్యమును మేము దివారాత్రము ధ్యానించునట్లు మా హృదయములను ఆయత్తపరచుము. ప్రభువా, నీ వాక్యము నెమ్మది లేని మా జీవితాలలో నెమ్మది కలుగజేయుటకు మాకు సహాయము చేయుము. నీ వాక్యము మా పాదములకు దీపమును మా త్రోవలకు వెలుగునై యుండునట్లు కృపను చూపుము. నీ వాక్యము ద్వారా మేము నడుచునప్పుడు మా అడుగు ఇరుకునపడకుండా, మేము పరుగెత్తునప్పుడు మా పాదము తొట్రిల్లకుండా చేయుము మా కుటుంబములో ఉన్న పోరాటములను తొలగించి, మాకు నీ యొక్క దైవీకమైన సమాధానమును అనుగ్రహించుము. వ్యాధితో బాధపడుచున్న మమ్మల్ని నీ దివ్య హస్తములకు అప్పగించుకొనుచున్నాము. దేవా, శాంతిలేని మా కుటుంబములో నీ శాంతిని మాకనుగ్రహించుము. లోకమివ్వలేని శాంతిని మాకు దయచేయుము. శాంతితోను మరియు సమాధానముతోను మేము ఈ లోకములో జీవించునట్లు మాకు సహాయము చేయుమని సమస్త, మహిమ ఘనత నీకే చెల్లించుచు యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000