Loading...
DGS Dhinakaran

మీరు దేవుని యొక్క సమయోచితమైన మాటలకు లోబడండి!

Bro. D.G.S Dhinakaran
11 Dec
నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మిమ్మల్ని దేవుడు తన యొక్క సమయోచితమైన మాటలతో తగిన సమయమందు నింపాలని మీ పట్ల కోరుచున్నాడు. సమయోచితమైన మాటలు ఎలాగున ఉంటాయో బైబిల్‌లో మనము చూచినట్లయితే, " సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పళ్లెములలో నుంచబడిన బంగారు పండ్లవంటిది '' (సామెతలు 25:11) అన్న వచనము ప్రకారము, దేవుని మాటలు ఎంతో శ్రేష్టమైనవిగా ఉంటాయి.

బైబిల్‌లో, " మోషే మామయైన యిత్రో తన యొద్దకు పంపబడిన మోషే భార్యయైన సిప్పోరాను ఆమె యిద్దరి కుమారులను తోడుకొని వచ్చెను. వారు ఎల్లప్పుడును ప్రజలకు న్యాయము తీర్చవలెను. అయితే, గొప్ప వ్యాజ్యెములన్నిటిని నీ యొద్దకు తేవలెను. ప్రతి అల్పవిషయమును వారే తీర్చవచ్చును. అట్లు వారు నీతో కూడ ఈ భారమును మోసిన యెడల నీకు సుళువుగా ఉండును '' (నిర్గమకాండము 18:2,22) అన్న ఈ సలహా దేవుని పిలుపును నెరవేర్చుటకు మోషేకు ఎంతో బలము నిచ్చినది. అదేవిధంగా, నేడు ఈ సందేశము చదువుచున్న మీ యొక్క క్లిష్టమైన పరిస్థితులలో మీరు సరైన మార్గములో ముందుకు సాగి వెళ్లుటకును, మీకు దైవీకమైన ఆలోచనలు ఎంతో అవసరమైయున్నది.

ఒకసారి, లోతైన సముద్రములో ప్రయాణించిన ఒక ఓడ తాగునీటి కొరతను ఎదుర్కొనెను. ఆ ఓడలో ఉన్నవారికి తరువాత ఏమి చేయాలో తెలియక వారు ఎంతగానో కలవరపడ్డారు. కారణం, ఓడ చుట్టూ ఉప్పు నీటితో నిండిన లోతైన సముద్రం ఉండెను. కనుకనే, ఎంతో భయంతో ఆ ఓడ యొక్క నావికుడు, సహాయం కోసం సమీపంలో ఉన్న అన్ని ఓడ నావికులకు ఒక ' ఎస్ఓఎస్ ' పంపాడు. అతడు ఒక ప్రత్యేకమైన ఓడ నుండి ఈ క్రింది విధంగా ఒక జవాబును అందుకున్నాడు: ' మీరు ఉన్న చోటనే మీ బకెట్లను లోతునకు దించండి ' అని వ్రాయబడెను. ఆ సందేశం ఆ ఓడ నావికుని ఆశ్చర్యపరిచినప్పటికిని, అందిన సలహా మేరకు ఆ నావికుడు వారి యొద్ద బకెట్లను వారు ఉన్న చోటనే, సముద్రంలోనికి దింపమని ఆదేశించాడు మరియు నీటిని సేకరించండి అని చెప్పాడు. వారు ఆలాగున చేసి, నీటిని సేకరించినప్పుడు, ఆ ఓడ నావికుడు తన నాలుకలో ఆ నీటిని కొద్దిగా రుచి చూసి, అతడు ఎంతగానో ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే, ఆ నీరు ఎంతో రుచికరముగా ఉండుట చూసెను. మరొక ఓడ యొక్క నావికుడు ఆ విలువైన మాటలను ఈ విధముగా వ్రాసి పంపాడు. ఎందుకంటే, ఆ ఉప్పు నీటి సముద్రంలో ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో మాత్రమే మంచి నీరు లభిస్తుందని అతనికి తెలుసు గనుక. ఓహ్! ఆ ఓడలోని ప్రజల హృదయాలలో ఉన్న ఆందోళన తొలగిపోయినది. వేదన మాయమైనది! వారి ముఖాలు వికసించాయి!
అదే విధముగా, నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీ జీవితములో కూడ సమయోచితమైన మాటలు మీకు ఎంతో ప్రయోజనకరముగా ఉంటాయి. ఇటువంటి మాటలు చెప్పువారు లేక మీరు జీవితములో దుఃఖ మార్గముగుండా పయనించుచున్నారా? అందుకు బైబిలేమంటుందో చూడండి, " సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును; దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును '' (మత్తయి 12:35) అన్న వచనము ప్రకారము ప్రియులారా, దేవుడు మిమ్మల్ని సరైన మార్గములో నడిపించుటకును తెలివైన మరియు దైవభక్తిగల వ్యక్తులను ఉంచాడు. సరైన సలహాలను అంగీకరించడానికి మరియు తప్పుడు భావనలను తొలగించడానికి దేవునిపై ఆధారపడండి. మీ క్లిష్టమైన పరిస్థితిలో, దేవుడు మీకు అద్భుతమైన మార్గదర్శకత్వం లేదా ప్రోత్సాహకరమైన మాటలను మీతో మాట్లాడుతాడు. తద్వారా, మీరు మీ చీకటి ఊబి నుండి బయటపడతారు. అలాగే, ఇతరులకు సలహా ఇవ్వడానికి సరైన సమయంలో దేవుడు మీకు సరైన మాటలను అనుగ్రహిస్తాడు. సర్వశక్తిమంతుడైన యెహోవా నాకు తగిన నాలుకను ఇచ్చాడు అని మీరు చెప్పగలుగుతారు. బైబిలు ఇలా చెబుతోంది, " అలసినవానిని మాటలచేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి యున్నాడు శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి యుదయమున నాకు విను బుద్ధి పుట్టించుచున్నాడు '' (యెషయా 50:4) అన్న వచనము ప్రకారం జ్ఞానవివేకము గల ఇటువంటి సమయోచితమైన మాటలను వర్తింపజేయడానికి మరియు ఆశీర్వదించడానికి వినే చెవి మరియు లోబడు హృదయాన్ని కలిగి ఉండండి. అలాంటి లోబడే హృదయం ఎటువంటి పరిస్థితులలోనైననూ ఎల్లప్పుడూ ఆశీర్వదింపబడుతుంది. కాబట్టి, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు కూడ దేవుని యొక్క సమయోచితమైన మాటలకు లోబడే హృదయాన్ని కలిగియున్నట్లయితే, నిశ్చయముగా, ఆయన మీకు ఉపదేశము చేసి, మీరు నడవవలసిన మార్గమును మీకు బోధించి, మీ మీద దృష్టియుంచి, మీకు ఆలోచన చెప్పి, మిమ్మల్ని తగిన సమయములో హెచ్చింపబడునట్లు చేస్తాడు.
Prayer:
సర్వోన్నతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రీ,

నిన్ను స్తుతించుటకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వందనములు చెల్లించుచున్నాము. ప్రభువా, మా జీవితంలో ఇతరులు మాట్లాడే మంచి మాటలు వినడానికి మాకు వినయ పూర్వకమైన హృదయాన్ని దయచేయుము. మంచి ఉద్దేశ్యంతో ఇలాంటి మాటలను మేము ధిక్కరించకుండా ఉండునట్లుగా మమ్మల్ని మార్చుము. మమ్మల్ని నీ నోటి మాటల ఆధిపత్యములోనికి సమర్పించుకొనుచున్నాము. సమయోచితంగా మాట్లాడటానికి మాకు సహాయము చేయుము. అంతమాత్రమే కాదు, ఇతరులను ప్రోత్సహించే మాటల ద్వారా వారు సరైన మార్గములో నడవడానికి కారణమవుతుంది. దేవా, నీ యొక్క సమయోచితమైన మాటలను వినుటకు లోబడే హృదయాన్ని కలుగజేయుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000