Loading...
Samuel Paul Dhinakaran

దేవుని స్వరం ప్రవచనాత్మకమైనది!

Samuel Dhinakaran
29 Apr
నా ప్రియ స్నేహితులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీ జీవితములో గ్రహింపలేని గొప్పకార్యములను దేవుడు మీ పట్ల చేయాలని కోరుచున్నాడు. అందుకే ఈరోజు దేవుని వాగ్దానంగా బైబిల్ నుండి యోబు 37:5వ వచనము ఎన్నుకొనబడినది. ఆ వచనమేమనగా, " దేవుడు ఆశ్చర్యముగా ఉరుముధ్వని చేయును మనము గ్రహింపలేని గొప్పకార్యములను ఆయన చేయును. '' ఈ రోజు కూడా, దేవుడు మీ జీవితంలో ఏదైనా చేయాలని ఉద్దేశము కలిగియున్నాడన్న దేవుని స్వరం మీ హృదయంలో ఉరుముధ్వని చేయునని నేను నమ్ముతున్నాను. దేవుడు మీ కోసం గొప్ప విషయాలు కలిగి ఉన్నాడని లేదా మీరు దేవుని నుండి ప్రవచనాత్మక మార్గదర్శకత్వం పొందబోతున్నారని మీరు దేవుని నుండి ప్రవచనాత్మక వాగ్దానమును పొంది ఉండవచ్చును. అయితే, ఈ రోజు ప్రభువు ఈ సందేశము చదువుచున్న మీ అవగాహనకు మించిన అద్భుతమైన కార్యాలను చేస్తానని మీతో చెప్పడానికి ఉరుముతున్నాడు. దానిని మీరు స్వీకరించి అందులోనికి ప్రవేశించండి.

ఆలాగుననే, మా తాతయ్య చనిపోయినప్పుడు, మా నాన్నగారు నా కోసం ప్రార్థించినప్పుడు, అంత్యక్రియల సేవలో, మా తాతయ్యగారైన డా. డి.జి.యస్. దినకరన్‌గారి మీద ఉన్న అభిషేకం శామ్యేల్‌ను అలాగే నింపునట్లు చేయుమని ప్రార్థించారు. ఈ గొప్ప వ్యక్తి చేసిన విధంగా నేను ఏమి చేయబోతున్నాను? అని నేను ఆశ్చర్యపోయాను. కానీ, ఆశ్చర్యకరంగా దేవుడు నన్ను అంచెల అంచెలగా ఎదుగునట్లుగా ఆయన తన సేవలో నన్ను ఉపయోగించుకొనుచున్నాడు మరియు ఈ రోజు ప్రజలు నా దగ్గరకు వచ్చి, శ్యామ్ మీరు పాడినప్పుడు మరియు మాట్లాడేటప్పుడు మీ తాతగారి మాటలు వింటున్నట్లుగా మాకు అనిపిస్తుంది. తద్వారా, మేము అదే దేవుని సన్నిధిని అనుభవిస్తున్నాము అని చెబుతారు. ఇది ఎంత గొప్ప ధన్యత కదా! ఇవి నా అవగాహనకు మించిన కార్యాలను దేవుడు నా జీవితములో జరిగించుచున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక.
బైబిల్‌లోని ప్రవక్తయై సమూయేలును చూచినట్లయితే, దేవుని స్వరం అతనికి వినిపించాడు. " తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలూ సమూయేలూ, అని పిలువగా సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు ఆజ్ఞయిమ్మనెను. అంతట యెహోవా సమూయేలుతో ఈలాగు సెలవిచ్చెను ఇశ్రాయేలులో నేనొక కార్యము చేయబోవుచున్నాను;'' అప్పుడు దేవుడు ఇశ్రాయేలులో తాను చేయబోయే గొప్ప కార్యములను అతనికి బయలుపరచాడు. ఆయన ఆ దేశంలో అద్భుతాలు సాధించడానికి సమూయేలును ఉపయోగించుకున్నాడు. అవును, నా ప్రియులారా, అదే ప్రవచనాత్మకమైన నడిపింపు ఈ రోజు ఈ సందేశము చదువుచున్న మీ జీవితంలోకి రావడం నిశ్చయం. కాబట్టి, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు ఈ వాగ్దానాన్ని స్వీకరించండి మరియు దానిని మీ హృదయంలో భద్రముగా దాచుకోండి. దాని నిమిత్తము దేవునికి కృతజ్ఞతలు తెలియజేయండి మరియు దానిలో నడవండి. అప్పుడు ఈ దయ మీలో పని చేస్తుంది. మీరు ప్రవచనాత్మకంగా నడిపించేందుకు మీ ప్రయత్నంకంటే, దేవుని దయ మీలో గొప్పకార్యాలను చేస్తుంది. కాబట్టి, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు సమూయేలు వలె దేవుని నడిపింపునకు మీ జీవితాలను అప్పగించినట్లయితే, నిశ్చయముగా ఆయన స్వరమును మీరు వినునట్లుగా, ఉరుమువలె మీ యొద్దకు వచ్చి, మీరు గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన మీ పట్ల జరిగించి, మిమ్మల్ని పరవశింపజేస్తాడు.
Prayer:
దయాకనికరములు కలిగిన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ,

నిన్ను స్తుతించుటకై నీవు మాకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు. ఈ గొప్ప వాగ్దానానికి వందనాలు. ప్రభువా, నీ ప్రవచనాత్మక స్వరాన్ని వినడానికి మా హృదయాలను తెరువుము. ఇంకను మా హృదయంలో ఉరుమువలె ఉన్న నీ స్వరమును వినడానికి మాకు సహాయం చేయుము. దేవా, నీ అద్భుతమైన మార్గాల్లో మమ్మల్ని నడిపించుము. దేవా, మేము ఇంతవరకు ఎదురు చూచే కార్యాలను నీవిచ్చిన వాగ్దానము ద్వారా మేము గ్రహింపలేని గొప్పకార్యములను నీవు మా పట్ల జరిగించి, మమ్మల్ని పరవశింపజేయుము. దేవా, సమూయేలు వలె మేము ఎల్లప్పుడు నీ సన్నిధిని వెదకునట్లుగా మాకు నీ కృపను అనుగ్రహించుము. దేవా, ఆర్థికంగాను, వ్యాధుల ద్వారాను నీకు మొరపెట్టుచున్నాము. నీవు మా మొరను ఆలకించి, మాకు సరైన మార్గమును బోధించి, మమ్మల్ని నడిపించుము. మా వ్యాధులను ముట్టి మేము గ్రహింపలేని గొప్ప అద్భుత కార్యములను జరిగించుమని యేసు క్రీస్తు అతి ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000