Loading...

దేవుని ఉన్నతమైన ప్రణాళిక

Stella Ramola
05 Sep
దేవుని తలంపులు మన తలంపుల కంటే గొప్పవై ఉన్నవి. మన ఆలోచనలు ఎప్పుడూ, "నేను అసమర్థుడను. నాకు చాలా సమస్యలు ఉన్నవి. నేను ఆ వ్యక్తి వలె ఉండలేను, నేను ఈ విషయంలో ఎల్లప్పుడు అపజయాన్ని పొందుతున్నాను. నాకు భవిష్యత్తు లేదు" అన్నట్లుగా ఉండవచ్చును. కానీ దేవుని ఆలోచనలు మన మేలు కొరకే ఉండును మరియు ఆయన తలంపులు ఎల్లప్పుడు మంచివే. మన రోగముల నుండి, మన బాధల నుండి మనలను విడిపించాలని ఆయన ఆశించుచున్నాడు. ఆయన మన కొరకు మరణించి, తన ప్రాణమును అర్పించాలని తలంచాడు. ఆవిధంగా మనలను గూర్చి, ఆయన యొక్క ఉద్దేశములు ఎంతో గొప్పవై ఉన్నవి. ఎందుకనగా ఆయన మనలను ప్రేమిస్తున్నాడు. కనుక మనం మన భారములను, రోగములను, అపజయాలను, సమస్యలను మరియు సమస్తమును ఆయన మీద ఉంచెదము. మనము ఆవిధముగా చేసినప్పుడు, ఆయన మనకు తన విడుదలను అనుగ్రహించును. మనము ఆయన యందు విశ్వాసముంచి యున్నాము గనుక ఆయన తన ఉద్దేశములను మనకు బయల్పరచును, మనము నడవవలసిన మార్గమును, మనము చేయవలసిన కార్యములను మరియు మన భవిష్యత్తును మనకు  బోధించును. దేవుడు తన తలంపుల ప్రకారం మనలను నడిపించును. మనము మంచి జీవితము జీవించునట్లుగా, ఆయన తన జ్ఞానముతో మనలను నింపును.

పరిశుద్ధ గ్రంథమునందు, మనము పేతురు జీవితమును గూర్చి చదివెదము. అతను ఒక జాలరి. ఒకసారి యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా, పేతురనబడిన సీమోను అతని సహోదరుడైన అంద్రెయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వలవేయుట చూచెను. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టుజాలరులనుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. పేతురుకు చేపలు పట్టడం అంటే చాలా ఇష్టం. కానీ యేసు అతనిని పిలిచిన వెంటనే అతడు తన వలను విడిచి, యేసును వెంబడించెను. కానీ, యేసు పునరుత్థానుడై లేచిన తరువాత, పేతురు మళ్లీ చేపలు పట్టడానికి వెళ్ళాడు. అతను తన జీవితంలో దేవుని పిలుపును మరిచిపోయాడు. కనుక యేసు మళ్లీ సముద్రం వద్ద అతను చేపలు పడుతున్నప్పుడు అతనికి ప్రత్యక్షమై భోజనము చేసిపెట్టాడు. వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి యోహాను కుమారుడవైన సీమోనూ, వీరికంటె నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? అని అడుగగా అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే యెరుగుదువని ఆయనతో చెప్పెను; యేసు నా గొఱ్ఱె పిల్లలను మేపుమని అతనితో చెప్పెను. మరల ఆయన యోహాను కుమారుడవైన సీమోనూ, నన్ను ప్రేమించుచున్నావా? అని రెండవసారి అతనిని అడుగగా అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే యెరుగుదువని ఆయనతో చెప్పెను; ఆయన నా గొఱ్ఱెలను కాయుమని చెప్పెను. మూడవసారి ఆయన యోహాను కుమారుడవైన సీమోనూ, నన్ను ప్రేమించుచున్నావా? అని అతనిని అడిగెను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి ప్రభువా, నీవు సమస్తము ఎరిగినవాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే యెరుగుదువని ఆయనతో చెప్పెను. యేసు నా గొఱ్ఱెలను మేపుము అని అతనితో చెప్పెను (యోహాను 15:18).
యేసు, పేతురు హృదయములో మనుష్యులను పట్టే జాలరిగా మారాలనే అతని పిలుపును జ్ఞాపకము చేస్తూనే ఉన్నాడు. పేతురు చాలా పిరికి మనిషి. యేసును బంధించిన రాత్రి అతను ఆయన ఎవరో తెలియదని చెప్పెను. కానీ పేతురు ఏమవుతాడనే విషయము యేసుకు తెలుసు. కనుక పేతురు ప్రజలను రక్షించునని ప్రభువు అతనికి బయలుపరిచెను. యేసు చెప్పిన ప్రకారమే, పేతురు, పరిశుద్ధాత్మ అభిషేకము కొరకు పైగదిలో కనిపెట్టుకొని ఉండెను. దేవుడు చెప్పిన ప్రకారంగానే, తన ఆత్మను పంపించెను. ఆత్మతో నింపబడి, అతను ౩౦౦౦ మందికి పరిచర్య చేసినప్పుడు, వారందరు అదే రోజున సంఘములో చేర్చబడ్డారు. పేతురు ద్వారా గొప్ప అద్భుతాలు జరిగినవి మరియు అతని ద్వారా సంఘం స్థాపించబడినది. నేడు, మీరు కూడా మీ జీవితంలో దేవుని పిలుపు ఏవిధముగా నెరవేరుతుందని ఆలోచిస్తూ ఉండవచ్చును. తన చిత్తమును మళ్లీ నిశ్చయపరచమని యేసును అడగండి. మీ ప్రణాళికల కంటే ఆయన ప్రణాళికలే గొప్పవని దేవుడు మీకు నిశ్చయముగా చూపించి, ఆ ప్రకారముగా మిమ్మల్ని నడిపించును.
Prayer:
ప్రేమగల ప్రభువా,

నా జీవితములో నీ పిలుపును జ్ఞాపకము చేసినందుకై నీకు స్తోత్రములు. ప్రభువా, నాతో మాటలాడుట ద్వారా నా జీవితములో నీ పిలుపును మళ్లీ నాకు నిశ్చయపరచుము. అందుకు నన్ను మలచుము. నీ పరిశుధ్ధాత్మతో నన్ను నింపుము మరియు నీ పిలుపును నెరవేర్చుటకు కావలసిన శక్తిని నాకు అనుగ్రహించుము. నా జీవితములో నీ చిత్తము జరుగును గాక.

యేసు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000