Loading...
Paul Dhinakaran

మీకు వెలుగై యున్న దేవుడు!

Dr. Paul Dhinakaran
12 Jun
నా ప్రియ స్నేహితులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మిమ్మల్ని వెలుగులోనికి నడిపించాలని దేవుడు మీ పట్ల కోరుచున్నాడు. అందుకే ఈ రోజు వాగ్దానంగా బైబిల్ నుండి కీర్తనల గ్రంథము 112: 4 వ వచనము మనకు ఇవ్వబడినది. ఈ వచనమేమనగా, ‘‘ యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును ’’ అని వాక్యము సెలవిచ్చుచున్నది. ఇశ్రాయేలీయులను దేవుడు ఐగుప్తు  నుండి బయటకు నడిపించాడు. ఎర్ర సముద్రం చేరుకున్నప్పుడు, ఆకస్మాత్తుగా ఫరో మరియు అతని సైన్యము వారిని వెంబడించుట చూచి, వారు ఫరో సైన్యము చేత చంపబడతారని తలంచారు. ‘‘ అప్పుడు ఇశ్రాయేలీయుల యెదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకుపోయి వారిని వెంబడించెను; ఆ మేఘస్తంభము వారి యెదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను ’’ (నిర్గమకాండము 14:19) అన్న వచనము ప్రకారము ఇశ్రాయేలీయుల ముందు ప్రయాణిస్తున్న మేఘ స్తంభం, వారిని రక్షించడానికి వారి వెనుక నిలబడిందని బైబిల్‌లో చెప్పబడియున్నది.  ఇశ్రాయేలీయులను చంపడానికి వచ్చిన ఐగుప్తీయుల నుండి మేఘ స్తంభం వారిని వేరు చేసింది. ఈ మేఘ స్తంభం ఐగుప్తీయులకు చీకటిగా ఉండెను. కానీ, ఇశ్రాయేలీయులకు, వారు వెళ్ళవలసిన మార్గంలో వారిని నడిపించడానికి ఈ మేఘ స్తంభం నుండి వారికి వెలుగునిచ్చినది.
 
ఈ మేఘ స్తంభం ఎవరో మీకు తెలుసా? అది మరెవరో కాదు యేసు! మనము దాని గురించి యోహాను 8:12 లో చదువుచున్నాము. అందుకే లేఖనములో ఈలాగున చెప్పబడియున్నది. అదేమనగా, ‘‘ మరల యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగుగలిగి యుండునని వారితో చెప్పెను. ’’ అవును, యేసుక్రీస్తు ఈ లోకానికి వెలుగైయున్నాడు. యెషయా 42:16 వ వచనంలో, ‘‘ వారెరుగని మార్గమున గ్రుడ్డివారిని తీసికొని వచ్చెదను వారెరుగని త్రోవలలో వారిని నడిపింతును వారి యెదుట చీకటిని వెలుగుగాను వంకర త్రోవలను చక్కగాను చేయుదును నేను వారిని విడువక యీ కార్యములు చేయుదును ’’ అని సెలవిచ్చుచున్నాడు.
నా ప్రియులారా, బైబిల్‌లో మరొక వచనములో చూచినట్లయితే, యెషయా 60:2 లో ‘‘ చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది కటికచీకటి జనములను కమ్ముచున్నది యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు ఆయన మహిమ నీమీద కనబడుచున్నది ’’ అని సెలవిచ్చుచున్నది. ఈ మహమ్మారితో మన చుట్టూ ఉన్న ప్రస్తుత పరిస్థితి ఇలాగున కనిపించుచుండవచ్చును కదా? ఏదేమైనా, అదే వచనము దేవుని యొద్ద నుండి, మీ చీకటిని వెలుగుగా మార్చునని మీరు నమ్మకముతో ఉన్నట్లయితే, మీ పరిస్థితులకు ముగింపు వస్తుంది. అప్పుడు, యెహోవా మీ మీద ఉదయిస్తాడు మరియు ఆయన మహిమ మీ మీద కనబడును. అవును నా ప్రియ స్నేహితులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీ పరిస్థితి ఎంత చీకటిగా ఉన్నా, దేవుడు తన వెలుగును, మహిమను మీపై ప్రకాశింపజేస్తాడు. అందువలన, ‘‘ నీకు వెలుగు వచ్చియున్నది, లెమ్ము, తేజరిల్లుము యెహోవా మహిమ నీమీద ఉదయించెను ’’ అన్న వచనము ప్రకారము మీకు వెలుగు వచ్చినందున మీరు లేచి ప్రకాశించెదరు! ఈనాటి నుండి నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు ఆయన కొరకు లేచి ప్రకాశించునట్లు చేస్తాడు. మీరు చేయవలసిందల్లా, ఆయన సన్నిధిలో మోకరిల్లి, ఆయన మహిమ మీపై ప్రకాశించునట్లుగా ప్రార్థించినట్లయితే, మీరు సిగ్గుపడరు. చీకటి మీపై అధికారం చేయలేదు. దేవుడు మీ చీకటిని పారద్రోలి మిమ్మల్ని వెలుగులోనికి నడిపిస్తాడు.
Prayer:
మహోన్నతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రీ,
 
నేటి వాగ్దాన వచనానికై నీకు వందనాలు. ప్రభువా, మా చుట్టూ ఉన్న పరిస్థితి నీకు తెలుసు. మాలో వెలుగుగా ఉండి, ప్రతి చీకటిని ఈ రోజు వెలుగుగా మార్చుము. దేవా, మా భయాలు మరియు అపజయాలతో నీ యొద్దకు వస్తున్నాము. ప్రభువా, మా చుట్టు ఉన్న చీకటిని నీవు వెలుగుగా మార్చుము.  ఇటువంటి గందరగోళ సమయంలో కూడా మేము నీ నామము యందు నిరీక్షణ కలిగియున్నాము. దేవా, మా సహాయం కోసం మేము ఎక్కడికి వెళ్ళగలము? నీవు మాకు సహాయకుడవు. బలహీనులముగా ఉన్న మాకు నీ శక్తిని అనుగ్రహించుము. మాకు విరోధముగా లేచు శత్రువులు సిగ్గుపడునట్లు చేయుము. యేసయ్యా, వెలుగుగా ఉన్న నీ యొద్దకు మేము వస్తున్నాము. మా చీకటి జీవితాలను వెలుగుగా మార్చి, నీ నామ మహిమార్థం నీ కొరకు జీవించుటకు మాకు సహాయము చేయుము. ఈనాటి నుండి మేము నీ కొరకు లేచి ప్రకాశించునట్లు మాకు సహాయము చేయుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000