Loading...
Paul Dhinakaran

మరణమును గెలిచి పునరుత్థానుడైన యేసు!

Dr. Paul Dhinakaran
21 Apr
నా ప్రశస్తమైనవారలారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీకందరికి మా ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేయుచున్నాము. మన ప్రభువైన యేసుక్రీస్తు సజీవుడుగా పునరుత్థానుడైన దినమే ఈస్టర్ శుభదినము. ఆయన మన కోసం నేడు మరణమును గెలిచి సజీవుడైయున్నాడు. కావుననే, ఈ ఈస్టర్ దినమున మీరు ఆయనకు మొఱ్ఱపెట్టినప్పుడు ఆయన వెంటనే మీకు జవాబిస్తాడు. ఆయన మీ యొద్దకు వస్తాడు. ఆయన మీ ప్రార్థనకు జవాబిస్తాడు. ఎంత గొప్ప ఆనందమో కదా. యేసుక్రీస్తు మరణమును గెలిచి, పునరుత్థానుడాయెను. " ... పునరుత్థానమును జీవమును నేనే... '' (యోహాను 11:25) అన్న వచనము ప్రకారము ఆయన యొక్క పునరుత్థానపు శక్తి ద్వారా మీలో ఉన్న అంధకారము నుండి ప్రభువు మిమ్మును బయటికి తీసుకొచ్చాడు. నిశ్చయముగా, నేడు మన మధ్యలో ఆయన పునరుత్థానుడై యున్నాడు. ఆయన యొక్క పునరుత్థానపు శక్తి ద్వారా మిమ్మును స్వస్థపరుచుటకు సిద్ధముగా వున్నాడు. అంతమాత్రమే కాదు, నూతన జీవితమును ఇచ్చుటకును మరియు మీకు మంచి భవిష్యత్తునిచ్చుటకును సిద్ధముగా వున్నాడు. ఈ దినము మనకు అదే సంతోషకరమైన మహా శుభదినము. అదే ఈస్టర్ శుభదినము. ఈ దినమున ఆనందించి సంతోషించుచు పునురుత్ధానుడైన దేవుని యొక్క ప్రేమను మరియు పునరుత్థానపు శక్తిని కొనియాడుచూ, దేవుని దీవెనలు పొందుకొనండి. 

నా ప్రియులారా, నేను మరియు నా కుటుంబ సభ్యులందరు కలిసి మీకు ఈస్టరు శుభాకాంక్షలు తెలియజేయుచున్నాము. ఇది దేవుడు మన కొరకు తన జీవమును త్యాగముచేసిన మహిమకరమైన ఒక పండుగ. ఈ ఈస్టరు దినమును మేము సంతోషముగా కొనియాడుచున్నాము. ప్రభువు మిమ్మును కూడ ఆలాగుననే నడిపించునని మేము నమ్ముచున్నాము. దేవుడు మనకు అనుగ్రహించు ఆశీర్వాదము మనకు ఆనందమునిస్తుంది. సంతానములేదు, వివాహము కాలేదు, ఉద్యోగము లేదు, మా రాబడి మాకు సరిపోవుట లేదని ఇలాగున అనేక విధములైన కొరతలతో ఉన్న మీ జీవితములో పునరుత్థానుడైన యేసు మీ పట్ల అద్భుతకార్యములు జరిగించి మిమ్మును పరవశింపజేస్తాడు. ఎందుకనగా, ఆయన నేటికిని మన మధ్యలో సజీవుడైయున్నాడు. 

అందుకే వాక్యము మనకు ఇలాగున తెలియజేయుచున్నది, " అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును '' (సామెతలు 28:13) అను లేఖనముల ప్రకారము, మీ కొరకు సిలువలో మరణించిన యేసు యొద్ద మీ పాపములు ఒప్పుకొన్నట్లయితే, ఆయన మిమ్మును క్షమించి, పరిశుద్ధపరచి, సజీవంగా జీవింపజేస్తాడు. " మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి యున్నారు; ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే '' (ఎఫెసీయులకు 2:8) అన్న వచనము ప్రకారము మీరు దేవుని యొక్క కృపచేత రక్షింపబడియున్నారు. ఇంతటి గొప్ప యీవిని దేవుడు మనకు అనుగ్రహించియున్నాడు. మన బలహీనతలను, వ్యాధులను, దుఃఖమును ఆయన భరించి, సిలువలో మన నిమిత్తము మరణించి, పునరుత్థానుడై రక్షణ భాగ్యమును మనకు అనుగ్రహించాడు. కావుననే, ఈ పునరుత్థాన పండుగను మనము వేడుకగా జరుపుకొనుచున్నాము. మన బలహీనతల మధ్యలో దేవుడు మనతో కూడ ఉండి మనలో క్రియ జరిగించుట ఎంత గొప్ప ధన్యత కదా! దేవుని యొక్క ఈ గొప్ప ధన్యత నిమిత్తము ఈనాడు మాత్రమే కాదు, మన జీవితాంతము వరకు మనము ఆయనను కొనియాడవలెను. 
మన ప్రభువైన యేసుక్రీస్తు చనిపోయిన తరువాత, ఆయన సమాధి చేయబడెను. విశ్రాంతిదినము గడచిపోయిన తరువాత ఆదివారమున, తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. దుఃఖముతోను, బలహీన పరిస్థితిలోను, ఆ స్త్రీలు చనిపోయిన యేసు యొక్క దేహమును చూచుటకు సమాధి యొద్దకు వచ్చారు. వారు యేసు పునరుత్థానుడై లేచియుంటాడనియు, ఆయనను చూడాలని రాలేదు. కానీ, యేసుక్రీస్తు తాను చెప్పినట్టే ఆయన లేచి యున్నాడు; ఇంతకు పూర్వమే చెప్పినను, వారు ఆ మాటలను విశ్వసించలేదు. అవును దుఃఖము, వేదనతో నిండియున్నప్పుడు, మనము ఎంతగా భక్తిగా ఉన్నను సరే, మనము విశ్వాసముగా ఉండలేదు. కాబట్టి, ఆ స్త్రీలు, దుఃఖముతో ఉన్నందున యేసు చెప్పిన మాటలను మరచిపోయి,చనిపోయిన యేసు యొక్క దేహమును చూచుటకు వారు వచ్చిరి. అయితే, " దూత ఆ స్త్రీలను చూచి మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారని నాకు తెలియును; ఆయన ఇక్కడ లేడు; తాను చెప్పినట్టే ఆయన లేచి యున్నాడు; రండి ప్రభువు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్లి, ఆయన మృతులలోనుండి లేచియున్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి; ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్లు చున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు; ఇదిగో మీతో చెప్పితిననెను '' (మత్తయి 28:5-8). " వారు భయముతోను మహా ఆనందముతోను సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్లి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరుగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. వారు ఆయన యొద్దకు వచ్చి, ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా యేసు భయపడకుడి; మీరు వెళ్లి, నా సహోదరులు గలిలయకు వెళ్లవలెననియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడనెను '' (మత్తయి 28:8-10).

నా ప్రియులారా, ఈనాడు యేసు సజీవుడుగా మన మధ్యలో ఉన్నాడని మనము ఇతరులకు తెలియజేసినప్పుడు, మనలో ఎటువంటి బలహీనత ఉన్నను సరే, ప్రభువు ఆ బలహీనతను మార్చి, జీవములేని మన అవయవములను సజీవంగా చేయును. అనేకులకు దీవెనలను కలుగజేసేవారినిగా మనలను మారుస్తాడు. మీరున్న స్థానంలోనే ఇప్పుడు మోకరించి కన్నీళ్లతో, ' ఓ దేవా, నీ ప్రాణాన్ని నా కోసం అర్పించిన దేవా, ఈ పునరుత్థాన అనుభవం మాకు దయచేయుము, ఇక నుండి పరిశుద్ధంగా జీవించుటకు ఇప్పుడే నీ పునరుత్థానపు శక్తి ద్వారా మమ్మును కడుగుము, నీ రక్తంతో మమ్మును శుద్ధీకరించు '' అని ప్రార్థించండి. దేవుడు నేటికిని సజీవంగా మన మధ్య ఉన్నాడు గనుక, నే డు మీ ప్రార్థన అంగీకరించి, మీ వ్యాధులను, సమస్యలను మీ నుండి తొలగించి మిమ్మును నూతనంగా పునరుద్ధరించి మీ మధ్యలో నివసిస్తాడు. ఇంకను మీలో ఉన్న సత్క్రియలను మరియు మంచి ఆత్మను దేవుని కొరకు ఉపయోగించండి. అప్పుడు దేవుడు మీలో నుండి బయలు వెళ్లు ప్రతి మాట ద్వారా లక్షలాది మందిని సజీవంగా లేపుతాడు. మీకు దొరికిన ఈ గొప్ప ధన్యతను గురించి దేవునికి కృతజ్ఞతలు తెలియజేసినప్పుడు, ఆయన అనేక ఆశీర్వాదములను, తలాంతులను మీకనుగ్రహించి మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఈ పునరుత్థానపు దినమున మీరు ' లేనివాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుని ' వైపు చూచినట్లయితే, ఆయన మీ హృదయ వాంఛలను నెరవేరుస్తాడు. మిమ్మును ఆశీర్వదించి హెచ్చిస్తాడు. ఈ ఈస్టరు శుభదినమున దేవుడు మిమ్మును మరియు మీ కుటుంబమును ఆశీర్వదించి పరవశింపజేస్తాడు. 
Prayer:
మృత్యుంజయుడవైన మా ప్రియ పరమ తండ్రీ, 

నీ నామమును మహిమపరచుచున్నాము. దేవా, నీవు సజీవుడుగా ఉన్నట్లుగా, మమ్మును కూడ సజీవులనుగా మార్చుము. నిర్జీవ స్థితిలో ఉన్న మా శరీరాలను మరియు అవయవాలను, కుటుంబాలను నీవు సజీవంగా మార్చుము. ప్రభువా! నీ యొద్దకు వచ్చువారి పక్షమున నీవు జీవించుచున్నవాడవు కావున మేము నీ యొద్దకు వచ్చుచున్నాము, మమ్ములను సంపూర్ణముగా రక్షించి, నీ పునరుత్ధాన శక్తి ద్వారా మమ్మును జీవింపజేయుము. మరణకరమైన వ్యాధులు మమ్మును అంటకుండా నూతనపరచుము. దేవా, నీవు మా అపరాధముల నిమిత్తము సిలువలో ఘోరంగా మరణించావు, నీవు పొందిన మరణము ద్వారా మాకు విజయము నిచ్చినందుకు నీకు స్తుతులు చెల్లించుచున్నాము. దేవా, ఈ లోకములో మమ్మును ఎవరు విడిచినను, నిందించినను, మరణమును గెలిచి పునరుత్థానుడవైన నీవు మాతో కూడ సదాకాలము నివసించుమని అతి వినయముతో వేడుకొనుచున్నాము. యేసయ్యా, ఈనాడు నీ పునరుత్థానపు శక్తి ద్వారా మా పాపములను నీ రక్తంతో క డిగి నీ పరిశుద్ధాత్మతో మమ్ములను నడిపించుము. మరణించి మూడవ దినమున మా కొరకు సజీవంగా పునరుత్థానుడవై లేచిన దేవా, మా హృదయములను నీకు సమర్పించుకొనుచున్నాము. సమాధులుగా ఉన్న మా జీవితాలను సజీవంగా మార్చుము. సదాకాలము నీవు మాతో పునరుత్థానుడవై యుండి మా సమస్యలను, వ్యాధులను తొలగించి నూతన శక్తితో మేము నీతో లేపబడుటకు మాకు సహాయము చేయుమని పునరుత్థానుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000