Loading...
Paul Dhinakaran

దేవుడు మీ స్వాస్థ్యము మరియు భాగము!

Dr. Paul Dhinakaran
08 May
నా ప్రియ స్నేహితులారా, ఈ రోజు, ఈ సందేశము చదువుచున్న మీకు ఒక గొప్ప ఆశీర్వాదకరముగా ఉండును గాక! దేవుని నుండి నేటి వాగ్దానముగా కీర్తన 16:5లో కనుగొనబడింది. ఆ వచనమేమనగా, " యెహోవా నా స్వాస్థ్యభాగము నా పానీయభాగము నీవే నా భాగమును కాపాడుచున్నావు'' అన్న వచనము ప్రకారము ఆయనే మీ స్వాస్థ్యభాగము. అవును, ప్రియ స్నేహితులారా, ఈ భాగములో దావీదు తనను తాను పూర్తిగా దేవునికి అప్పగించుకొనెను. కాబట్టి, ధైర్యముగా చెప్పగలిగాడు.

అదేవిధముగా, దేవుడు తన స్వాస్థ్యభాగము అని దావీదు పలికినప్పుడు, అతను ఇలా అంటున్నాడు, ' ఓ! ప్రభువా, నేను ఈ లోకంలో జీవించడానికి కావలసిన భాగమంతా నువ్వే. ప్రతి ఆశీర్వాదం మరియు ప్రతి స్వాస్థ్య భాగమును పొందేందుకు నీవు సిలువపై క్రయధనమును చెల్లించావు, కాబట్టి ప్రతి ఆశీర్వాదం నీలో ఉంది ' అని చెప్పుచున్నాడు. ఇది మీ భూసంబంధమైన తండ్రి లేదా భూసంబంధమైన తల్లి నుండి మీరు పొందే స్వాస్థ్యము వంటిది కాదు, ఇది వారు ఇచ్చే స్వాస్థ్య భాగమును ఎంతో అమూల్యమైనది కావచ్చును. కానీ, అది భూములు, బంగారం మరియు సంపద వంటివి మాత్రమే ఉండును. కానీ, యేసు తన సిలువ త్యాగం ద్వారా మనకు జీవమును స్వాస్థ్యముగా దయచేసెను.

నా ప్రియులారా, దేవుడు మనకు ఇచ్చేది పరిపూర్ణమైన ఆశీర్వాదాలు. అందు కే దావీదు ఇలా అన్నాడు, " ప్రభువా, నీవే నా పూర్తి స్వాస్థ్యము. మంచి యీవులు నీలో ఉన్నాయి.'' అవును, ఈ రోజు కూడా ప్రభువు మన నుండి ఈ మాట వినాలని కోరుకుంటున్నాడు. మనం యేసును అడుగుదాం. యెషయా 58:14లో మనం అలాంటి ఆశీర్వాదాన్ని చూడగలుగుచున్నాము. " నీవు యెహోవా యందు ఆనందించెదవు దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను నీ తండ్రియైన యాకోబు స్వాస్థ్యమును నీ యనుభవములో ఉంచెదను యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. '' అవును, ప్రభువు మీ స్వాస్థ్యభాగముగా మారినప్పుడు మీరు ఆయనలో మీ ఆనందాన్ని కనుగొనబోతున్నారు. రెండవదిగా, ఆయన మన బహుమానము. ఆ బహుమానము పొందాలంటే, " పందెపు రంగమందు పరుగెత్తువారందరు పరుగెత్తుదురుగాని యొక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలె మీరు బహుమానము పొందునట్లుగా పరుగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడనివానివలె పరుగెత్తువాడను కాను, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలగగొట్టి, దానిని లోపరచుకొనుచున్నాను '' (1 కొరింథీయులకు 9:24-27) అని వాక్యము స్పష్టముగా తెలియజేయుచున్నది. మనం యేసు కోసం జీవిస్తున్నప్పుడు, ఆయనే మన బహుమతి, మన నీతి కిరీటం. కాబట్టి, ఆనందంగా ఉండండి.
మూడవదిగా, బైబిల్‌లో ఆనందంను గురించి మాట్లాడుతుంది. దావీదు, " ప్రభువా, నీవే నా సంతోషం '' అని చెప్పాడు. మత్తయి 12:18లో దేవుడు ఇలా అంటున్నాడు, " ఇదిగో ఈయన నా సేవకుడు ఈయనను నేను ఏర్పరచుకొంటిని ఈయన నా ప్రాణమున కిష్టుడైన నా ప్రియుడు ఈయన మీద నా ఆత్మ నుంచెదను ఈయన అన్యజనులకు న్యాయవిధిని ప్రచురము చేయును.'' అవును, నా ప్రియులారా, దేవుడు నేడు ఈ సందేశము చదువుచున్న మీతో అదే చెప్పుచున్నాడు. కాబట్టి, ' మీరు, ఆయన ఆనందం; మీరు, ఆయన సంతోషం. ' అందుకే, మనము ' ప్రభువా, నీవే నా ఆనందం మరియు నీవే నా సమస్తము ' అని చెప్పగలుగుచున్నాము. దావీదు కూడా, ' నా కుటుంబం కూడా నీకంటే చిన్నది ప్రభువా అని అన్నాడు. ' మనం కూడా, ' ప్రభువా, నా సమయాన్ని కుటుంబంతో గడపడం కంటే, నేను నీతో ఉండటానికి ఇష్టపడుచున్నాను. ఎందుకంటే, నువ్వు నా ఆనందం' అని దేవునితో చెప్పవలెను. చివరగా, దావీదు,' నీవే నా భాగము' అని అన్నాడు. ఎఫెసీయులకు 5:30లో బైబిల్ ఇలా చెబుతోంది, " మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై యున్నాము గనుక అలాగే క్రీస్తు కూడ సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు '' అన్న వచనము ప్రకారము మనం యేసు శరీరానికి, మరియు ఎముకలకు సంబంధించిన అవయవాలుగా ఉన్నాము. అవును, ప్రియ స్నేహితులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు దేవునికి చెందినవారు. ఆయన జీవం మీ శరీరంలోకి ప్రవహిస్తుంది మరియు మీరు దేవుని మహిమతో అనుసంధానించబడియున్నారు. అంతమాత్రమే కాదు, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు గొప్పగా ఆశీర్వదించబడ్డారు. ఈ ఆశీర్వాదం కోసం దేవుని స్తుతించండి. దేవుడు మిమ్మును దీవించును గాక.
Prayer:
కృపాకనికరము కలిగిన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ,

నిన్ను స్తుతించుటకు నీవు మాకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వందనములు. ప్రభువా, నీవే మా స్వాస్థ్యభాగముగా ఉన్నందుకై నీకు వందనాలు. దేవా, ఎటువంటి స్థితిలో కూడ మేము దావీదు వలె నిన్ను మా స్వాస్థ్యభాగముగాను మరియు పానీయభాగముగాను, మా భాగముగాను ఉంచుకొనుటకు మాకు అటువంటి గొప్ప ధన్యతను దయచేయుము. ప్రభువా, నీవే మా ఆనందంగాను, సంతోషంగాను ఉండునట్లుగా మాకు అటువంటి హృదయమును దయచేయుము. యేసయ్యా, నీ శరీరమునకు అవయవములమై మేము ఉండునట్లుగా మమ్మల్ని మార్చుము. దేవా, మా పందెపు రంగమందు పరుగెత్తునట్లుగాను, ఆ పందెములో మేము బహుమానము పొందునట్లుగా మమ్మల్ని మార్చుము. మరియు మాకు కావలసిన బలమును శక్తిని దయచేయుమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000