Loading...

మీ పట్ల సంతోషించే దేవుడు!

Shilpa Dhinakaran
14 May
నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీతో కూడ దేవుడు ఆనందించాలని ఆయన మీ పట్ల కోరుచున్నాడు. నేడు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం నిర్గమకాండము 33:17 వ వచనమును ఎన్నుకొనబడినది. అదేమనగా, " కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసెదను; నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరునుబట్టి నిన్ను ఎరుగుదునని...చెప్పెను '' అన్న వచనము ప్రకారము నేడు ఈ సందేశము చదువుచున్న మీ పట్ల ఆయన కటాక్షము కలిగియున్నాడు. అంతమాత్రమే కాదు, మీతో కూడ ఆనందించుచున్నాడు. ఇది ఎంత చక్కటి వాగ్దానం! ప్రభువు ఇలా అంటున్నాడు, " స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండ తన చంటిపిల్లను మరచునా? వారైన మరచుదురు గాని నేను నిన్ను మరువను '' (యెషయా గ్రంథము 49:15) అన్న వచనము ప్రకారము ఎవ్వరు మిమ్మల్ని మరచినను, ఆయన మిమ్మల్ని మరువడని సెలవిచ్చుచున్నాడు. నేడు ఈ సందేశము చదువుచున్న మీరు ఈ సమయంలో ఒంటరితనంతో బాధపడుతుండవచ్చును, మీ కుటుంబంలో అపార్థాలు ఉండవచ్చును మరియు మీరు మీ తల్లిదండ్రుల నుండి దూరంగా ఉండవచ్చును, లేదా మీరు మీ జీవిత భాగస్వామికి దూరంగా ఉండవచ్చును, కానీ ప్రభువు ఇలా అంటున్నాడు, " నా ప్రియ బిడ్డా, నేను మిమ్మల్ని ప్రేమించుచున్నాను, నీ పేరును నేను ఎరిగియున్నాను '' అని సెలవిచ్చుచున్నాడు. కాబట్టి, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు ధైర్యంగా ఉండండి. మీరు పేరు దేవునికి తెలుసు. కాబట్టి, ఎన్నడు ఆయన మిమ్మల్ని మరచిపోడు.

నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీకు ఏవైనా కొరతలున్నప్పటికిని, దేవుడు మీ పట్ల జాగ్రత్త వహిస్తాడు మరియు మిమ్మల్ని ఘనపరుస్తాడు. అందుకే బైబిలేమంటుందో చూడండి, " నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుష్యులను అప్పగించుచున్నాను నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను '' (యెషయా గ్రంథము 43:4) అన్న వచనము ప్రకారము మీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగిస్తాడు. నేడు ఈ సందేశము చదువుచున్న మీరు దేవుని దృష్టిలో ఎంతో విలువైనవారుగా ఉన్నారు. కాబట్టి, ఆయన మిమ్మల్ని చూచి, " నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి, మీ ప్రాణానికి ప్రతిగా జనములను ఇస్తాను '' అని సెలవిచ్చుచున్నాడు. ఎందుకంటే, ప్రభువు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. దాని అర్థం ఏమిటి? దేవుడు ఇతరుల కొరకు దాచియుంచిన మేలులను మీకు ఇస్తాడు మరియు ఇతరుల ద్వారా వచ్చే కీడు నుండి మిమ్మల్ని రక్షిస్తాడు. కాబట్టి ఈ లోకంలో మీ కోసం ఎవరూ లేరని తలంచకండి. ఒంటరిగా ఉన్నారని చింతించకండి. మీ మొరను వినడానికి ఎవరూ లేరని దిగులుపడకండి, మీ కన్నీళ్లను చూడటానికి ఎవరూ లేరని తలంచకండి. ఈ సందేశము చదువుచున్న మీరు మమ్మును ఎవ్వరు గుర్తుపట్టలేదు, ఎవ్వరు పట్టించుకోవటము లేదని, ఈ లోకములో మేము జీవించేది వ్యర్ధమని తలంచుచున్నారా? మిమ్మును గుర్తెరుగుటకు పరలోకములో ఒక దేవుడున్నాడని మరువకండి. ఆయనకు మీ పేరు తెలుసు, మీ పేరుతో పాటు మిమ్మును గూర్చిన చరిత్ర అంతా తెలుసు
నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు మీ ప్రియులైన వారిని కోల్పోయి ఉండవచ్చును మరియు ఆ ఒంటరితనం మీ హృదయాన్ని దు ఃఖముతో నింపియుండవచ్చును. కానీ, ప్రభువు " నేను మీతో ఉన్నాను, మీరు చింతించకండి '' అని అంటున్నాడు. అవును, యెషయా 41:10 లో ఆయన ఇచ్చిన వాగ్దానం ఇలా చెబుతోంది, " నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక యేర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పియున్నాను నీకు తోడైయున్నాను భయపడకుము నేను నీ దేవుడనై యున్నాను దిగులుపడకుము నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడను నేనే నీతియను నా దక్షిణహస్తముతో నిన్ను ఆదుకొందును '' అన్న వచనము ప్రకారము దేవుడు మీతో కూడ ఉన్నాడని వాగ్దానము చేయుచున్నాడు. ఎందుకంటే, ఆయన మీకు దేవుడై యున్నాడు. అంతమాత్రమే కాదు, ఆయన ఎల్లప్పుడు మీతో కూడ ఉంటాడు. ఆయన నేడు ఈ సందేశము చదువుచున్న మీ నుండి ఎన్నటికిని తొలిగిపోడు. అందుకే బైబిలేమంటుందో చూడండి, " నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడను ఉన్నావు నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు '' (కీర్తనల గ్రంథము 139:8) అన్న వచనము ప్రకారము మీరు ఎక్కడ ఉన్నను సరే, ఆయన మీతో కూడ అక్కడ ఉంటాడు. అవును, మీరు ఎక్కడ ఉన్నా దేవుని సన్నిధి మీతో కూడ ఉంటుంది మరియు ఆయన మిమ్మల్ని ఓదార్చి మీకు ఆనందాన్ని ఇస్తాడు. మీరు దుఃఖమును పొందుకొనే ప్రతి పరిస్థితులను ఆనందంగా మారుస్తాడు. కాబట్టి, ధైర్యంగా ఉండండి. నేడు ఈ సందేశము చదువుచున్న మీ పేరును ఆయన గుర్తెరగాలంటే, మీరు ఆయనను ఎంతో జాగ్రత్తగా వెదకినట్లయితే, నిశ్చయముగా, మీ పేరును ఎరిగిన ఆయన మీ పట్ల గొప్ప అద్భుత కార్యాలను జరిగిస్తాడు.
Prayer:
ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రీ,

నీవు మా పేరును తెలిసికొని మమ్మును నీ బిడ్డలుగా మార్చుచున్నందుకు నీకు స్తుతి స్తోత్రములు చెల్లించుచున్నాము. దేవా, మేము నేటి నుండి ఎల్లవేళలా నిన్నే హత్తుకొని స్థిరంగా జీవించునట్లు మాకు అట్టి కృపను దయచేయుము. ప్రభువా, నీ దృష్టిలో మేము విలువైనవారమైనందులకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. దేవా, మా ఒంటరితనం మరియు నిరాశ నుండి బయటపడటానికి మాకు సహాయం చేయుము. ఈనాటి నుండి నీ సన్నిధితో మమ్మల్ని నింపుము. దేవా, నీవు మా మీద కటాక్షమును చూపినందుకై నీకు వందనములు చెల్లించుచున్నాము. ప్రభువా, మా దుఃఖాన్ని సంతోషంగా మార్చుము. మా జీవితములో ఉన్న ప్రతి భాగమును నీ సన్నిధితో మరియు నీ ఆత్మతోను నింపుము. ఈ లోకములో మా కష్టాలను ఎవ్వరు తీర్చలేరు, నీవు తప్పకుండా, మా కష్టాలను బాధలను తొలగించి మాకు సంతోషం కలిగిస్తావని మేము నమ్ముచున్నాము. దేవా, మేము నీలో స్ధిరంగా జీవించునట్లు, నీ యందు విశ్వాసము కలిగి జీవించునట్లు మాకు అట్టి హృదయమును అనుగ్రహించుము. మోషేను ఆశీర్వదించినట్లుగా, నీవు మమ్మును పేరుపెట్టి పిలిచి ఆశీర్వదించుము, ఈ లోకములో నీ ముఖ కాంతిని పొందుకొనుటకు నిన్ను మా పూర్ణ హృదయముతో వెదకునట్లు మాకు సహాయము చేయుమని యేసు ప్రభువు సాటిలేని నామములో ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000