Loading...
Stella dhinakaran

మీరు నమ్మిన యెడల మీ ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు!

Sis. Stella Dhinakaran
03 Dec
నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీ ప్రార్థనలకు జవాబును అనుగ్రహించుటకు దేవుడు మీ పట్ల సిద్ధముగా ఉన్నాడు. అవును, ప్రభువు మన ప్రార్థనలను మరియు విన్నపములను వినుచున్నాడు. వివిధ రకములైన అవసరాలు మరియు ఆలోచనల వలన మీలో అనేకమంది అలసిపోయి, బాధపడుచుండవచ్చును. ఈ స్థితిలో మాకు ఎవరు సహాయం చేస్తారు? మా జీవితంలో మార్పుకు ఏదైనా అవకాశం ఉందా? మా ఉద్యోగ స్థలములో మాకు న్యాయం జరుగుతుందా? మేము కోరిన స్వస్థత మాకు లభిస్తుందా? మా అవసరాలు నెరవేరుతాయా? మా కోరికలు తీరుతాయా? అని తలంచవచ్చును. - ఇవి మీ మనస్సును ఇబ్బంది పెట్టే కొన్ని ప్రశ్నలు కావచ్చును. అయినప్పటికిని, " నా సంచారములను నీవు లెక్కించి యున్నావు. నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి యున్నవి అవి నీ కవిలెలో కనబడును గదా '' (కీర్తనలు 56:8) అన్న వచనము ప్రకారము మీ సంచారాలను లెక్కించే మరియు మీ కన్నీళ్లను గుర్తించే ప్రేమగల ప్రభువు ఉన్నాడని మీరు మరువకోండి. కాబట్టి, దేని నిమిత్తము మీరు దిగులుపడకండి. సమస్తమును దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థించండి. దేవుడు మీ ప్రార్థనకు జవాబును దయచేసి, తప్పకుండా మీకు న్యాయమును జరిగిస్తాడు.

అవిధేయుడైన తన చిన్న కొడుకును గురించి ఎంతగానో బాధపడే ఒక తల్లి ఉండేది. ఒకరోజు, ఆమెను కూడా లెక్క చేయకుండా, ఆ కొడుకు ఆమెను ఎంతో బాధపెట్టి, తన ఇంటి నుండి పారిపోయాడు. ఆమె భర్త కూడా కుటుంబ విషయాలపై ఎంతో హృదయ ఉదాసీనంగా ఉండే కఠినమైన మనసు గల ఒక వ్యక్తి. తరువాత ఏమి చేయాలో తెలియక,ఈ తల్లి కన్నీళ్లు విడుచుటకు ప్రారంభించింది. ఆమె చదవడానికి బైబిల్‌ను తెరిచినది. అప్పుడు, ఆమె దృష్టి , " మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు వేటిని అడుగుదురో అవి (దొరకినవని) నమ్మిన యెడల మీరు వాటినన్నిటిని పొందుదురు... '' (మత్తయి 21:22) అన్న వచనము మీద పడినది. ఆ వచనము ద్వారా ఒక నూతన విశ్వాసం ఆమెలో కలిగినది. వెంటనే ఆమె, ' ప్రభువా, నీవే నిజమైన మరియు జీవముగల దేవుడవు. నా వేదన నీకు మరుగైనది కాదని నేను నమ్ముతున్నాను. నీవు నా కొడుకు యొక్క కఠినమైన హృదయాన్ని, అలాగే నా భర్త యొక్క ఉదాసీన హృదయాన్ని మార్చడం నీకు అసాధ్యమైనది కాదు. ఎన్నటికి మారని నిరంతరమైన నీ యొక్క వాగ్దానాన్ని నేను గట్టిగా పట్టుకొని ప్రార్థించుచున్నాను. నీవు నా పట్ల గొప్ప కార్యములు చేసినందుకు నేను నిన్ను స్తుతించుచున్నాను. ఈ రోజు నీ నుండి నేను ఒక గొప్ప అద్భుతాన్ని ఆశిస్తున్నాను అని ప్రార్థించినది.' ఒకసారిగా, ఆమె హృదయం మానవ ఊహాకు అందనంతగా శాంతితో నిండిపోయినది. ఆమె దేవునిపై విశ్వాసం ఉంచినందున, ఆమె చింతలు అదృశ్యమైపోయినవి. ఓహ్! ఎంత అద్భుతం! కొద్ది రోజులలోనే ఆమె కుమారుడు ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ కుమారుడు తన తల్లి యొక్క నిజమైన ప్రేమను గ్రహించాడు. అంతమాత్రమే కాదు, అతడు దేవుని బిడ్డగా మారడం ద్వారా తన తల్లిని సంతోషపెట్టాడు మరియు అతడు దేవుని పరిచర్య చేయుటకు ప్రారంభించాడు.
నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు కూడ దేవుని వాగ్దానాన్ని మీ సొంతం చేసుకోండి. ఈనాడు మీ భారాలన్నింటిని దేవుని సన్నిధిలో ఉంచండి. నిశ్చయంగా, మీ ప్రార్థనలు ఆయన సన్నిధిలో వినబడతాయి. తద్వారా, మీరు మీ జీవితంలో అద్భుతాలను చూస్తారు. మీ విశ్వాసం వృద్ధిపొందుతుంది. నిశ్శయముగా, మీ ఆశ భంగము కానేరదు. మీ ప్రార్థనలను ఆలకించి, మీ పట్ల అద్భుతాలు జరిగించే దేవునిని నమ్మండి. ఎందుకంటే, ఆయన ప్రేమపూర్వకమైన బహుమతులు మీ కోసం వేచి ఉన్నాయి. మీ జీవితంలో దేవుడు తన కాలంలో అది చక్కగా ఉండునట్లు ప్రతిదానిని మీ పట్ల జరిగిస్తాడు. ఈనాడే, దేవుని సన్నిధిలో ఈ సందేశము చదువుచున్న మీ ప్రార్థన విన్నపముల కొరకు మీరు పట్టుదలతో ప్రార్థించి, వాటిని పొందుకొన్నారని నమ్మినట్లయితే, నిశ్చయముగా, దేవుడు మీకు వాటన్నిటిని అనుగ్రహించి, మీరు ఆనందించునట్లు చేసి, మిమ్మల్ని దీవించును గాక.
Prayer:
ప్రార్థనలు ఆలకించువాడా, సర్వశక్తిగల మా ప్రియ పరలోకపు తండ్రీ,

నీవు మా ప్రార్థనలను వినుచున్నావని మేము విశ్వసించుచున్నాము. ఈ లోక విషయాలు మాకు చెప్పలేని బాధలు మరియు ఎనలేని సమస్యలను కలిగిస్తాయి. మా భారాలు మరియు చింతల మధ్య, మేము నిన్ను మాత్రమే నమ్ముతున్నాము. నీవు మా జీవితములో అద్భుతాలు జరిగిస్తావని నమ్ముటకు మాలో నీ బలమైన విశ్వాసమును దయచేయుము. మేము నీ వాగ్దానాలకు లోబడి, వాటి యందు నమ్మిక యుంచియున్నాము. నీవు మా కోసం భారాన్ని మోస్తున్నావనియు మరియు మా కష్టాలు మరియు భారాల నుండి మమ్మల్ని విడిపిస్తావనియు మాకు తెలుసు. దేవా మాకు అవగింజంత విశ్వాసమును అనుగ్రహించుము. మేము ఎల్లప్పుడు నీలో విశ్వాసము కలిగి జీవించునట్లు మాకు సహాయము చేయుము. మాలో ఉన్న వ్యాధులు, సమస్యల నుండి విడిపించి, మాకు అద్భుతములు చేయుమని అద్భుతాలు చేసే యేసయ్యా నిన్ను బ్రతిమాలుకొను చున్నాము. ఈ లోకాన్ని జయించే విశ్వాసాన్ని మాకు దయచేయుము. నేడు మేము నీ సన్నిధిలో మొఱ్ఱపెట్టే ప్రతి ప్రార్థన విన్నపములకు జవాబును దయచేస్తావని మేము నమ్ముచున్నాము. నీ యందు మాలో ఉన్న విశ్వాసాన్ని అభివృద్ధిపరచుము. మా ప్రార్థన విన్నపముల నిమిత్తము ఈ దినము నిన్ను గట్టిగా పట్టుకొని, నీ యందు మాత్రమే విశ్వాసముంచుటకు కావలసిన అటువంటి కృపను మాకు దయచేయుమని ప్రభువైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామములో ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000