Loading...
Stella dhinakaran

మీరు దేవుని చిత్తమేదో గ్రహించి ఆలాగున నడుచుకొనండి!

Sis. Stella Dhinakaran
21 Jan
నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు ఈనాడు అనేక శ్రమలకు గురవుచు, చింతించుచుండవచ్చును. అయితే, మీ చింతలన్నిటికి ఒక విడుదల ఉన్నదని గుర్తెరిగి, ప్రభువు యొద్దకు రండి, మీరు దేవుని చిత్తమేదో తెలుసుకోవాలని వాక్యము మనకు స్పష్టముగా తెలియజేయుచున్నది. ‘‘ మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి ’’ (రోమా 12:2) అన్న వచనము ప్రకారము మనము సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి, తెలిసికొని జీవించుటకును మరియు సమాధానము, ప్రేమ, ఆనందము, జ్ఞాన వివేకములు మరియు సమృద్ధికరమైన జీవితమును తెలుసుకొని నడుచుకొనుటకు ఏకైక మార్గము అని మనము బైబిల్లో చదువుచున్నాము. బైబిల్లో పాతనిబంధన గ్రంథములో భక్తుడైన యోనాను గూర్చి చదివినట్లయితే, యోనా ఒక దైవభక్తి కలిగిన ఒక ప్రవక్తయును మరియు ఒక దైవసేవకుడై యుండెను. దేవుడు అతనితో మాటలాడి, అతనికి ఒక కార్యమును నెరవేర్చుమని ఆజ్ఞాపించెను. కానీ, యోనా దానిని తిరస్కరించెను. తద్వారా, అతను ఎన్నో శోధనలను ఎదుర్కొనవలసి వచ్చెను. త్వరితముగా అతను తన శోధనలకు కారణము, దేవుని యొక్క ఆజ్ఞను తిరస్కరించుట అని గ్రహించెను. తరువాత, దేవుని కృప ద్వారా, అతను దేవుని మార్గానికి తిరిగి వచ్చాడు. కానీ, అతను తన మార్గమును మరల్చుకొని చివరకు దేవుని చిత్తమును నెరవేర్చెనని మనము పరిశుద్ధ గ్రంథములో చదివియున్నాము. 

ఒక యౌవనస్థుడు తన జీవితమును దేవునికి అంకితము చేసుకొని తన మార్గములను నీతియుక్తముగా నడుచుకొనుచు ఉండెను. అతని తల్లిదండ్రులు అతని కొరకు ఉపవాసముతో ప్రార్థించి, చక్కటి దైవభక్తి కలిగిన అమ్మాయిని అతని యొక్క జీవిత భాగస్వామిగా నిశ్చయించుటకు చూసితిమని అతనికి తెలియజేసిరి. కానీ, అతను ‘‘ నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆమెనే వివాహము చేసుకొనెదను ’’ అని పలికెను. అతని పట్టుదల వలన అతని తల్లిదండ్రులు ఆ వివాహమునకు అంగీకరించిరి. వివాహము జరిగిన తరువాత వారి యొక్క వివాహ జీవితము ఎంతో ఆనందముగా ఒక నెల రోజులు మాత్రమే గడిచిపోయినది. అటు తరువాత, ఆమె అతని పరిచర్య కార్యములలో పాల్గొనుటకు ఇష్టపడక, తన స్వంత మార్గములను అనుసరించవలెనని ఆశించినది. ఆమె అతనితో, ‘‘ నన్ను నా మార్గములో పోనీయ్యి, నీకు ఇష్టము వచ్చిన మార్గములలో నీవు పో, ’’ అని చెప్పింది. ఆమె మాటలు మరియు చేతలు అతనిని పూర్తిగా క్రుంగదీసెను. ఆమె అతని నుండి విడాకులు పొంది, ఆమె ప్రేమించిన వేరొకతనిని వివాహమాడి, అతనితో కూడ వెళ్లిపోయినది. అది అతనిని ఎంతో క్రుంగదీసెను. అటుతరువాత ప్రభువు అతని మార్గములను సరాళము చేసి, అతని తల్లిదండ్రులు చూచిన అదే స్త్రీని వివాహమాడుటకు సహాయము చేసి, వారి జీవితములను ఆనందభరితముగా మార్చెను. 
నేడు నా ప్రియులారా,ఈ సందేశము చదువుచున్న మీ నిర్ణయాలన్నిటిని దేవుని చిత్తానికి అనుగుణంగా ఉన్నాయా? అని పరీక్షించి చూడండి. నేడు ఈ సందేశము చదువుచున్న మిమ్మల్ని దేవుని వాక్యం ఇలా హెచ్చరిస్తుంది, ‘‘ ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి ’’ (ఎఫెసీయులకు 5:17) అన్న వచనము ప్రకారము ప్రభువుపై ఆధారపడండి. ‘‘ ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును ’’ (కీర్తనలు 37:23) అన్న వచనము ప్రకారము మీ హృదయాన్ని తన యొక్క కోరికలతో నింపమని దేవుడిని అడగండి. ఆయన మిమ్మల్ని నింపుతాడు మరియు మీ పట్ల సమస్తాన్ని పరిపూర్ణం చేస్తాడు. ప్రార్థనలో పట్టుదలగా ఉండండి, మీ జీవితంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చండి మరియు సమృద్ధిగా ఆశీర్వదించబడండి. మీరు తప్పు నిర్ణయాలు తీసుకున్నప్పటికిని, ఆయన వద్దకు తిరిగి రండి. ఆయన మిమ్మల్ని కౌగలించుకొనడానికి మరియు మిమ్మల్ని ఉన్నత స్థానమునకు హెచ్చించడానికి మీ కొరకు వేచి ఉన్న ప్రేమగల తండ్రి, మీరు కూడ ఆయన యొక్క చిత్తమును మీ జీవితములలో నెరవేర్చుచున్న యెడల నిశ్చయముగా ఆయన మిమ్మును అత్యధికముగా ఆశీర్వదించును. 
Prayer:
పరలోకమందున్న మా ప్రియ తండ్రీ, 

నీకు ప్రీతికరముగాను మరియు సంతోషకరముగా నుండునట్లుగా మేము నీతి మార్గములను అనుసరించుటకు మాకు అటువంటి కృపను దయచేయుము. నీ చిత్తమును మా జీవితములో నెరవేర్చు భాగ్యమును మాకు దయచేయుము. మేము ఇతరులపై ఆధారపడకుండా, ఎల్లప్పుడు నీపై ఆధారపడి జీవించునట్లు మాకు సహాయము చేయుము. మా సమస్యలన్నిటిని నీ చేతులకు సమర్పించుకొను చున్నాము. యోనా వలె మేము నీ ఆజ్ఞలను తిరస్కరించినట్లయితే, ఈనాడే మా తప్పిదములను నీ యందు ఒప్పుకొని విడిచిపెట్టి, నీవు మాకు చూపిన మార్గములో మేము నీ చిత్త ప్రకారము నడుచుటకు మాకు సహాయము చేయుమని వేడుకొనుచున్నాము. మేము నీ చిత్తమేదో తెలుసుకొని, దాని ప్రకారము నడుచుకొని, నీ చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలనుగా మమ్మల్ని మార్చుము. మా హృదయములో నీ కోరికలను మరియు చిత్తాన్ని నింపుమని కోరుచున్నాము. నేడు మేము నీ చిత్తాన్ని తెలుసుకొని దాని ప్రకారము నడుచుకొనే గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించుమని ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్. 

For Prayer Help (24x7) - 044 45 999 000