Loading...
Dr. Paul Dhinakaran

మీరు ఉచితముగా పొందిన దానిని ఉచితముగా ఇయ్యుడి!

Dr. Paul Dhinakaran
05 Jul
నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు ఉచితముగా పొందిన దానిని ఉచితముగా ఇవ్వాలని దేవుడు మీ పట్ల కోరుచున్నాడు. నేటి దినములలో మీరు మార్కెట్లలో చూచినట్లయితే, ఉత్పత్తులను అమ్ముటకు " ఒకటి కొంటె ఒకటి ఉచితము ''అని క్రొత్త పద్ధతులు వచ్చినవి. ఏదైన ఉచితముగా దొరుకుతుందని ప్రకటనలను చూడగానే, ప్రతి ఒక్కరు ఆనందిస్తారు. కానీ, ప్రకటన క్రింద, ఒక చిన్న అక్షరములతో " షరతులు వర్తించును '' అని వ్రాయబడియుండుటను మీరు చూచెదరు. అవును, నా ప్రియ స్నేహితులారా,ఈ లోకములో ఏదియు ఉచితము కాదు. కానీ, మన ప్రభువు మనకు సమస్తమును ఉచితముగా అనేక ఆశీర్వాదాలను అనుగ్రహించియున్నాడు. అది ఏలాగనగా, ఆయన అనుగ్రహించు ఆశీర్వాదాలు ఇతరులకు కూడా ఇవ్వాలని ఆయన ఎక్కువగా మన పట్ల ఆశించుచున్నాడు. దేవుని బిడ్డలైన ప్రతి ఒక్కరు ఇచ్చేవారుగా ఉండాలని ఆయన వారి పట్ల కోరుచున్నాడు. అందుకే బైబిలేమంటుందో చూడండి, " ఔదార్యముగలవారు పుష్టినొందుదురు. నీళ్లు పోయువారికి నీళ్లు పోయబడును '' (సామెతలు 11:25) అన్న వచనము ప్రకారము ఇవ్వడం ఆర్థిక సహాయాన్ని లేక డబ్బును సూచించడమే కాదు, ఇవ్వడం ఏ రూపంలోనైనా ఉండవచ్చును. మీ ప్రియమైన వారికి నిరుత్సాహపడిన సమయం లేదా దుఃఖ సమయములలో కూడ వారికి ప్రోత్సాహకరమైన మాటలను ఇవ్వవచ్చును. మీరు ఇవ్వడం ద్వారా గొప్ప బహుమతులను పొందుకుంటారు. కొన్నిసార్లు మనం ఇతరులకు చేసిన వాటిని లెక్కించకుండా, ఎదుటివారు మనకు ఎంత సహాయము చేశారో అని లెక్కించకుండా, తదనుగుణంగా, వారు దానికి తగినట్లుగా వారికి ఇవ్వడము కాకుండా, నిజమైన ప్రేమ లెక్కలు వేయకుండా మంచి కార్యములను జరిగించుటకు సహాయపడుతుంది. ఇచ్చుకొనుట మరియు పుచ్చుకొనుట అనే సూత్రాన్ని కూడా దేవుడు మనకు బోధించుచున్నాడు. ఇవ్వడము అనే మంచి అలవాటును మనము కలిగి ఉండాలని దేవుడు మన పట్ల ఎదురు చూస్తున్నాడు. అందుకే ఆయన ఇలా చెబుతున్నాడు, " ఇయ్యుడి, అప్పుడు మీకియ్యబడును; అణచి, కుదిలించి, దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరల కొలువబడునని చెప్పెను '' (లూకా 6:38) అన్న వచనము ప్రకారము మీరు ఏది ఇచ్చినా, అవి మీకు తిరిగి వస్తాయని నమ్మండి.

ఒక పేద స్త్రీ కుమార్తె అనారోగ్యముతో ఉన్నది. కనుక ఆమె తన కుమార్తెను ద్రాక్షాపండ్లు ఇచ్చి, చికిత్స చేయాలని ఆశించింది. ఆమె ద్రాక్షాపండ్ల కొరకు వెదకినప్పుడు ఆమె వాటిని రాజుగారి ఇంటిలో కనుగొనినది. ఆమె వద్ద ఉన్న కొన్ని నాణెములతో కొన్ని ద్రాక్షాపండ్లను ఇవ్వమని తోటమాలిని అడిగింది. అప్పుడు ఆ తోటమాలి, రాజుగారి కుమార్తెతో మాటలాడమని చెప్పాడు. ఆమె వెళ్లి యువరాణిని అడుగగా ఆమెకు ఒక బుట్ట నిండ ద్రాక్ష పళ్లను ఇచ్చింది. దానితో ఆ పేద స్త్రీ తన వద్ద ఉన్న నాణెములను ఇచ్చింది. కానీ, రాజుగారి కుమార్తె, వాటిని తీసుకొనుటకు నిరాకరించి, తన తండ్రి వ్యాపారస్థుడు కాడని చెప్పి, ఆ నాణెములను ఆమెనే ఉంచుకొనుమని చెప్పింది.
నా ప్రియులారా, అవును, మన పరలోకపు తండ్రి కూడా ఒక గొప్ప రాజు. కాబట్టి ఆయన మనకు అవసరమైనది ఏదైనా ఆయన నుండి తిరిగి ఇస్తాడు. ఆయన మన ముందు ఉన్న ఏకైక ప్రమాణం, మనం ఆయనకు ఉచితంగా ఇవ్వాలి అనే భావనతో యువరాణులముగా ప్రవర్తించాలని కోరుచున్నాడు. ఈ సందర్భంలో యేసు చెప్పిన మాట, " రోగులను స్వస్థపరచుడి, చనిపోయినవారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులనుగా చేయుడి, దయ్యములను వెళ్లగొట్టుడి. ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయ్యుడి '' (మత్తయి సువార్త 10:8) అన్న వచనము ప్రకారము ప్రభువు మనకు అనేక విషయములను ఉచితముగా అనుగ్రహించాడు మరియు వాటిని మనము ఇతరులతో కూడ ఉచితముగా పంచుకోవాలి. ప్రతి దేవుని బిడ్డ, ఇచ్చువారుగా ఉండవలెను. ఇతరులను ఉత్సాహపరచువారు ఉత్సాహము నొందుదురు. ఇవ్వడం అంటె ఆర్థికముగా సహాయము చేయడం మాత్రమే కాదు. మీరు మీ ప్రియమైన వారితో కొంత సమయమును గడపవలెను. నిరుత్సాహముతో ఉన్నవారికి ప్రోత్సాహకరమైన మాటలను అందించవచ్చును. మన డబ్బును, మన ప్రేమను, మన సమయాన్ని ఇవ్వడం ద్వారా ఇతరులకు ఉచితముగా సేవ చేయాలి. దేవుడు ఎవరి యొద్ద తిరిగి తీసుకోడు. ఎవరైనా తన పనిని ప్రభువు కోసం ఇచ్చినప్పుడు, దేవుడు దానిని పొంగిపొర్లునట్లుగా తిరిగి ఇస్తాడు. దేవునికి మనము ఇచ్చినప్పుడు, ఆయన మనకు ఏలాగున ఇస్తాడో చూడండి, " నా మందిరములో ఆహారముండునట్లు పదియవభాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసికొనిరండి; దీని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి, పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు '' (మలాకీ 3:10) అన్న వచనము ప్రకారము మనము ఇవ్వడంలో దేవుడిని పరీక్షించగల ఏకైక మార్గం. దేవుడు తన పరీక్షలో ఎప్పుడైనా విఫలమవుతాడా? ఎప్పుడు కాడు. కాబట్టి మీరు ఉదారంగా ఇవ్వండి మరియు ప్రభువు నుండి ఎక్కువ పొందుకొనండి. కాబట్టి, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు ఎక్కువగా దేవుని యొద్ద నుండి పొందుకొనవలెననగా, మీకు కలిగినదానిని ఉచితముగా అది డబ్బుయైనను, సమయమైనను సరే ఇతరులకు మరియు దేవునికి ఇచ్చినట్లయితే, నిశ్చయముగా, ఆయన మీకు ఆకాశపు వాకిండ్లను విప్పి, పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరిస్తాడు. 
Prayer:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ,
 
ప్రియ ప్రభువా, ఈ వాక్యము ద్వారా ఈనాడు నీవు మాతో మాటలాడిన విధానమును బట్టి నీకు స్తోత్రములు చెల్లించుచున్నాము. మమ్మల్ని నీ యొక్క పరిశుద్ధాత్మతో నింపి, మేము ఉచితముగా పొందిన సువార్తను విస్తరింపజేయుటకు మాకు సహాయము చేయుము. మమ్మల్ని మేము నీ సేవకై సిద్ధపరచుకొని, ఇతరులను సిద్ధపరచుటకు మాకు సహాయము చేయుము. దేవా, మేము నీ సేవకు దశమభాగమును ఇచ్చుటకు మాకు సహాయము చేయుము. దేవా, నీవు మాకు ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా తిరిగి మాకు దయచేస్తావని మేము నమ్ముచున్నాము. ప్రభువా, మేము ఉచితముగా పొందిన దానిని తిరిగి ఇతరులకు ఉచితముగా ఇచ్చుటకు మాకు నీ కృపను దయచేయుము. నీవు మా యొద్ద ఎలాగున తిరిగి పొందుటకు ఎదురు చూడకుండా ఉన్నట్లుగా మేము ఇచ్చిన వారి యొద్ద ఉండులాగున మాకు అట్టి హృదయమును దయచేయుము. నిరుత్సాహములో ఉన్నవారితో ప్రోత్సాహకరమైన మాటలు మాట్లాడునట్లుగా మాకు అటువంటి మంచి మనస్సును దయచేయుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000