Loading...
Evangeline Paul Dhinakaran

మీరు దేవుని స్నేహితులు!

Sis. Evangeline Paul Dhinakaran
17 May
నా ప్రియ స్నేహితులారా, ఈ ప్రత్యేకమైన దినమున దేవుని వాక్యాన్ని మీ ముందుకు తీసుకురావడం నాకు చాలా ఆనందంగా ఉన్నది. ఇది బైబిల్ నుండి కీర్తనల గ్రంథము 25:14 వ వచనమును మీకు వాగ్దానముగా ఇవ్వబడియున్నది. అదేమనగా, " యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులుగల వారికి తెలిసియున్నది, ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును '' అన్న వచనము ప్రకారము దేవుని యందు భయభక్తులు గలవారికి ఆయన మర్మములను తెలియజేస్తాడు. నేడు ఈ సందేశము చదువుచున్న మీరు దేవుని మర్మములను తెలుసుకోవాలంటే, ప్రతిరోజు ఉదయం మీరు ఆనందంగా ప్రభువు సన్నిధికి వచ్చినప్పుడు ఆయన తప్పకుండా మీ యొద్దకు వస్తాడు మరియు ఆయన మర్మములను మీకు బయలుపరుస్తాడు. అందుకే బైబిలేమంటుందో చూడండి, " నీ మార్గములనుబట్టి నిన్ను జ్ఞాపకము చేసికొనుచు సంతోషముగా నీతి ననుసరించువారిని నీవు దర్శించుచున్నావు. చిత్తగించుము నీవు కోపపడితివి, మేము పాపులమైతిమి బహుకాలము నుండి పాపములలో పడియున్నాము రక్షణ మాకు కలుగునా? '' (యెషయా గ్రంథము 64:5) అన్న వచనము ప్రకారము సంతోషముగా మీరు నీతి ననుసరించినట్లయితే, ఆయన మిమ్మల్ని దర్శిస్తాడు. మనము దేవుని యెదుట మంచి పనులు చేసినప్పుడు, ఆయన ప్రతి ఉదయం సంతోషంగా మనలను దర్శిస్తాడు. ప్రభువులో మనకు ఉన్న ఆనందం ఇదే!

అందుకే, బైబిల్‌లో చూచినట్లయితే, " తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించినదానిని బయలు పరచకుండ ప్రభువైన యెహోవా యేమియు చేయడు '' (ఆమోసు 3:7) అన్న వచనము ప్రకారము యెహోవా తన ప్రవక్తలకు బయల్పరచకుండా ఏమీ చేయడు. దావీదు ఎల్లప్పుడు ప్రార్థించేవాడు. అతడు ప్రతి దినము సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున దేవుని ధ్యానించుచు మొఱ్ఱపెట్టేవాడు. అతను ఒక ప్రార్థన యోధుడు. అతడు ఒక రోజులో ముమ్మారు ప్రార్థించేవాడు. అందుకే, " నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును '' అని చెప్పాడు. మనము సంతోషంగా ప్రభువు వద్దకు వచ్చినప్పుడు ఆయన మనకు సమస్తమును బయల్పరుస్తాడు. యేసు భూమిపై ఉన్నప్పుడు, దేవుని గురించిన మర్మములను తన సేవకులకు ఒక స్నేహితునివలె బయల్పరుస్తాడు.
అందుకే బైబిలేమంటుందో చూడండి, " దాసుడు తన యజమానుడు చేయుదానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను, ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటిని మీకు తెలియజేసితిని '' (యోహాను సువార్త 15:15) అన్న వచనము ప్రకారము ఆయన మిమ్మల్ని దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాడు. ఎందుకంటే, ఒక దాసునికి తన యజమానుడు చేయునది ఎరుగడు. అయినను, ఆయన మనలను స్నేహితులనుగా పిలుచుచున్నాడు. కారణము, పరలోకపు తండ్రి తనకు ఏమైతే తెలియజేశాడో, ప్రభువు తన మర్మములను మనకు బయలుపరుస్తాడు. ఆలాగున మీకు మర్మములను బయలుపరచవలెనా? మీరు దేవునికి స్నేహితులుగా ఉన్నందున ఆయన మీ పట్ల ఆనందిస్తాడు. అబ్రాహామును కూడా దేవుని స్నేహితునిగా పిలిచాడు. అందుకే బైబిలేమంటుందో చూడండి, " కాబట్టి అబ్రాహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను. మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను '' (యాకోబు 2:23) అన్న వచనమును మనము చదివినట్లయితే, అబ్రాహాము దేవుని నమ్మాడు కాబట్టి, దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెనని వాక్యములో చెప్పబడినట్లుగానే నెరవేరింది మరియు అతన్ని దేవుని స్నేహితుడు అని పిలిచెను. ఆలాగుననే, నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మిమ్మల్ని దేవుడు తన స్నేహితులను పిలుచుచున్నాడు. నేటి నుండి మీరు దేవుని మాట వినడానికి మరియు ఆయనను విశ్వసించటానికి ఆసక్తి కలిగి ఉంటే, ఆయన మీతో ఒక స్నేహితుని వలె మాట్లాడతాడు మరియు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను మీకు తెలియజేస్తాడు. నేడు ఈ సందేశము చదువుచున్న మిమ్మల్ని ప్రవక్తలనుగాను మరియు ప్రవక్తిగాను మారుస్తాడు. ఇంకను ఆయన తన మర్మములను మీకు తెలియజేయుటకు మిమ్మల్ని తన స్నేహితునిగా పిలిచి, మీ పట్ల ఆనందించి, మీ పట్ల గొప్ప కార్యాలు జరిగించి, మిమ్మల్ని పరవశింపజేస్తాడు.
Prayer:
సర్వశక్తిమంతుడవైన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ,

నిన్ను స్తుతించుటకు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వందనములు చెల్లించుచున్నాము. దేవా, మా దోషములను క్షమించి, మమ్మల్ని నీ స్నేహితులుగా పిలుచుచున్నందుకై నీకు వందనములు. యెహోవా, నీ మర్మములను మాకు తెలియజేయుము. ప్రభువా, నీ పరిశుద్ధాత్మ వరములతో,ఫలములతో మమ్మల్ని నింపుము. దేవా, ఈనాటి నుండి మమ్మల్ని నీ స్నేహితునిగా మార్చుము. దేవా, మా జీవితములో నీ మార్గములను అనుసరించి నడుచుకొనుటకు, మా జీవితాన్ని చక్కగా గడపడానికి మేము నేర్చుకోవలసిన సమస్తమును మాకు నేర్పించుము. దేవా, మాకు ఉపదేశము చేసి, మేము నడవవలసిన మార్గమును నీవు మాకు బోధించి, మా మీద నీ దృష్టియుంచి మాకు ఆలోచన తెలియజేయుము. దేవా, అబ్రాహాము వలె మేము నీ యందు నీతిగా జీవించునట్లుగా మాకు సహాయము చేయుము. దేవా, నీవు మా పట్ల ఆనందించునట్లుగా మా జీవితాలను మార్చుకొనుటకు మాకు సహాయము చేయుమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000