Loading...
Dr. Paul Dhinakaran

దేవుని యందు భయభక్తులు కలిగియుండండి!

Dr. Paul Dhinakaran
22 May
నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలని ప్రభువు మీ పట్ల కోరుచున్నాడు. స్వప్నములు కలుగుట మనకు సర్వసాధారణము. కానీ, స్వప్నములు అను మాటకు లోతైన అర్థము ఉన్నదా? అన్న ప్రశ్నకు, అవును అనియు లేక లేదు అనియు కొంతమంది జవాబిస్తారు. మనము అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు, మన లోపల ఉన్న ఆత్మ యొక్క కోరికలు, వాంఛలను బయలుపరచుటయే స్వప్నములు అని వైద్యపరముగా చెప్పబడియున్నది. స్వప్నములలో చూచునవన్నియు నిజమైన జీవితములో జరుగుటలేదు. అందుకే బైబిలేమంటుందో చూడండి, " అధికమైన స్వప్నములును మాటలును నిష్ ప్రయోజనములు; నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి యుండుము '' (ప్రసంగి 5:7) అన్న వచనము ప్రకారము స్వప్నములు నిష్‌ప్రయోజనములు. కానీ, దేవుని యందు భయభక్తులు కలిగియుండాలని మీ పట్ల దేవుడు కోరుచున్నాడు. కావుననే, స్వప్నములును గురించి భయపడకుండా, వాటన్నిటిని ప్రభువు చేతులకు అప్పగించి, ఆయన యందు భయభక్తులు కలిగియుండండి. అప్పుడు దేవుడు మీతో కూడ ఉంటాడు.
 
1969వ సంవత్సరమున నాకు 7 సంవత్సరముల వయస్సులో మా తండ్రి సహోదరులు డి.జి.యస్. దినకరన్ గారికి ఊపిరితిత్తులు పాడైపోయినందున, ఎప్పుడు దగ్గుతూ, రక్తముతో వాంతులు చేసుకొనేవారు. నేను ఎప్పుడు ఆయన ప్రక్కన ఉంటాను. అయితే, అనుదినము రాత్రులలో నా తండ్రి యొక్క శరీరము ఒక శవపెట్టిలో పెట్టినట్లుగా, నేను చదువుకున్న స్కూలులో ఆ పెట్టిని ఉంచినట్లుగాను, అనేకమంది పలురకములైన సంగీత వాయిద్యములతోను చనిపోయిన వారికి తగిన పాటలకు సంగీత వాయిద్యములను వాయించుచున్నట్లుగా నేను స్వప్నమందు చూచేవాడను. ఆకస్మాత్తుగా, నాకు మెళకువ వచ్చుట ద్వారా, ఒక పెద్ద గావు కేకతో కేకలు వేస్తూ, మా తండ్రిగారిని కౌగలించుకొని ఆయనను తడువుకుంటూ ఉంటాను. ప్రతిరోజు స్కూలు నుండి నేను తిరిగి యింటికి వచ్చునప్పుడు, నేను ఇంటి దగ్గర ఎవరైన సంగీత వాయిద్యములు వాయించుచున్నారా? అని ఎంతో భయముతో మా యింటి వైపు చూస్తు యింటికి వెళ్లేవాడను. కొంతమంది సేవకులు మా తండ్రిగారి యొద్దకు వచ్చి, " సహోదరులు దినకరన్‌గారు మీరు మరణ ద్వారమున ఉన్నారు. మీ పరిచర్య ఒక ముగింపునకు వచ్చినది అని చెప్పేవారు. '' ఆ అబద్దపు ప్రవచనములు మా హృదయములను బ్రద్ధలు చేసినవి. అయినను, మా తండ్రిగారు దీర్ఘాయుస్సుతో జీవించి, ప్రపంచమంతటిలోను ఆయన పరిచర్యను విజయవంతముగా కొనసాగించి, ప్రభువు పిలుపును అందుకొని దేవుని నామమును ఘనపరిచారు.
నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీకు కూడ ఇలాంటి స్వప్నములు వచ్చి, ప్రతి రోజు మిమ్మల్ని భయపెట్టుచున్నవా? ఇక మీరు ప్రాణముతో ఉండరు, త్వరగా చనిపోతారు అన్న మాటలు వైద్యుల ద్వారానో లేక మీ బంధువుల యొద్ద నుండియైనా, వచ్చినదా? ఆ మాటలు, మీ నిద్రను పాడు చేయుచున్నదా? " విస్తారమైన పనిపాటుల వలన స్వప్నము పుట్టును, పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును '' (ప్రసంగి 5:3) అన్న వచనము ప్రకారము కొన్నిసార్లు విస్తారమైన పనిపాటుల వలన కూడ స్వప్నము పుట్టును. మానవుల యొద్ద నుండి వచ్చు మాటలు మనలను వేదనకు గురిచేయునవిగాను ఉండవచ్చును. అయితే, దేవుడు, " నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక యేర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పియున్నాను నీకు తోడైయున్నాను భయపడకుము నేను నీ దేవుడనై యున్నాను దిగులుపడకుము నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడను నేనే నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును '' (యెషయా 41:10) అని నమ్మకము కలుగజేయు మాటలను మనకు అనుగ్రహించియున్నాడు. కాబట్టి, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు కూడ దేవునికి భయపడుచున్నట్లయితే, మిగిలినవాటిని గురించి మీరు భయపడనవసరము లేదు. అందుకే బైబిలేమంటుందో చూడండి, " నీ మీదపడు నీ శత్రువులను యెహోవా నీ యెదుట హతమగునట్లు చేయును; వారొక త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చి యేడు త్రోవల నీ యెదుట నుండి పారిపోవుదురు '' (ద్వితీయోపదేశ కాండము 28:7) అన్న వచనము ప్రకారము దేవుని పిల్లలకు ఇది ఒక ఆశీర్వాదము. అంతమాత్రమే కాదు, " చీకటిలో సంచరించు తెగులునకైనను మధ్యాహ్నమందు పాడుచేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును '' (కీర్తనలు 91:6,11) అన్న వచనముల ప్రకారము ఆయన మీకు ఎటువంటి కీడు రాకుండా మిమ్మల్ని కాపాడుతాడు. కాబట్టి, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు చేయవలసిందల్లా, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే, నిశ్చయముగా, మీలో కలుగు చెడు స్వప్నములు, దుర్వార్తలు కూడ మీకు భయము కలిగించవు. అంతమాత్రమే కాదు, ఇప్పుడున్న క్లిష్టమైన పరిస్థితుల నుండి దేవుడు మిమ్మల్ని సురక్షితముగా కాపాడి సంరక్షిస్తాడు.
Prayer:
కృపకు పాత్రుడవైన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ,
 
నిన్ను స్తుతించుటకు నీవు మాకిచ్చిన గొప్ప తరుణమును బట్టి నీకు వందనములు చెల్లించుచున్నాము. దేవా, అనేక పర్యాయములు మాకు చెడు స్వప్నములు కలుగుచున్నవి. నేడు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకై నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. మరణ పడకలో ఉన్న మమ్మల్ని నీ కృప ద్వారా కాపాడి పైకి లేపుము. మా వ్యాధులను ముట్టి మాకు సంపూర్ణ స్వస్థతను దయచేయుము. ఈనాటి నుండి మాకు ఎటువంటి చెడు స్వప్నములు కలుగకుండా, మాకు సుఖమైన నిద్రను దయచేయుము. ఈలోకములో మాకు సంభవించు కీడుకు మేము భయపడకుండా, నీ యందు ఎల్లప్పుడు భయభక్తులు కలిగి జీవించునట్లు మాకు నీ కృపను అనుగ్రహించుము. మేము కను కలలు చెడవైతే, నేడు అవి మా జీవితములో జరుగకుండా మమ్మల్ని నీ రెక్కల నీడతో కప్పుము. మా మనస్సుకు వేదన కలిగించు స్వప్నములు మరియు మాకు విరోధముగా మాట్లాడు ఇతరుల యొక్క మాటలను మా నుండి తొలగించుము. ప్రభువా, మమ్మల్ని హతము చేయుటకు మాకు విరోధముగా లేచు కార్యములను ఏడు త్రోవలలో నుండి పారిపోవునట్లు మాకు సహాయము చేయుమని సమస్త స్తుతి ఘనత మహిమ నీకే చెల్లించుచు యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000