Loading...
Paul Dhinakaran

దేవుని భయంతో కూడిన విశ్వాసము!

Dr. Paul Dhinakaran
13 Jun
నా ప్రియ స్నేహితులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు వర్థిల్లాలని దేవుడు మీ పట్ల కోరుచున్నాడు. అందుకే ఈ రోజు ధ్యాననిమిత్తమైన వాక్యము సామెతల గ్రంథము 28:25 నుండి ఎన్నుకొనబడినది. అదేమనగా, ‘‘ పేరాసగలవాడు కలహమును రేపును యెహోవా యందు నమ్మకముంచువాడు వర్ధిల్లును ’’ అని చెప్పబడియున్నది. యౌవనుడైన యోసేపు మీద శరీరాశతో నిండియున్న పేరాసగల ఒక స్త్రీ ఉండెను. ఫోతీఫర్ తన యింటి మీద విచారణకర్తగా యోసేపును నియమించి తనకు కలిగినదంతయు అతని చేతి కప్పగించెను. యోసేపు రూపవంతుడును సుందరుడునై యుండెను. అటుతరువాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్నువేసి తనతో శయనించుమని చెప్పెను. అయితే అతడు ఒప్పక నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికప్పగించెను గదా, నా వశమున తన యింటిలో ఏమి ఉన్నదో అతడెరుగడు; ఈ యింటిలో నాకంటె పైవాడు ఎవడును లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నా కప్పగింపక యుండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. అందువలన ఆమె అతని మీద అబద్ధపు నింప మోపి, అతనిని చెరసాలలో వేయించినది. కారణము, ఆమె పేరాసగల స్త్రీ. అయితే, యోసేపు ఎంతో విశ్వాసపాత్రుడుగాను మరియు ప్రభువు న్యాయతీర్పుపై నమ్మకమున్నవాడు కాబట్టి, ఐగుప్తు దేశమంతటి మీద అతను నియమించబడెను. దేవుడు ఫరో తర్వాత అధిపతిగా ఉండునట్లుగా యోసేపును హెచ్చించాడు.

అవును, నా ప్రియులారా, ప్రభువుపై నమ్మకం ఉంచిన వ్యక్తి వర్థిల్లుతాడు. వారిని సంతోషపెట్టడానికి మనుషులు ఎన్నో కార్యాలు చేయమని మిమ్మల్ని అడగవచ్చును. కానీ, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు ప్రభువు యందు భయభక్తులు కలిగియున్నప్పుడు దేవుడు మిమ్మల్ని ఘనపరుస్తాడు. ఆదికాండము 22:12 వ వచనములో, దేవుడు అబ్రాహాము జీవితములో కూడ ఇలాగుననే జరిగించాడు. ‘‘ అప్పుడాయన నీకు ఒక్కడైయున్న నీ కుమారుని, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసికొని మోరీయా దేశమునకు వెళ్లి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహనబలిగా అతని అర్పిస్తావా అని చెప్పెను. ’’ అబ్రాహాము పేరాసగలవాడు కాదు. ఎటువంటి సందర్భాలలోనైనను దేవునికి విధేయత చూపడానికి మాత్రమే అతని హృదయం ఆయత్తపరచుకున్నాడు. దేవుడు తాను దేనినైతే బలిగా ఇవ్వమన్నాడో, దానిని ఇచ్చుటకు సిద్ధంగా ఉండెను. ఆలాగుననే, దేవునికి విధేయత చూపడానికి అతను తన ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును కూడ బలిగా ఇవ్వబోతున్నప్పుడు, యెహోవా దూత పరలోకము నుండి ‘‘ అబ్రాహామా అబ్రాహామా అని అతని పిలిచెను; దేవుడు, అబ్రాహామును తన కుమారుని బలిగా అర్పించకుండా చేసెను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము; అతని నేమియు చేయకుము; నీకు ఒక్కడైయున్న నీ కుమారుని నాకియ్య వెనుతీయ లేదు గనుక నీవు దేవునికి భయపడువాడవనియు మరియు నీవు నాకు లోబడుచున్నావని యిందువలన నాకు కనబడుచున్నదని ఇప్పుడు తెలుసు అని చెప్పెను.’’ 
అప్పుడు దేవుడు అబ్రాహామును ఆశీర్వదించి, అభివృద్ధి చెందునట్లు చేశాడు.  మరియు నేడు అతనిని గొప్ప జనముగా మారునట్లు చేసెను. ఇశ్రాయేలీయులకు తండ్రి అని పిలువబడుచుండెను. ఆలాగుననే, ప్రభువు యందు నమ్మకముంచువాడు వర్ధిల్లును. ఈ లోకపు మాటలు వినకపోవడం, అధికారం బెదిరింపులు వినకపోవడం, పేరాసగల స్త్రీలకు, ఈ లోక పురుషులకు లోబడకుండా, దేవునికి విధేయత చూపిస్తూ, నీతివంతముగా నడవడం ద్వారా సమృద్ధిని తీసుకొనిస్తుంది. ‘‘ భయపడుట వలన మనుష్యులకు ఉరి వచ్చును యెహోవా యందు నమ్మిక యుంచువాడు సురక్షితముగా నుండును ’’  (సామెతల గ్రంథము 29:25) అన్న వచనము ప్రకారము యెహోవా యందు నమ్మకముంచువారు సురక్షితముగా ఉంటారని వాక్యము సెలవిచ్చుచున్నాడు. ‘‘ సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్పలాభసాధనమై యున్నది ’’ (1 తిమోతి 6:6) అని బైబిల్‌లో చెప్పబడినట్లుగానే, సమస్త విధమైన దురాశలను విడిచిపెట్టుకొన్నట్లయితే, మన పితరుల వలె నీతివంతమైన జీవితమును జీవించినట్లయితే, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్పలాభసాధనమై యుంటుంది. దేవుడు ఈ కృపను నేడు ఈ సందేశము చదువుచున్న మీకు అనుగ్రహించి మిమ్మల్ని వర్థిల్లజేస్తాడు.
Prayer:
కృపకు పాత్రుడవైన మా ప్రియ పరలోకపు తండ్రీ,
 
నిన్ను స్తుతించుచున్నాము. దేవా, మేము నీ యందు నమ్మకము కలిగి యుండుటకు అటువంటి హృదయమును మాకు అనుగ్రహించుము. పేరాస కలిగి అనేకులకు ఆటంకము కలిగియుండకుండునట్లు మమ్మును మార్చుము. మేము మనుష్యులను నమ్ముకొనకుండా, నిన్నే ఎల్లప్పుడు నమ్ముకొని జీవించునట్లు సహాయము చేయుము. అహంకారము కలిగిన హృదయమును మాలో నుండి తొలగించి, తగ్గింపు స్వభావమును మాకు దయచేయుము. ఈనాడు దీన స్థితిలో ఉన్న మమ్మల్ని వర్థిల్లునట్లు చేయుము. నీ భక్తుల వలె నీ పిలుపును అంగీకరించి, నీ యందు నమ్మిక కలిగి జీవించునట్లు కృపను దయచేయుము. దేవా, మనుష్యులను నమ్ముకొనకుండ నిన్ను ఆశ్రయించునట్లు మాకు సహాయము చేయుము. పై చెప్పబడిన వాగ్దానము వలె మేము మెండైన దీవెనలు పొందుకొనునట్లు మాకు కృపను దయచేయుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000