Loading...
Stella dhinakaran

గొప్ప వాత్సల్యముతో మిమ్మును చేర్చుకొనును!

Sis. Stella Dhinakaran
16 Sep
నాకెంతో ప్రియమైన సహోదర సహోదరీలారా, గొప్ప వాత్సల్యముతో మిమ్మును సమకూర్చెదనని ప్రభువు మీతో సెలవిచ్చుచున్నాడు. సమస్త కీడు నుండి ఆయన మిమ్మును విడిపించాలని ఆశించుచున్నాడు. దావీదు జీవితమును మనము చూసెదము. అతను జనాభా లెక్కలు చూచుట ద్వారా దేవునికి విరోధముగా అపరాధము చేశాడు. కానీ దేవుడు అతనిని చంపలేదు కనుకనే, ‘‘దేవుని వాత్సల్యము ఎంతో గొప్పది’’ అని దావీదు చెప్పుచున్నాడు. ఈనాడు, మీరు చేసిన తప్పులను క్షమించమని దేవుని అడుగుట ద్వారా ఆయన యొక్క కనికరమును మీరు పొందుకొనవచ్చును. ‘‘తండ్రీ, నన్ను క్షమించుము. నేను ఈ పెద్ద తప్పు చేశాను. ఈ సమస్య నుండి విడుదల పొందుకొనుటకు నాకు సహాయము చేయుము’’ అని దేవునికి ప్రార్థన చేయండి. దావీదు ఈవిధంగానే దేవునికి మొఱ్ఱపెట్టెను గనుక, దేవుని కనికరము అతని మీదికి వచ్చెను. దావీదు దేవునికి మొఱ్ఱ పెట్టినందునే ఇకపై నాశనము జరగకుండా ఉండునట్లుగా ఆయన దేవదూతలను నిలిపివేసెను.

మీరు కూడ ఇప్పుడు అనేక సమస్యలను ఎదుర్కొనుచు ఉండవచ్చును. మీరు మీ జీవితమును యేసుక్రీస్తుకు సమర్పించుకొని, ‘‘ప్రభువా, నన్ను కరుణించుము. నేను పాపిని. నీ యొక్క అమూల్యమైన రక్తముతో నన్ను శుద్ధీకరించుము’’ అని ఆయనకు మొఱ్ఱపెట్టండి. అప్పుడు గొప్ప వాత్సల్యము మీ మీదికి వచ్చును మరియు మీరు అపరాధము చేయుటకు కారణమైన ప్రతిదానిని ప్రభువు నాశనము చేయును. దేవుడు సమస్యలన్నిటిని తొలగించి, ఆయన యొక్క గొప్ప వాత్సల్యము కారణముగా, మిమ్మును సమస్త పాపముల నుండి విడిపించును. మీ చెడు యిష్టాలన్నియు మాయమైపోవును. అవి ఇకపై మిమ్మును పీడించవు. దావీదు మీద దేవునికి కనికరము ఉన్న ప్రకారముగా, ఆయన మీ మీద కూడ వాత్సల్యము చూపును. ఎంత కనికరముగల దేవుడు మనకున్నాడు!
కీర్తన 34:6లో, ‘‘ఈ దీనుడు మొఱ్ఱపెట్టగా యెహోవా ఆలకించెను అతని శ్రమలన్నిటిలోనుండి అతని రక్షించెను’’ అని చదివెదము మరియు ‘‘ప్రభువా, నీవు దయాదాక్షిణ్యములుగల దేవుడవు ధీర్ఘశాంతుడవు కృపాసత్యములతో నిండినవాడవు’’ (కీర్తన 86:15; కీర్తన 103:8) అని కూడ మనము చదివెదము. దేవుడు దయాదాక్షిణ్య పూర్ణుడు. ఈ కృపగల దేవుడు మీ మధ్యనున్నాడు. మీరు దేవునికి మొఱ్ఱపెట్టినప్పుడు, ప్రత్యేకముగా ఈ రోజే ఆయన యొక్క వాత్సల్యత మీ మీదికి వచ్చును. మీరు ఏ అపరాధము చేసినను, ఆయన తన రక్తముతో మిమ్మును కడిగి, మంచువలె తెల్లగా మార్చును. కనుకనే, ‘‘యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు రండి మన వివాదము తీర్చుకొందము మీ పాపములు రక్తమువలె ఎఱ్ఱనివైనను అవి హిమము వలె తెల్లబడును కెంపువలె ఎఱ్ఱనివైనను అవి గొఱ్ఱెబొచ్చువలె తెల్లని వగును’’ (యెషయా 1:18) అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. కనుక ఈనాడే దేవునితో సమస్త వివాదములను తీర్చుకొనండి, అప్పుడు ఆయన మిమ్మును నూతన వ్యక్తిగా మార్చును.
Prayer:
తండ్రీ,
నా జీవితమును నేడు నేను నీకు సమర్పించుకొనుచున్నాను. నేను నా జీవితములో అనేక తప్పులను చేసియున్నాను. నీవు ఎంతో కనికరముగల దేవుడవు. కనుక నన్ను క్షమించుము. నీ యొక్క ప్రేమ కనికరములు నా మీదికి వచ్చును గాక మరియు నా యొక్క పాపపు స్వభావము నుండి విడిపించుము. నన్ను నూతన మనిషిగా మార్చుము. నా వ్యసనాలన్నిటి నుండి నన్ను విడిపించుము. నన్ను కరుణించుము. యేసు రక్తముతో నన్ను కడిగి, మంచు వలె తెల్లగా మార్చుమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రీ, ఆమేన్‌.

For Prayer Help (24x7) - 044 45 999 000