Loading...
Stella dhinakaran

మీరు మేలు చేయుట యందు విసుకక యుండండి!

Sis. Stella Dhinakaran
30 Jun
నా ప్రియులారా, ఎల్లప్పుడు మనము మేలు చేయవలెనని దేవుడు మన పట్ల ఎదురు చూస్తున్నాడు. " మేలు చేయుట '' అనునది దేవుని దృష్టిలో చాలా ప్రీతికరమైనది. ఆయన దీనిని ఎంతో ప్రేమించును. అవును! మనము ఇతరులకు మేలు చేయుటకు ప్రయత్నించినప్పుడు, ప్రభువు మన పట్ల ఆనందించును. ఇతరులకు మేలు చేయు మంచి మనస్సును అనుగ్రహించమని మనము దేవుని ప్రార్థించినప్పుడు, ఈ క్రింది వచనము ప్రకారము ప్రభువు మనలను ఆశీర్వదించును. " అడుగు ప్రతివాడును పొందును '' (మత్తయి 7:8) అన్న వచనము ప్రకారము మనము దేవుని అడిగినప్పుడు నిశ్చయముగా పొందుకుంటాము. అవును మనము మన జీవితములో మంచి కార్యములు చేయుటకు ప్రభువు మనకు అట్టి కృపను అనుగ్రహించును గాక. అందుకే బైబిలేమంటుందో చూడండి, " మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, తన కనికరము చొప్పుననే పునర్జన్మసంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. ఈ మాట నమ్మదగినది గనుక దేవునియందు విశ్వాసముంచినవారు సత్‌క్రియలను శ్రద్ధగా చేయుటయందు మనస్సుంచునట్లు నీవీసంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలెనని కోరుచున్నాను. ఇవి మంచివియు మనుష్యులకు ప్రయోజనకరమైనవియునై యున్నవిగాని... '' (తీతుకు 3:5,8) అన్న వచనము ప్రకారము మనము మేలు చేసినప్పుడు దేవుడు తన కృప చేత మనలను రక్షించెను.

ఒక స్త్రీ ఎల్లప్పుడు ఎంతో ఆనందముగా ఉండేది. ఒక దినము ఆమె బాధలో ఉన్నప్పుడు ఒక పేద తల్లి ఆమె వద్దకు వచ్చింది. ఆ పేద తల్లి ఆమెను విధంగా ఉండుటను చూచి, ఆశ్చర్యపోయింది. ఆమె ఆ స్త్రీతో, " నీవు ఈ విధంగా బాధపడుట నేనెన్నడు చూడలేదు. నీకేమైంది? '' అని అడిగింది. ఆ పేద తల్లి అంతటితో ఆపలేదు. రెండు రూపాయల కాగితం తీసి, ఆ స్త్రీ చేతిలో పెట్టి వెళ్లిపోయింది. ఆ సమయములో ఆమె వద్ద ఉన్నది ఆ రెండు రూపాయలు మాత్రమే. అవును! ఆ సమయములో ఆ స్త్రీకి కావలసినది అదే. అది ఆమెను సంతోషపెట్టినది. కానీ, ఆ పేద తల్లి తన వద్ద ఉన్నదంతటిని ఇవ్వడం అన్నది ఎంత గొప్ప విషయము! అవును! మేలు చేయుట అంటే ఇదే. ఆమె ఫలితమును ఆశించకుండ చేసినది. అవసరములో ఉన్నవారికి మనము సహాయము చేసి, వారిని ఆదరించినప్పుడు, ప్రభువు నిశ్చయముగా ఆనందించి, మనలను విస్తారముగా ఆశీర్వదించును!
నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు కఠిన హృదయు లై ఇప్పటి వరకు ఎవ్వరికి మేలు చేయని యెడల ఇప్పటి నుండి ఇతరులకు మేలు చేయుటకు ప్రారంభించండి. ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి దానిగుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరుగల ఒకడు యేసు ఎవరోయని చూడగోరెనుగాని, పొట్టి వాడైనందున జనులు గుంపుకూడి యుండుట వలన చూడలేకపోయెను. అప్పుడు యేసు ఆ త్రోవను రానై యుండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి, ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు, కన్నులెత్తి చూచి, జక్కయ్యా త్వరగా దిగుము, నేడు నేను నీ యింట నుండవలసియున్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరు అది చూచి ఈయన పాపియైన మనుష్యుని యొద్ద బసచేయ వెళ్లెనని చాల సణుగుకొనిరి. జక్కయ్య నిలువబడి ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను; నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసికొనిన యెడల అతనికి నాలుగంతలు మరల చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. అందుకు యేసు ఇతడును అబ్రాహాము కుమారుడే; ఎందుకనగా నేడు ఈ యింటికి రక్షణ వచ్చియున్నది. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను (లూకా సువార్త 19:2-12). దేవుడు జక్కయ్యను రక్షించినప్పుడు, అది అతని హృదయాంతరంగమును మార్చి, ఇతరులకు మేలు జరిగించునట్లు చేసినది. చూడండి, దేవుడు అనుగ్రహించు రక్షణ ఏలాగున మన జీవితాలను మార్చగలిగినది. మనము మార్చబడినప్పుడు ఎల్లప్పుడు మేలు చేయుటకు త్వరపడుదుము. కనుకనే, మనము మేలు చేయుట యందు విసుకక యుందము. అందుకే బైబిలేమంటుందో చూడండి, " మనము అలయక మేలు చేసితిమేని తగినకాలమందు పంట కోతుము '' (గలతీయులకు 6:9) అన్న వచనము ప్రకారము నేడు ఈ సందేశము చదువుచున్న మీరు విసుకక మేలు చేయాలని కోరినట్లయితే, మీరు ప్రభువు యొద్ద అటువంటి మనస్సు కావాలని అడిగినట్లయితే, విసుకక మేలు చేయునట్లుగా, ఆయన నిశ్చయముగా మీకు అటువంటి హృదయమును అనుగ్రహించి, ప్రభువు మిమ్మును విస్తారముగా ఆశీర్వదించును గాక.
Prayer:
దయాకనికరము కలిగిన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ,

మా ప్రియ రక్షకుడా, నేటి నుండి ఇతరులకు మంచి చేయు దైవీకమైన మనస్సును మాకు అనుగ్రహించుము. నీ వాక్యానుసారముగా, విసుకక ఇతరులకు మేలు చేయుటకు మాకు అటువంటి గొప్ప కృపను మాకు అనుగ్రహించుము. ఇతరులకు మేలు చేయని కఠినమైన హృదయమును మాలో నుండి తీసివేసి, అనేకులకు మేలు చేయుటకు మాకు సహాయము చేయుము. ఎల్లప్పుడు నీ సన్నిధిలో ప్రార్థించునట్లుగా మాకు కృపను దయచేయుము. కష్ట సమయములో కూడ మేము ఎల్లప్పుడు సంతోషముగా ఉండునట్లుగా అటువంటి హృదయమును దయచేయుము. మా ప్రతి అవసరతలను తీర్చి, మమ్మల్ని నీ బిడ్డలను మార్చుమని యేసు క్రీస్తు నామములో కన్నీటితో ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000