Loading...
DGS Dhinakaran

మీ స్వకీయులను సంరక్షించే జ్ఞాన వివేకములిచ్చే దేవుడు!

Bro. D.G.S Dhinakaran
06 Dec
నా ప్రియులారా, నేడు ఈలోకములో జీవించే మనము మన స్వకీయులను ప్రేమించవలెననునది దేవుని యొక్క ఉద్దేశమై యున్నది. కాబట్టి, ఈనాడు ఈ సందేశము చదువుచున్న మీపై ఆధారపడిన తన భార్య మరియు బిడ్డల భవిష్యత్తులో ఎటువంటి కొరత లేకుండా జీవించవలెననే ఉద్దేశముతో వారి కొరకు కూడబెట్టుట ప్రతి కుటుంబ యజమాని యొక్క ప్రాముఖ్యమైన బాధ్యతయై యున్నది. ఆలాగున చేయనట్లయితే, బైబిలేమంటుందో చూడండి, " ఎవడైనను తన యింటి వారిని ఏలనేరక పోయిన యెడల అతడు దేవుని సంఘమును ఏలాగు పాలించును? '' (1 తిమోతి 3:5) అన్న వచనము ప్రకారము తన సొంత కుటుంబ వ్యవహారములలో నిర్లక్ష్యముగా వున్నవారిని నమ్మి, ప్రభువు తన యొక్క సేవలో ఉన్న ఉన్నతమైన బాధ్యతలను ఎలా అప్పగించును? కాబట్టి, దేవుని చేత గొప్ప విషయాలు మనకు అప్పగించాలంటే, మనం చిన్న విషయాలలో ప్రభువునకు నమ్మకంగా ఉండాలి. అప్పుడే, మనకు ఇవ్వబడిన బాధ్యతలను చక్కగా నిర్వర్తించగలము.

కొంతమంది తల్లిదండ్రులు తాము చాలా భక్తిపరులమని అనుకొంటారు. వారి సంపాదనంతటిని ఎంతో దర్జాగా ఖర్చు చేస్తారు. వారి పిల్లల ఆధాయాన్ని కూడ ఎంతో విలాసముగా ఖర్చు చేస్తారు. పొదుపు అనే మాటకు వారి దగ్గర చోటుండదు. Äౌవన వయస్సునకు వచ్చిన వారి పిల్లలను వివాహము కొరకు ఏర్పాట్లేమి చేయరు. పిల్లలు భవిష్యత్తు విషయమై ఇతరులు ఎంత తమ మంచి సలహాలిచ్చినను, వారు దానిని అంగీకరించరు. " నా పిల్లల విషయాలు దేవుడే చూసుకొంటాడు. యేసుక్రీస్తు రాకడ ఎంతో సమీపించినది. కనుక ఆస్తి, ఐశ్వర్యము పోగు చేయనవసరం లేదు. దేవుని రాకడలో మా కుటుంబమంతయు ఎత్తబడుట కొరకు ఎదురు చూస్తున్నాము అని జవాబిచ్చెదరు. '' అందువలన, ఆ తల్లిదండ్రులు భక్తి ముదిరిపోయి, అకస్మాత్తుగా చనిపోతారు. తద్వారా, తమ పిల్లలకు మోపెడు అప్పుల భారమును మాత్రమే వారు మిగిల్చి వెళ్తారు. నిస్సహాయ స్థితిలో విడువబడిన అమాయకులైన ఆ పిల్లలు కన్నీటితో జీవించెదరు. అందుకే బైబిలేమంటుందో చూడండి, " అధికముగా నీతిమంతుడవై యుండకుము; అధికముగా జ్ఞానివికాకుము; నిన్ను నీవేల నాశనము చేసికొందువు? '' (ప్రసంగి 7:16) అని దేవుని వాక్యము మనలను హెచ్చరించుచున్నది. పై చెప్పబడినట్లుగా కాకుండా, మీరు ఎలాగున ఉండాలని వాక్యము మనకు సెలవిచ్చుచున్నదో చూడండి, " నా కుమారీ, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను గదా '' (రూతు 3:1) అని బాధ్యతగల నయోమి తన కోడలైన రూతుతో చెప్పిన ప్రకారం ఆమె రూతు జీవితమును దేవుని జ్ఞానముతో కట్టుకున్నది. అదేవిధముగా, మన కుటుంబంలోని భార్య, బిడ్డలు మరియు మనపై ఆధారపడు వారందరి సంక్షేమము చూచుట మన బాధ్యతయై యున్నది. జీవిత బాధ్యతలు, వర్తక వ్యాపార విషయాలలో అకస్మాత్తుగా ఏదైన ఆపద సంభవించినచో వాటిని అధిగమించుట కొరకు ముందు చూపుగా అవగాహన కలిగి యుండుట జ్ఞానులు చేయవలసిన కార్యమైయున్నది.
నా ప్రియులారా, వివేకవంతులు తమ వ్యాపార సంస్థలలో లేదా వారు నిమగ్నమై ఉన్న ఇతర వృత్తిపరమైన వృత్తిలో తలెత్తే ఏవైనా ఇబ్బందులను లేదా నష్టాలను ఎలా ఎదుర్కోవాలో ముందుగానే ప్రణాళిక వేయడం కూడా వివేకం మరియు ముందంజు వేయుట కొరకైన ఒక ఆలోచన. కాబట్టి, " అధికముగా నీతిమంతుడవై యుండకుము; అధికముగా జ్ఞానివికాకుము; నిన్ను నీవేల నాశనము చేసికొందువు? '' (ప్రసంగి 7:16) అన్న వచనము ప్రకారము మీరు మరియు మీ కుటుంబము, సంఘపరిచర్య నిమిత్తము మీకివ్వబడిన ప్రతి ప్రణాళికను, కోరికను ప్రభువునకు సమర్పించినట్లయితే, ప్రతిదానిలో ఆయన జ్ఞానం మరియు వివేకం కోరుకోండి. మీలో మరియు మీ కోసం ప్రతిదీ పని చేయడానికి దేవుని వాక్యాన్ని అనుమతించండి. ఇది మీ జీవిత నావను సురక్షితంగా ప్రయాణించేలా చేస్తుంది! కనుకనే, హృదయ పూర్వకముగా దేవుని తట్టు తిరగండి. ఈ సందేశంలో నేను చెప్పిన సలహాలను తప్పక పాటించండి, నిశ్చయముగా ప్రభువు మిమ్మల్ని దీవిస్తాడు! మీ ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధల నుండి ఆయన మిమ్మును తప్పక విడిపిస్తాడు. మీకు మరియు మీ పిల్లలకు మంచి భవిష్యత్తును అనుగ్రహించి మిమ్మల్ని పరవశింపజేస్తాడు.
Prayer:
మహోన్నతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రీ,

నీవు మా కొరకు ఏర్పాటు చేసిన కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుచున్నాము. మా కుటుంబంలో ఉన్న ప్రతి సభ్యులను ఆశీర్వదించుము. మేము వారిని జాగ్రత్తగా చూసుకునే స్థితిలో ఉండటం ఒక ఆశీర్వాదకరంగా భావిస్తున్నాము. వారి యొక్క ప్రతి అవసరాన్ని అందించడానికి మరియు ప్రేమతో వారికి సేవ చేయడానికి మా హృదయాలను ప్రోత్సహించుము. మా కుటుంబం కోసం సరైన నిర్ణయాలు తీసుకోవటానికి నీ యొక్క జ్ఞానంతో మమ్మల్ని నింపి, దీవించుము. మా కుటుంబము మరియు మా సేవా పరిచర్య పట్ల నీవు ఇచ్చిన బాధ్యతలను చక్కగా నిర్వహించుటకు కావలసిన జ్ఞానవివేకములను మాకు అనుగ్రహించుము. మాకు ఉన్న అప్పుల బాధల నుండి విడిపించి, మా దుఃఖమును సంతోషముగా మార్చుమని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000