Loading...
Paul Dhinakaran

సమృద్ధికరమైన దీవెనలు

Dr. Paul Dhinakaran
02 Jul
నా స్నేహితులారా, ప్రభువు మిమ్మును తన సమృద్ధితో కూడిన దీవెనలతో నింపుటకు ఇష్టపడుచున్నాడు. ఈ దిన వాగ్దానము యిర్మీయా 31:14 నుండి తీసుకొనబడినది.  "క్రొవ్వుతో యాజకులను సంతోషపరచెదను, నా జనులు నా ఉపకారములను తెలిసికొని తృప్తినొందుదురు; ఇదే యెహోవా వాక్కు" అని ఆ వాగ్దానములో చెప్పబడినది. అవును, మీరు సమృద్ధికరమగు విస్తారమైన దీవెనలను కలిగియుండాలని మరియు మీరు తృప్తినొందాలని ప్రభువు మీపట్ల ఆకాంక్షను కలిగియున్నాడు.

మీరు అమితముగా కష్టపడుచున్నారేమో లేదా కష్టపడి చదువుచున్నారేమో! ప్రజలను మీరు షరతులేనట్టి ప్రేమతో మీ పూర్ణ హృదయముతో ప్రేమించుచున్నారేమో లేదా మీరు పేదలకు మిక్కిలి త్యాగపూర్వకముగా సహాయము చేయుచు ప్రభువు పని నిమిత్తము కూడా సహకరించుచున్నారేమో. కానీ మీ జీవితములో మీరు పొందుకొనిన ఆశీర్వాదములతో సంతృప్తి నొందక ఒక శూన్యము వంటి స్థితిలో యున్నారేమో. ఈ దినమున "నా ప్రజలు, నా యాజకులు, నేను వారికీ  అనుగ్రహించు సమృద్ధికరమైన దీవెనలతో తృప్తినొందెదరు" అని ప్రభువు మీతో చెప్పుచున్నాడు". కావున మీ హృదయమును కలవరపడనీయకుడి.
మనలను తన సమృద్ధితో నింపుటకు యోహాను 1:16 లో తెలిపినట్లుగా మన నిమిత్తము ప్రభువు పరిపూర్ణుడాయెను. ఆయన పరిపూర్ణ దేవునిగా ఉండి దేవుని చిత్తమును తన జీవితములో సంపూర్ణముగా నెరవేర్చాడు. సర్వమానవాళి రక్షణ నిమిత్తము ఆయన తనను తాను సిలువలో సమర్పించుకున్నాడు. సర్వశక్తుడగు దేవుని సంపూర్ణతను తాను కలిగియున్న కారణముగా మనము కృప వెంబడి కృపను పొందుకొనుచున్నాము. ఇంకొక తర్జుమాలో మనము ఆశీర్వాదము వెంబడి ఆశీర్వాదమును పొందుకొనుచున్నాము అని చెప్పబడింది. తన ప్రజలు, తన యాజకులు అయినట్టి మీతో దేవుడు ఒక నిబంధనను చేసినట్లుగా యిర్మీయా 32:40 లో మనము చదువుతాము. "నేను వారికి మేలు చేయక మానను" అని ఆయన చెప్పుచున్నాడు. అవును, నా ప్రియ స్నేహితులారా, ప్రభువు యొక్క హృదయ పరిపూర్ణతనుండి ఒకదాని వెంబడి మరియొక ఆశీర్వాదము మీ జీవితములో వచ్చును. యేసువైపు చూచుటను కొనసాగించుడి.

ఐదు వేలమంది పురుషులు వారితోపాటుగా ఉన్నట్టి స్త్రీలు మరియు పిల్లలను పోషించు నిమిత్తము యేసు యొద్ద అయిదు రొట్టెలు మరియు రెండు చేపలు మాత్రమే ఉన్నాయి. వారందరు ఆకలిగొనియున్నారు కనుక వారియెడల ఆయనకు మిక్కిలి కనికరము కలిగింది. కావున ఆయన రొట్టెను తీసుకొని, కృతజ్ఞతా స్తుతులు చెల్లించి దానిని ఆశీర్వదించాడు. ఆ రొట్టె విరిచి ఆ ప్రజలకు ఇచ్చాడు, పిదప అద్భుతరీతిలో మరియొక నూతన రొట్టె సృష్టించబడింది. మరల ఆయన ఆ రొట్టెను విరిచి ప్రజలకు అందించాడు. ఆ రొట్టె ఒక ఆశీర్వాదము వెంబడి మరియొక ఆశీర్వాదమును తీసుకొనిరాగా అక్కడ కూడుకొన్న వారందరు తృప్తినొందారు. "ఆ ప్రకారముగా మీకు కూడా చేస్తాను" అని ప్రభువు చెప్పుచున్నాడు. నేను ఆకాశపువాకిండ్లను విప్పి, పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని ప్రభువు మలాకి 3:10 లో సెలవిచ్చుచున్నాడు మరియు నీ దేవుడనగు యెహోవాను నేనే నీ నోరు బాగుగా తెరువుము నేను అన్ని ఆశీర్వాదములతో దాని నింపెదను అని కీర్తన 81:10 లో ప్రభువు చెప్పుచున్నాడు.
Prayer:
మీయొక్క విఫలంకాని ప్రేమను బట్టి మీకు కృతజ్ఞతలు ప్రభువా! సిలువపై మీరు చేసిన త్యాగము మూలముగా నేను నా జీవితములో కృప వెంబడి కృపను, ఆశీర్వాదము వెంబడి ఆశీర్వాదమును పొందుకొన్నాను కనుక మీకు వందనములు. మీ ప్రజలుగా, మీ యాజకులుగా నన్ను పిలుచుకొన్నందుకు మీకు వందనములు. మీరు వర్ధిల్లజేయు దేవుడు కనుక మీ యొక్క పరిపూర్ణమైన మరియు సమృద్ధికరమగు దీవెనలతో నా జీవితమును తృప్తినొందించండి.

యేసు నామములో నేను ప్రార్థించుచున్నాను! ఆమెన్.
 

For Prayer Help (24x7) - 044 45 999 000