Loading...

తగిన సమయమందు హెచ్చింపబడునట్లు దీనత్వము ధరించుకొనుడి!

Shilpa Dhinakaran
25 Jan
నా ప్రియులారా, లోబడుటకు సాదృశ్యం యేసుక్రీస్తు మాత్రమే. బైబిల్‌లో చూచినట్లయితే, యేసుక్రీస్తు తన శిష్యుల పాదాలను కడగడం బైబిల్‌లో వినయానికి గొప్ప ఉదాహరణ. ఈ విశ్వం యొక్క సృష్టికర్తయైన ఆయన, మనందరికంటే గొప్పవాడు. కాబట్టి, ఆయన తనను తాను తగ్గించుకొని, తన శిష్యుల పాదాలను కడగాలని నిర్ణయించుకున్నాడు. ఈనాడు మనము కూడ అదే పనిని చేయాలంటే, మనల్ని మనం తగ్గించుకోవాలని, మన జీవితమంతా దేవునికి సమర్పించుకోవాలని బైబిలు చెబుతుంది. మనము మొదటి అడుగు ముందుకు వేసి, ఈ పనిని చేసినప్పుడు, ప్రభువు మనలను ఎంతో ఉన్నత స్థానమునకు హెచ్చిస్తాడు. మనం ఇతరుల ముందు కూడ వినయంగాను మరియు దీనత్వమును కలిగి ఉండుటకు నేర్చుకోవాలి. అందుకే బైబిలేమంటుందో చూడండి, ‘‘ చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి యుండుడి; మీరందరు ఎదుటివాని యెడల దీనమనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి; దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును ’’ (1 పేతురు 5:5) అన్న వచనము ప్రకారము నేడు ఈ సందేశము చదువుచున్న మీరు ఇతరుల యెదుట దీనత్వము కలిగియుంటూ, వినయంగా ఉన్నప్పుడు, మీరు క్రీస్తులో ఉన్న విధేయతను ప్రతిబలింపజేస్తారు. తద్వారా, ప్రజలు మీలోక్రీస్తును చూడటం ప్రారంభిస్తారు.
 
 బెన్ అనే వ్యక్తిని గురించి ఒక కథను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. అతడు అనుదినము తాను దేవాలయము యొక్క బలిపీఠం వద్దకు వెళ్లి ప్రార్థన చేసేవాడు. బెన్ దేవుని సన్నిధి యెదుట తనను తాను తగ్గించుకొని, ఆయనకు సంపూర్ణంగా సమర్పించుకొని, ‘‘ హలో జీసస్, నేను బెన్ వచ్చాను ’’ అని కొన్ని మాటలు చెప్పేవాడు. ఇలాగున ప్రతిరోజు బెన్ ఒంటరిగా చర్చికి రావడాన్ని పాస్టర్‌గారు గమనించారు. అదేలాగున కొన్ని నెలలు గడిచాయి మరియు బెన్ చర్చిలో ఎక్కడా కనిపించడము లేదు. అతను అనారోగ్యంతో ఉన్నాడని విన్న పాస్టర్, ఆసుపత్రిలో అతనిని సందర్శించుటకు అతని యొద్దకు వెళ్లాడు. బెన్ ఒంటరిగా హాస్పిటల్ బెడ్‌లో పడుకొని యుండెను. పాస్టర్ అతని పక్కన కూర్చుని, అంతకుముందు తనను చూడటానికి రాలేదని క్షమాపణలు చెప్పాడు. కానీ, బెన్ నవ్వి, అతనితో, ‘ లేదు పాస్టర్‌గారు, ప్రతిరోజు తెలుపు రంగులో బట్టలు ధరించుకొని ఉన్న ఒక వ్యక్తి నన్ను సందర్శించడానికి నా వద్దకు వస్తున్నాడు. అంతమాత్రమే కాదు, ఆయన నా ప్రక్కన కూర్చుని, ‘ హలో బెన్, నేను యేసును అని చెప్పి ’ ఆ వ్యక్తి ప్రతిరోజు నన్ను బలపరచి మరల వెళ్ళిపోతాడు. నేను ఆసుపత్రిలో అనుమతించబడిన రోజు నుండి ప్రతిరోజు ఆ వ్యక్తి నన్ను వ్యక్తిగతంగా సందర్శిస్తున్నాడు అని ఆ పాస్టరుగారితో చెప్పాడు.
అవును, నా ప్రియమైన మిత్రులారా, మన ప్రభువు దీన హృదయంతో ఉండే ఒక వ్యక్తిని ఎలా ఘనపరుస్తాడో చూశారు కదా! ‘‘ ఆయన ఎక్కువ కృప నిచ్చును; అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్ర హించును అని లేఖనము చెప్పుచున్నది ’’ (యాకోబు 4:6) అన్న వచనము ప్రకారము దేవుడు అహంకారులను ఎదిరించి, దీనులకు తన కృపను అనుగ్రహిస్తాడు. కాబట్టి, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు తగిన సమయమందు హెచ్చించబడాలంటే, దీనత్వము ధరించుకొనండి. ‘‘ దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చే తిక్రింద దీనమనస్కులై యుండుడి ’’ (1 పేతురు 5:6) అన్న వచనము ప్రకారము మీరు దేవునికి లోబడి జీవించండి, ఆయన బలిష్టమైన చేతిక్రింద దీనమనస్కులై యుండండి, అప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఈనాడు యేసుక్రీస్తునకు మీ జీవితాన్ని వినయ పూర్వకంగా సమస్తాన్ని సమర్పించుకున్నప్పుడు, ఈ లోక కార్యాలు ఏవియు ఇకపై మీకు గొప్పగా అనిపించవు. మీరు ఈ లోకములో గొప్ప ఐశ్వర్యము కలిగియున్నను సరే మరియు ఆస్తి కలిగి ఉన్నప్పటికిని, మీకు ప్రపంచంలో ఎన్ని డిగ్రీలు ఉన్నప్పటికిని, మీరు క్రీస్తుకు మీ జీవితాన్ని సమర్పించుకొని, దీనత్వమును కలిగి జీవించినట్లయితే, యేసు ఇలా అంటున్నాడు, ‘‘ తన్నుతాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును; తన్నుతాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును ’’ (మత్తయి 23:12) అన్న వచనము ప్రకారము అవును, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు దీనత్వమను వస్త్రమును ధరించుకొన్నట్లయితే, దేవుడు మీ పట్ల కృపను అనుగ్రహిస్తాడు. దీనత్వతము చేత దేవుని కృపను పొందుకొని ఉండాలని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. కాబట్టి, మీరు దీనమనస్సు అను వస్త్రమును ధరించుకొని మిమ్మును మీరు అలంకరించుకొని, తగ్గించుకొని దేవునికి విధేయులుకండి, అప్పుడు దేవుడు తగిన సమయమందు మిమ్మును ఉన్నత స్థానమునకు హెచ్చిస్తాడు.
Prayer:
దయాకనికరము కలిగిన మా పరలోకమందున్న తండ్రీ,

దేవా, దీనమనస్సు అను వస్త్రమును మేము ధరించుకొని నీ వలె మేము ఇతరుల యెడల తగ్గించుకొనుటకు నీ కృప చేత మమ్మల్ని నింపుము. మా పాపములను నీ సన్నిధిలో ఒప్పుకొని విడిపెట్టుచున్నాము. ఈ రోజు నుండి నీకు ప్రియమైన బిడ్డలనుగా మమ్ములను మార్చుము. పాపము వలన వచ్చు జీతము మరణమని అట్టి మరణము నుండి మమ్మును దూరపరచుము. ఎందుకంటే, నిన్ను నీవు తగ్గించుకొని మరణమును రూచిచూచినందున మరణము నుండి మమ్మును దూరపరచుము. మాలో ఉన్న అహంకారమును తొలగించి, దీనత్వమను వస్త్రమును అలంకరించుకొనుటకు మాకు సహాయము చేయుము. తగిన సమయమందు మేము హెచ్చింపబడునట్లుగా నీ బలిష్టమైన చేతి క్రింద దీనమనస్కులై జీవించునట్లు మాకు సహాయము చేయుము. ఇక నుండి మేము ఇతరుల పట్ల తగ్గింపు కలిగియుండునట్లును మరియు నీ యందు విధేయత కలిగి జీవించునట్లును మాకు సహాయము చేయుము. మా జీవితమును నీ చేతులకప్పగించు కొనుచున్నాము. మమ్ములను నీ సొంత బిడ్డలనుగా తీర్చిదిద్ది, తగిన సమయమందు మమ్మల్ని ఉన్నత స్థానమునకు హెచ్చించుమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000