
మీరు యేసునకు నమ్మకమైన స్నేహితులుగా ఉండండి!
నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును మరియు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో నేను మీకు శుభాభివందనాలు తెలియజేయుచున్నాను. ఈ రోజు మనం ప్రభువు యొక్క అద్భుతమైన వాగ్దానాన్ని ధ్యానించుకుందాము. ఈరోజు మన ధ్యానము కొరకైన వాగ్దానము, " నన్ను ప్రేమించువారిని నేను ప్రేమించుచున్నాను నన్ను జాగ్రత్తగా వెదకువారు నన్ను కనుగొందురు '' (సామెతలు 8:17) అన్న వచనము ప్రకారము, మీరు దేవుని మీ పూర్ణ హృదయముతో ప్రేమించి, వెదకినట్లయితే, ఆయన మీకు సన్నిహిత స్నేహితుడుగా ఉంటాడు.
మన పితరుడైన అబ్రాహాము ప్రభువును పూర్ణహృదయంతో ప్రేమించాడని లేఖనాల్లో మనము చదువగలము. " నా స్నేహితుడైన అబ్రాహాము '' మరియు " నీ స్నేహితుడైన అబ్రాహాము, '' " కాబట్టి అబ్రాహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనములు నెరవేర్చబడెను. మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను '' (యెషయా 41:8; 2 దినవృత్తాంతములు 20:7; యాకోబు 2:23). పైన చెప్పబడిన వచనములలో తెలియజేసినట్లుగా, మన పితరుడైన అబ్రాహాము దేవుని స్నేహితుడు అని పిలువబడ్డాడు. నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు కూడ దేవునికి స్నేహ పూర్వకంగా జీవిస్తున్నారా? ఆయన మీకు మాత్రమే స్నేహితుడుగా ఉన్నాడా? ఈ రోజు ప్రభువుతో మీ సంబంధాన్ని సరిచేసుకోవడానికి ప్రయత్నించండి. మీకున్న ఇతర స్నేహితులను యేసుతో పోల్చుకొనవద్దు. యేసును ఏ మానవ ప్రేమతోనూ పోల్చలేము. ఎందుకంటే, ఆయన మనకు నిజమైన మంచి స్నేహితుడు. ఇలాంటి అనుభవమును నేను వ్యక్తిగతంగా అనుభవించాను. నా జీవితంలో యేసు తప్ప మరొక స్నేహితుడు నాకు లేడు. అందుకే దేవుడు నేటికిని నా పట్ల తన కృపను అనుగ్రహిస్తూనే ఉన్నాడు.
నా పియమైనవారలారా, ఈ రోజు ఈ సందేశము చదువుచున్న మీ జీవితాన్ని పరిశీలించి చూచుకొనండి. నేడు మీరు నిజంగా ప్రభువును వెదకుచున్నారా? మీరు దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా? మీరు ప్రార్థనలో ప్రభువుతో పరిపూర్ణమైన నమ్మకముతో మాట్లాడుచున్నారా? మీరు ఆయన యెదుట సర్వసత్యముతో నీతిమంతమైన జీవితాన్ని గడుపుతున్నారా? ఆలాకాకపోయినట్లయితే, ఇప్పుడే మీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకొనండి. మీ తప్పులను క్షమించమని మరియు ఆయన విశ్వాసనీయత ప్రకారం మిమ్మల్ని ఆశీర్వదించమని అడగండి. ఆయనను నిజంగా ప్రేమించి, మీ పూర్ణ హృదయముతో అబ్రాహాము వలె వెదకినట్లయితే, మన పితరుడైన అబ్రాహాము పట్ల ఆనందించిన దేవుడు నిశ్చయముగా, నేడు ఈ సందేశము చదువుచున్న మీ పట్ల ఆనందించి, మిమ్మును తన స్నేహితులనుగా మార్చుకుని మిమ్మును గూర్చి సాక్ష్యమిచ్చునంతగా ఆశీర్వదిస్తాడు. దేవుడు ఇంతటి గొప్ప దీవెనతో మిమ్మును నేటి నుండి దీవించును గాక.
మా ప్రేమా నమ్మకమైన సర్వశక్తిమంతుడవైన పరమ తండ్రీ,
నీ వాక్యం ద్వారా నేడు నీవు మాతో మాట్లాడినందుకై మేము నిన్ను స్తుతించుచున్నాము. దేవా, ఇప్పుడు కూడా మా జీవితాన్ని నీ ప్రేమగల హస్తాలకు సమర్పించుకుంటున్నాము. దేవా, దయచేసి మా తప్పిదములన్నిటిని క్షమించుము. మా జీవితమంతా మేము నీకు మంచి స్నేహితులముగా ఉండే ధన్యతను మాకు దయచేయుము. వేకువనే లేచి నిన్ను వెదకుటకు కృపనిమ్ము. మేము ఇతరులకు సాక్షిగా వుండుటకు మాకు సహాయము చేయుము. ప్రభువా, అబ్రాహాము వలె మేము నీ యెదుట నమ్మకముగా జీవించునట్లు మా హృదయాలను మార్చుము. దేవా, మా జీవితములో ఉన్న అవినీతిని మా నుండి తొలగించుము. ప్రభువా, నీ సన్నిధితో మా హృదయాన్ని నింపుము. దేవా, మా పూర్ణ హృదయముతో నిన్ను జాగ్రత్తగా వెదకుటకు మాకు సహాయము చేయుము. ప్రభువా, నీవు మా పట్ల నమ్మకముగా ఉన్నట్లుగానే, మేము కూడ నేటి నుండి నీ పట్ల నమ్మకముగా జీవించడానికి మాకు సహాయం చేయుము. యేసయ్య, అబ్రాహామువలె నీతో దృఢమైన స్నేహాన్ని పెంపొందించుకోవడానికి మరియు మా మార్గములన్నిటిలోను నిన్ను సంతోషపెట్టడానికి మాకు సహాయం చేయుము. దేవా, మా జీవితాన్ని పరిపూర్ణమైన విశ్వాసనీయతగా మార్చుము. ప్రభువా, నేటి నుండి నీవు మా పితరుడైన అబ్రాహామును ఆశీర్వదించినట్లుగానే మమ్మును కూడా ఆశీర్వదించుమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.