Loading...
Dr. Paul Dhinakaran

అత్యధికమైన దీవెనలు

Dr. Paul Dhinakaran
06 Sep
నా చిన్నతనంలో నేను మా తాతగారితో కలిసి చేపల మార్కెట్‌కు వెళ్లేవాడను. ఆ రోజులలో, మా తాతగారు చేపలు కొనుటకు చాలా బేరమాడేవారు. మా ఆర్థిక పరిస్థితి అంత దీనంగా ఉండేది. చేపలు తూకం వేయబడిన తరువాత, ఆయన మరి కొన్ని చేపలను వేయమని అడిగేవారు మరియు ఆ చేపల విక్రేత, మేము చెల్లించిన డబ్బులకు ఇంకా కొన్ని చేపలను తీసి ఉచితముగా వేసేవాడు. అది మాకు సంతోషము కలిగించేది. చేపల విక్రేత మాకు రెండు చిన్న చేపలు ఉచితముగా ఎక్కువ ఇచ్చాడు అనే సంతృప్తితో మేము ఇంటికి తిరిగి వచ్చేవారము! కానీ దేవుడు అధికముగా ఇచ్చినట్లయితే, ఆయన మనము ఇంటికి మోసుకొనిపోలేనంత అధికముగా ఇచ్చును. మనము తూచలేనంత గొప్ప కృపను ఆయన మనకు అనుగ్రహించును. స్నేహితుడా, నేడు మీరు దేవుని ఏమడిగినను, ఆయన ఇంకా అనేక ఆశీర్వాదములను జోడించి ఇచ్చును. అవును, మీరు ఊహించినదానికంటెను లేక అడిగినదానికంటెను అదనపు ఆశీర్వాదములను ఆయన మీకు అనుగ్రహించును. మన దేవుడు తన ప్రేమతో మిమ్మల్ని ఆశ్చర్యపరచవలెనని ఆశించుచున్నాడు. అవును! మీరు దేవుని రాజ్యమును నీతిని మొదట వెదకినప్పుడు, ఆయన మీ జీవితములో మీకు అవసరమైనదానికంటె అధికముగా అనుగ్రహించును.

చెన్నైకు చెందిన సహోదరుడు, ఆనంద సెల్వంగారి సాక్ష్యమును మీతో పంచుకొనెదను: ‘‘నేను క్రీస్తు ప్రేమను రుచి చూడని కుటుంబములో పుట్టి పెరిగాను. నా కుటుంబమును పోషించుకొనుటకు నేను ఒక చిన్న టీ దుకాణమును నడుపుకొనేవాడను. ఆ చిన్న వ్యాపారములో నేను నష్టం వెంబడి నష్టమును ఎదుర్కొన్నాను. మరియు నేను ఇంచుమించు భిక్షగాని వలె మారిపోయాను. ఎక్కడికి వెళ్లాలో నాకు తెలియలేదు. అది నా పరిస్థితి. కానీ, సుమారు ఆరు లేక ఏడు సంవత్సరముల క్రితం నా మిత్రులలో ఒకరు నాకు యేసు పిలుచుచున్నాడు పరిచర్యను గూర్చి పరిచయం చేసి, డా॥. డి.జి.యస్‌.దినకరన్‌ స్మారక ప్రార్థన గోపురములో వ్యక్తిగతంగా ప్రార్థన చేయించుకొనుటకు ఆహ్వానించాడు. అక్కడ చేయబడిన ప్రార్థన ద్వారా, నాలో దేవుని సమాధానము నింపబడినది. కనుక వెంటనే నా వద్ద చాలినంత డబ్బు లేకపోయినను, నా చేతిలోనున్న బస్సు చార్జీతోనే ప్రార్థన గోపురమును సందర్శించాను. ఆ తరువాత నా భార్య పిల్లలతో కలిసి ప్రార్థన గోపురములో నిర్వహించబడు కూటములలో పాల్గొనుట ప్రారంభించాను. ఈవిధంగా నేను దేవునితో సహవాసం కలిగియుండుట ప్రారంభించాను మరియు ఆయన నన్ను ఆశీర్వదించుట ప్రారంభించాడు. నా చేతిలో ఒక్క రూపాయి కూడ లేని నేను ఇప్పుడు ఆర్థికముగా దీవించబడ్డాను. ప్రభువు నాకు మంచి ఉద్యోగమును, నాకు మరియు నా భార్యకు రెండు బైకులను అనుగ్రహించి ఆశీర్వదించాడు. మేము ఒక స్థలము కొనుగోలు చేసి, సొంత గృహమును నిర్మించుకొనుట ప్రారంభించాము. ప్రార్థన గోపుర పరిచర్యకు నేను క్రమముగా నా కానుకను సమర్పించుచున్నాను. దేవునికే సమస్త మహిమ కులుగును గాక.’’
దేవుడు వారి కొరతలన్నిటిని అత్యధిక ఆశీర్వాదములుగా మార్చాడు. అదే దేవుడు మిమ్మును కూడ మీకు అవసరమైనదాని కంటె అధికముగా ఆశీర్వదించును. నేడు మీరు ప్రాధమిక అవసరముల కొరకు కష్టపడుతూ ఉండవచ్చును కానీ దేవుడు మీకు అత్యధికమైన ఆశీర్వాదములను అనుగ్రహించెదనని మీతో చెప్పుచున్నాడు. ‘‘మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగువాటన్నిటికంటెను, ఊహించువాటన్నిటికంటెను అత్యధికముగా చేయ శక్తిగల దేవుడు’’ (ఎఫెసీయులకు 3:20) అని దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది. మీరు చేయవలసినదంతయు మొదటిగా మీరు మీ జీవితములో ప్రభువును మరియు ఆయన మార్గమును వెదకవలెను. మీరు దేవుని ఉన్నతమైన ఆశీర్వాదములను అనుభవించెదరు. కనుక చింతించకండి.
Prayer:
ప్రేమగల తండ్రీ,

నీవు నా జీవితములో అనేక ఆశీర్వాదములను ఇచ్చెదనని వాగ్దానము చేసినందుకై నీకు స్తోత్రములు  చెల్లించుచున్నాను. నీ యొక్క అత్యధికమైన ఆశీర్వాదములను పొందుకొనుటకు మొదటిగా నిన్ను వెదకుటకు నాకు కృపను అనుగ్రహించుము. పైనున్న వాటి మీదనే నా మనస్సు నుంచుటకును మరియు నేను చేయు పనులన్నియు నీకు ప్రీతికరముగా ఉండుటకును నాకు సహాయము చేయుము. నీ వాక్యమే నాకు ఆనందమైయుండునట్లుగా కృప చూపించమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రీ, ఆమేన్‌.

For Prayer Help (24x7) - 044 45 999 000