Loading...
Dr. Paul Dhinakaran

దేవుని ఉపకారముల చేత మిమ్మల్ని తృప్తిపరుస్తాడు!

Dr. Paul Dhinakaran
02 Aug
నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీకు మరియు మీ కుటుంబానికి దేవుడు శాంతి సమాధానములను అనుగ్రహించాలని మీ పట్ల కోరుచున్నాడు. అటువంటి దైవీకమైన శాంతిని మీరు పొందుకొనుటకు మీకేమి చేయాలో తోచక, ఎంతోమంది వారి జీవితాలలో ఉన్న బంధకాల నుండి విడుదల కొరకు మనుష్యుల యొద్దకు అటుఇటుపరిగెత్తుతారు. అయితే, నేడు ఈ లోకమివ్వలేని శాంతిని మీరు పొందకొనవలెననగా, నేడు ప్రభువైన యేసు వద్దకు రండి. దేవుడిచ్చే శాంతి సమాధానము సమస్త రోగాలకు మరియు దుఃఖానికి ఔషధం వంటిది. దుఃఖములో ఉన్న మిమ్మల్ని ప్రభువు ఎంతగానో ఆదరించుచున్నాడు. ఆయన మీ పట్ల జాగ్రత్త వహిస్తూ, ఈ రోజు నుండి సమస్త మేలులతో మిమ్మల్ని నింపుతాడు. అవును, దేవుడు మనకు తండ్రియై యున్నాడు. మనం ఎల్లప్పుడు సంతోషంగా ఉండాలని ఆయన మన పట్ల కోరుకొనుచున్నాడు. అందుకే ఆయన తన యొక్క శాంతిని మనకు ఇచ్చుట మాత్రమే కాదు, తాను మన పట్ల ఉపకారములను జరిగించాలని ఆశించుచున్నాడు. " క్రొవ్వుతో యాజకులను సంతోషపరచెదను, నా జనులు నా ఉపకారములను తెలిసికొని తృప్తి నొందుదురు; ఇదే యెహోవా వాక్కు'' (యిర్మీయా గ్రంథము 31:14) అన్న వచనము ప్రకారము నేడు ఈ సందేశము చదువుచున్న మీరు ఎల్లవేళలలోను శాంతి సమాధానములతో నింపబడి యుండాలని దేవుడు మీ పట్ల కోరుచున్నాడు. అందుకే ప్రభువు తన శిష్యులను దర్శించిన ప్రతిసారీ ఆయన తన ఉపకారములను గురించి వారికి తెలియజేసెను. ఈ రోజు కూడా మీరు ఎదుర్కొంటున్న క్లిష్టమైన పరిస్థితులన్నియు సమస్తమును మీకు శాంతిని కలిగించునట్లు చేస్తుంది. మీరు ఆనందంతో నింపబడి, దేవుని సమృద్ధిగల మంచితనంతో ఈ రోజును ముగించండి. ఈ ప్రయోజనం కోసం ప్రభువు మీతో ఎల్లప్పుడు ఉన్నాడని మీరు మరువకండి. ఒకసారి యేసు కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహు జనసమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో ఒక కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి " ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనెను.'' అందుకాయన, చెయ్యి చాపి వాని ముట్టి, " నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా '' తక్షణమే వాని కుష్టరోగము శుద్ధియాయెను. (మత్తయి సువార్త 8:1,2).

ఆ దినములలో, ఒక కుష్ఠురోగి తన కుటుంబ సభ్యుల నుండి వేరు చేయబడి, ఒక ప్రత్యేక స్థలమైన మారుమూల ప్రదేశంలో దూరంగా ఉండవలసి వచ్చెను. ఎందుకంటే, వారు అపవిత్రులు ఎంచబడుదురు. కాబట్టి, వారు ఒంటరిగా నివసించాలి. వారు తమ కుటుంబాన్ని విడిచిపెట్టి ఒంటరిగా దూర ప్రాంతానికి వెళ్లాలి. మన కాలంలో, కరోనా బారిన పడిన వ్యక్తులు వారి కుటుంబం నుండి ఏలాగున వేరుచేయబడవలసిన నిర్బంధంలో ఉన్నారు. వారు తమ ప్రియమైనవారి నుండి వేరుచేయబడి ఆసుపత్రులలో ఒంటరిగా ఉంటున్నారు. వారిలో కొందరు చనిపోతే, వారి మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు సమాధిచేయడానికి కూడ ఇవ్వకుండా, వారే, దహనం చేస్తున్నారు. అనేక దేశాలలో, వాటిని సామూహిక సమాధులలో సమాధి చేస్తున్నారు. వారు ఒకే గోతిలో వందలాదిమందిని సమాధి చేస్తున్నారు. ఇవి అపాయకరమైన దినములు. ఆనాడు ఒక కుష్ఠురోగి ఇలాంటి పరిస్థితిలో ఉండేవాడు. ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రములను చింపివేయవలెను; వాడు తల విరియబోసికొనవలెను; వాడు తన పైపెదవిని కప్పుకొని, " అపవిత్రుడను, అపవిత్రుడను '' అని బిగ్గరగా పలుకవలెను. అలాగే, ఎవరైనా కుష్ఠురోగిని తాకినట్లయితే, ఆ వ్యక్తి కూడ అపవిత్రుడుగా ఎంచబడును. అది ఆనాటి ధర్మశాస్త్రము యొక్క న్యాయవిధులై యుండెను.
నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు అలాంటి విచారకరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారా? మీరు అపవిత్రులు అని మీ స్వంత హృదయం నిందిస్తూ ఉండవచ్చును. మీరు తృణీకరించబడి మరియు అందరిచేత తిరస్కరించబడ్డారని భావిస్తున్నారా? నా దగ్గరకు రావద్దు, నేను శపించబడ్డాను అని మీరు చెబుతూ ఉండవచ్చును. ఈ స్థితిలో కుష్ఠురోగి మాత్రమే యేసు ప్రభువు యొక్క కనికరమును కోరుకుంటూ ఆయన యొద్దకు వచ్చాడు. అప్పుడు ఏమి జరిగిందో తెలుసా? ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, " ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనెను. ప్రభువు అతని మాట విని, అందుకాయన చెయ్యి చాపి వాని ముట్టి నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్టరోగము శుద్ధియాయెను '' (మత్తయి 8:3). ఆలాగుననే, ఆయన ఆ కుష్ఠురోగిని స్వస్థపరచాడు. " దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద ఋణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి, దానిమీది చేవ్రాతను తుడిచివేసి, మనకు అడ్డములేకుండ దానిని ఎత్తి వేసి మన అపరాధములనన్నిటిని క్షమించి, ఆయనతో కూడ మిమ్మును జీవింపచేసెను; ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి, సిలువచేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరచెను '' (కొలొస్సయులకు 2:14). ఆలాగుననే, ఆ కుష్ఠురోగిని యేసు ముట్టెను. అతని పట్ల ఇది ప్రభువు యొక్క కనికరమును కనుపరుస్తుంది. కారణము, " యేసుక్రీస్తు నిన్న, నేడు, ఒక్కటేరీతిగా ఉన్నాడు; అవును యుగయుగములకును ఒక్కటే రీతిగా ఉండును '' (హెబ్రీయులకు 13:8) అన్న వచనము ప్రకారము ఆయన ఎన్నటికిని మారని దేవుడై యున్నాడు. నేడు ఈ సందేశము చదువుచున్న మిమ్మల్ని ఆశీర్వదించడానికి మీ వైపు ఇంకను ఆయన చేతులు చాచి యున్నవి. ఆలాగైతే నిరాశపడవద్దు, మీరు గొప్ప అద్భుతమును చూస్తారు. కాబట్టి,ఈనాడు మీ కుటుంబములో శాంతి సమాధానము కొరత కలిగి యున్నట్లయితే, నేడే సమాధానకర్తయైన దేవునికి మీ జీవితాలను సమర్పించుకొన్నట్లయితే, నిశ్చయముగా ఆయన మీ గృహములోనికి మరియు జీవితములోనికి వచ్చి, సమాధానముతో నింపి, లోకము ఇవ్వలేని శాంతితో మిమ్మల్ని నింపి, మీ పట్ల గొప్ప ఉపకారములను జరిగించి మిమ్మల్ని తృప్తిపరుస్తాడు.
Prayer:
సమాధానమునకు కర్తవైన మా ప్రియ పరమ తండ్రీ,
 
నిన్ను స్తుతించుచున్నాము. ఎటువంటి స్థితిలోను మేము నిన్ను విడువకుండా హత్తుకొని జీవించునట్లు మాకు సహాయము చేయుము. ప్రభువా, మా జీవితములో నీ యొక్క ఉపకారములను చూచునట్లుగా మమ్మల్ని మార్చుము. మా కుటుంబములో ఉన్న పోరాటములను తొలగించి, మాకు నీ యొక్క దైవీకమైన సమాధానమును అనుగ్రహించుము. వ్యాధితో బాధపడుచున్న మమ్మల్ని నీ దివ్య హస్తములకు అప్పగించుకొనుచున్నాము. దేవా, శాంతిలేని మా కుటుంబములో నీ శాంతితో మమ్మల్ని నింపుము. లోకమివ్వలేని శాంతిని మాకు దయచేయుము. దేవా, మా జీవితములో ఉన్న కొరతలన్నిటిని తీర్చి, మమ్మల్ని తృప్తిపరచుము. నీ కనికరమును మాపై కనుపరచి, మమ్మల్ని ఆదరించి, నీ యొక్క శాంతితోను మరియు సమాధానముతోను మేము ఈ లోకములో జీవించునట్లు మాకు సహాయము చేయుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000