Loading...
26 Jan

1. పరిశుద్ధుల కొరకైన యీ పరిచర్యను గూర్చి మీ పేరు వ్రాయుటకు నా కగత్యములేదు.
 
2. మీ మనస్సు సిద్ధమై యున్నదని నేనెరుగుదును. అందువలన సంవత్సరము నుండి అకయ సిద్ధపడియున్నదని చెప్పి, నేను మిమ్మును గూర్చి మాసిదోనియ వారి యెదుట అతిశయపడుచున్నాను; మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపింపబడిరి.
 
3. అయితే మిమ్మును గూర్చిన మా అతిశయము ఈ విషయములో వ్యర్థము కాకుండునట్లు, నేను చెప్పిన ప్రకారము మీరు సిద్ధముగా ఉండుటకై యీ సహోదరులను పంపితిని.
 
4. మీరు సిద్ధపడని యెడల ఒకవేళ మాసిదోనియ వారెవరైనను నాతో కూడ వచ్చి మీరు సిద్ధముగా ఉండకపోవుట చూచిన యెడల, ఈ నమ్మిక కలిగియున్నందుకు మేము సిగ్గుపరచబడుదుము; మీరును సిగ్గుపరచబడుదురని యిక చెప్పనేల?
 
5. కావున లోగడ ఇచ్చెదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇయ్యవలెనని చెప్పి, సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దానిని జమచేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచితిని.
 
6. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంటకోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటకోయును అని యీ విషయమై చెప్పవచ్చును.
 
7. సణుగుకొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను; దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును.
 
8. మరియు అన్నిటియందు ఎల్లప్పుడును మీలో మీరు సర్వసమృద్ధిగలవారై ఉత్తమమైన ప్రతికార్యము చేయుటకు దేవుడు మీ యెడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు.
 
9. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను అతని నీతి నిరంతరము నిలుచును అని వ్రాయబడియున్నది.
 
10. విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి, మీరు ప్రతి విషయములో పూర్ణౌదార్యభాగ్యముగలవారగునట్లు, మీ నీతిఫలములు వృద్ధిపొందించును.
 
11. ఇట్టి, ఔదార్యము వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును.
 
12. ఏలయనగా ఈ సేవను గూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయము కలుగజేయుట మాత్రము కాకుండ, అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలముగా విస్తరించుచున్నది.
 
13. ఏలాగనగా క్రీస్తుసువార్తను అంగీకరింతుమని ఒప్పుకొనుట యందు మీరు విధేయులైనందుచేతను, వారి విషయమును అందరి విషయమును ఇంత ఔదార్యముగా ధర్మము చేసినందుచేతను, ఈ పరిచర్య మూలముగా మీ యోగ్యత కనబడినందున వారు దేవుని మహిమపరచుచున్నారు.
 
14. మరియు మీ యెడల దేవుడు కనుపరచిన అత్యధికమైన కృపను చూచి, వారు మీ నిమిత్తమై ప్రార్థన చేయుచు, మిమ్మును చూడవలెనని ఎక్కువ కోరిక గలవారై యున్నారు.
 
15. చెప్పశక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము.

Telugu